సౌదీ అరేబియా ప్రపంచకప్ విజయం తర్వాత పబ్లిక్ హాలిడే ప్రకటించేశారు

0
680

FIFA ప్రపంచ కప్‌లో అర్జెంటీనాపై ఫుట్‌బాల్ జట్టు 2-1 తేడాతో విజయం సాధించిన తర్వాత సౌదీ అరేబియా రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ బుధవారం సెలవు ఉంటుందని సౌదీ రాజు సల్మాన్ ప్రకటించారు. పాఠశాలలను కూడా మూసివేశారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. నగరంలోని ప్రధాన థీమ్ పార్కులు, వినోద కేంద్రాలలో ప్రవేశ రుసుము మాఫీ చేశారని రాయల్ కోర్ట్ సలహాదారు, సౌదీ అరేబియా జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ అధిపతి టర్కీ అల్-షేక్ ట్విట్టర్‌లో ప్రకటించారు.

ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో వరల్డ్ నెంబర్-3 జట్టు అర్జెంటీనాను ఆసియా పసికూన సౌదీ అరేబియా (51వ ర్యాంకు) ఓడించింది. వరుసగా 36 మ్యాచ్ ల్లో గెలిచి వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన అర్జెంటీనా జైత్రయాత్రకు ఈ మ్యాచ్ తో సౌదీ అడ్డుకట్ట వేసింది. అర్జెంటీనాను సౌదీ అరేబియా 2-1 తేడాతో చిత్తుచేసింది. గ్రూప్-సి మ్యాచ్ లో తొలి గోల్ అర్జెంటీనానే చేసింది. మ్యాచ్ 10వ నిమిషంలో మెస్సీ చేసిన గోల్ తో అర్జెంటీనా జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, 48వ నిమిషంలో సలేహ్ అల్ షెహ్రీ చేసిన గోల్ లో సౌదీ 1-1తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత మరో ఐదు నిమిషాలకే సలేమ్ అల్ దవ్సారీ చేసిన గోల్ తో 2-1తో సౌదీ అరేబియా ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఆ తరువాత అర్జెంటీనా మ్యాచ్ లో పుంజుకోడానికి ప్రయత్నించినా.. అవకాశం దక్కలేదు.

దీంతో సౌదీ అరేబియాలో సెలెబ్రేషన్స్ తారా స్థాయికి చేరుకున్నాయి. సెలవును ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని ఉద్యోగులందరికీ, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ వర్తిస్తుందని తెలిపారు. సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్ బుధవారం మూసివేసి.. గురువారం తిరిగి తెరవనున్నారని స్టేట్ టివి మంగళవారం నివేదించింది.