81 మందిని ఉరి తీసిన సౌదీ అరేబియా ప్రభుత్వం.. ఆ ముస్లిం వర్గాన్నే టార్గెట్ చేశారా..?

0
784

సౌదీ అరేబియా ప్రభుత్వం ఒకేరోజున 81 మందిని ఉరితీసింది. సౌదీ అరేబియా శనివారం నాడు 81 మందికి మరణశిక్షను విధించింది, సౌదీ అరేబియాలో ఇటీవలి కాలంలో అతిపెద్ద సామూహిక ఉరిశిక్షలు ఇవేనని అంటున్నారు. మరణశిక్షను అమలుచేయడాన్ని తగ్గిస్తామని ఇంతకు ముందు సౌదీ అరేబియా చెప్పినా కూడా ఆ దేశ ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి మార్పు కూడా లేదు.

అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రచురించిన ఒక ప్రకటనలో.. సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా తీవ్ర నేరాలకు పాల్పడిన పౌరులు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారు ఉరితీయబడ్డారని తెలిపారు. ఎలా ఉరితీశారో చెప్పలేదు.మరణశిక్షకు గురైన వారిలో ఏడుగురు యెమెన్‌లు, ఒక సిరియన్‌ ఉన్నారని.. మిగిలిన వారు సౌదీ అరేబియాకు చెందిన వారు. మరణశిక్షకు గురైన వారిలో కొందరు అల్ ఖైదా, ఐసిస్, యెమెన్ హౌతీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగివున్నట్టు నిర్ధారణ కాగా, కొందరు మహిళలను, పిల్లలను చంపినట్టు తేలింది. ఉరి తీసిన వారిలో 73 మంది సౌదీ అరేబియా జాతీయులు కాగా, ఏడుగురు యెమెన్ దేశస్తులు, ఒక సిరియా పౌరుడు కూడా ఉన్నారు. గత మూడున్నర దశాబ్దాల కాలంలో ఒకేరోజు ఇంతమందికి మరణశిక్ష అమలు చేయడం ఇదే ప్రథమం. 1980లో సౌదీలో ఒకేరోజు 63 మంది తలలు నరికి మరణశిక్ష అమలు చేశారు.

మానవహక్కుల సంఘాలు ఉరిశిక్షలను ఖండించాయి. సౌదీ అరేబియా ప్రస్తుత పాలకుడు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్.. దేశంలో న్యాయ వ్యవస్థను సమూలంగా మారుస్తున్నామని, మరణశిక్షలను తగ్గిస్తామని ఇంతకు ముందు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సామూహిక ఉరిశిక్షల కారణంగా వారంతా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఈ ఉరిశిక్షలు చట్ట వ్యతిరేకమని యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ అలీ అడుబుసి అన్నారు. సౌదీ అరేబియా ఇటీవలి సంవత్సరాలలో మరింతగా పర్యాటకాన్ని, వ్యాపారాలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నందున ఆ దేశ ఇమేజ్‌ను మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలాంటి శిక్షల వార్తలు కాస్త ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఉరితీయబడిన 81 మంది వ్యక్తులను పర్యవేక్షించి, డాక్యుమెంట్ చేసిన కేసులలో.. సౌదీ అరేబియా బహిరంగపరచిన ప్రమాణాల ప్రకారం మరణశిక్షకు అర్హమైన ఆరోపణలేవీ కాదని హక్కుల సంఘాల నేతలు తెలిపారు.

సౌదీ న్యాయ వ్యవస్థలో పారదర్శకత లోపించడం వల్ల, కొంతమంది నిందితుల కుటుంబ సభ్యులను బెదిరించడం వల్ల చాలా కేసులను నమోదు చేయలేకపోతున్నారు. ఉరితీయబడిన వారిలో చాలా మంది సౌదీ అరేబియాలోని షియా ముస్లిం మైనారిటీకి చెందినవారని, షియాలపై వివక్ష కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయని హక్కుల సంఘాలు ఆరోపించాయి.