More

    చైనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు షాకిచ్చిన సౌదీ

    చైనీస్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి సౌదీ అరేబియా ఊహించని షాక్ ఇచ్చింది. ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి తమ దేశంలో ఎంట్రీ లేదని తేల్చి చెప్పింది. దీంతో పాకిస్తానీయుల్లో కలవరం మొదలైంది. ఎందుకంటే చాలా మంది పాకిస్తాన్ ప్రజలు చైనీస్ సినోవాక్, సినోఫామ్ వ్యాక్సిన్లను వేయించుకున్నారు. ఇక చైనా సహకారంతో పాకిస్తాన్ వ్యాక్సిన్ ను కూడా ఇటీవలే తయారు చేశామని చెప్పింది. సౌదీ అరేబియా ఆంక్షలతో పాకిస్తాన్ ప్రముఖులు కూడా షాక్ తిన్నారు. జూన్ 6 న చైనీస్ వ్యాక్సిన్లను వేసుకున్న వాళ్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ సౌదీ ప్రభుత్వాన్ని వేడుకుంది.

    పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ ‘ఈ విషయాన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డైరెక్ట్ గా సౌదీ అరేబియా ప్రభుత్వంతో చర్చిస్తారని.. చైనీస్ వ్యాక్సిన్లు వేసుకున్న వారికి అనుమతులు వచ్చేలా గుడ్ న్యూస్ చెబుతారని’ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ మిడిల్ ఈస్ట్ దేశాల నేతలతో మాట్లాడుతూ ఉన్నారని తెలిపారు. చైనీస్ వ్యాక్సిన్లపై రషీద్ అహ్మద్ ప్రశంసల వర్షం కురిపించారు. సినోఫామ్ చాలా గొప్ప వ్యాక్సిన్ అని.. తమ దేశానికి ఈ వ్యాక్సిన్ ఇచ్చిన చైనాకు చాలా రుణపడి ఉన్నామని అన్నారు.

    మరో మంత్రి అసద్ ఉమర్ మాట్లాడుతూ సౌదీ అరేబియా, హజ్ లాంటి ప్రాంతాలకు ఉద్యోగాలకు, చదువులకు వెళ్లే వారికి ఫైజర్ వ్యాక్సిన్లను అందిస్తామని తెలిపారు. చైనీస్ వ్యాక్సిన్లు వేయించుకున్నట్లుగా చూపిస్తున్న సర్టిఫికెట్లను ప్రపంచ దేశాలు ఒప్పుకోవడం లేదని అన్నారు. ఒక్కో దేశం ఇలా వ్యాక్సిన్ల విషయంలో షరతులు పెట్టుకుంటూ వెళితే ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటారని వెల్లడించారు.

    చైనీస్ వ్యాక్సిన్లకు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా:

    సౌదీ అరేబియా చైనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్లు ఉన్న వారిని అనుమతించలేదు. ఫైజర్, ఆస్ట్రాజెనికా (కోవిషీల్డ్), మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీల వ్యాక్సిన్లు వేయించుకున్న వాళ్లకు అనుమతులు ఇచ్చింది. చైనీస్ వ్యాక్సిన్లు వేయించుకున్న విదేశీయులకు తమ దేశంలో అనుమతి లేదని తేల్చి చెప్పింది.

    చైనీస్ వ్యాక్సిన్ల నాణ్యతపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకే సౌదీ అరేబియా కూడా చైనీస్ వ్యాక్సిన్లు వేయించుకున్న విదేశీయులు తమ దేశంలోకి నో ఎంట్రీ అని చెప్పుకొచ్చింది. దీంతో కొన్ని దేశాలు ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. చైనా 115 మిలియన్ల వ్యాక్సిన్లను 60కి పైగా దేశాలకు పంపించింది. బ్రెజిల్, పాకిస్తాన్, టర్కీ దేశాలు చైనా వ్యాక్సిన్లను తమ దేశ ప్రజలకు ఇచ్చాయి. ఇప్పుడు ఆ వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి నో ఎంట్రీ అంటూ సౌదీ అరేబియా చెప్తుండడంతో పెద్ద షాక్ తగిలింది.

    Trending Stories

    Related Stories