జైల్లో మంత్రికి రాజభోగాలు.. ట్విస్టుల మీద ట్విస్టులు

0
650

ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కు జైల్లో అందించిన రాజభోగాలపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే..! ఆయనకు సంబంధించిన మరొక వీడియో బయటికొచ్చింది. ఇప్పటికే సత్యేంద్ర జైన్ తన కాళ్లకు మసాజ్ చేయించుకుంటున్న వీడియో బయటకు రాగా.. తాజాగా ఆయన ఆహారం తీసుకుంటున్న మరో వీడియోను రిలీజ్ చేశారు. జైల్లో సత్యేంద్రజైన్ 8 కిలోల బరువు పెరిగినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. జైల్లో సత్యేంద్ర జైన్ 28 కిలోల బరువు తగ్గినట్లు ఆయన లాయర్ చెప్పారు. కానీ వీడియోలో మాత్రం ఆయన మంచి భోజనాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సత్యేంద్ర జైన్ మంచంపై పడుకుని విశ్రాంతి తీసుకుంటుండగా, ఓ వ్యక్తి ఆయనకు మసాజ్ చేస్తూ కనిపించిన వీడియో తీవ్ర దుమారం రేపింది. ఆ మసాజ్ చేసిన వ్యక్తి కూడా జైలు ఖైదీయే. అతడు కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడి పేరు రింకూ. 10వ తరగతి చదువుతున్న కూతురిని రేప్ చేశాడంటూ అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గతేడాది అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాంటి వ్యక్తితో ఆప్ మంత్రి జైల్లో మసాజ్ చేయించుకోవడం పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాజ్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ కోరుతోంది. మంత్రి సత్యేంద్ర జైన్ ను ఇకపై క్యాబినెట్ లో కొనసాగించకూడదనే డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి.