మసీదుల నుండి వచ్చే లౌడ్ స్పీకర్ శబ్దాలపై సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ మసీదుల లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని తగ్గించాలని సరికొత్త మార్గదర్శకాలు తీసుకుని వచ్చింది. కేవలం అజాన్, ఇకామత్ సమయాల్లో మాత్రమే లౌడ్ స్పీకర్లను వినియోగించాలని సౌదీ ప్రభుత్వం తెలిపింది. సౌదీ అరేబియా ఇస్లామిక్ అఫైర్స్ మినిస్టర్ అబ్దుల్ లతీఫ్ షేక్ అన్ని మసీదులకు కొత్త నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. ముఖ్యంగా లౌడ్ స్పీకర్ల నుండి మూడవ వంతు మాత్రమే శబ్దం రావాలని సూచించారు. మూడింట ఒక వంతు మాత్రమే లౌడ్ స్పీకర్ల నుండి శబ్దం రావాలని.. అలా కాకుండా ఈ నియమాలను పాటించని వారిపై భారీ జరిమానాలను విధిస్తామని.. వాటిని చెల్లించక తప్పదని సూచనలను చేశారు.
షరియా చట్టం ప్రకారం దేవుడిని ప్రశాంతంగా పిలవాలి.. ప్రార్థనలు కూడా ప్రశాంతంగా సాగాలి.. ఇతరులను ఇబ్బంది పెట్టేలా ప్రార్థనలు ఉండకూడదని కొత్త సర్క్యులర్ లో సూచించారు. విపరీతమైన శబ్దం వచ్చేలా లౌడ్ స్పీకర్లను, ఆంప్లిఫయర్లను ఉపయోగించడం ద్వారా మసీదులకు దగ్గరగా నివసిస్తున్న కుటుంబాలకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. రోగులు, ముసలి వాళ్ళు, పిల్లలకు భారీ శబ్దాలు చెడు చేస్తాయని తెలిపారు. ఇమామ్ నిర్వహించే ప్రార్థనలు మసీదులలోని భక్తులకు ప్రత్యేకంగా ఉండాలని, అది ఇంట్లో ఉన్నవారికి తెలియజేయడానికి చట్టబద్ధమైన అవసరం లేదని మంత్రిత్వ శాఖ తీర్పు ఇచ్చింది. లౌడ్ స్పీకర్లను ఉపయోగించి ఖురాన్ ను పఠించడం కూడా చాలా తప్పని తెలిపారు. లౌడ్‌స్పీకర్లను ఉపయోగించి బిగ్గరగా ఖురాన్ లోని పద్యాలను చదవడం ఖురాన్ ను అగౌరవించినట్లేనని సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ తెలిపింది. సౌదీ అరేబియాకు చెందిన ఇస్లామిక్ స్కాలర్లైన షేక్ మొహమ్మద్ బిన్ సలేహ్ అల్ ఓతాయ్మీన్, సలేహ్ అల్ ఫజాన్ లు కూడా ఇదే విషయాన్ని సూచిస్తూ ఫత్వాలను జారీ చేశారు. 2019 రంజాన్ సమయంలోబ్ మసీదుల్లో లౌడ్ స్పీకర్ శబ్దాలను తగ్గించాలని కోరింది. ఇప్పుడు లౌడ్ స్పీకర్ శబ్దాలపై మరి కొన్ని సూచనలను చేసింది.