కాకినాడ జిల్లాలోని సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందారు. తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే మిస్ ఫైర్ జరిగి ఎస్సై మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం, జిల్లా ఎస్పీ వేధింపుల వల్లే గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సీఎం బందోబస్తుకు వెళ్లి వచ్చిన ఎస్ఐ గోపాలకృష్ణ ఇంట్లో గన్ తో కాల్చుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. గోపాలకృష్ణ స్వస్థలం విజయవాడ సమీపంలోని జగ్గయ్య చెరువు గ్రామం. 2014 బ్యాచ్ లో ఎస్ఐగా సెలక్ట్ అయ్యాడు గోపాలకృష్ణ. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు భార్యాపిల్లలు నిద్రిస్తున్న సమయంలో తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
గోపాలకృష్ణకు ట్రైనింగ్ పూర్తయ్యాక కొన్నాళ్లు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహించాడు. ఆ తర్వాత స్టేషన్ బాధ్యతలు ఇవ్వకుండా సర్పవరం సర్కిల్లో పోస్టింగ్ వేశారు. అధికారుల తీరుపై కొన్నాళ్లుగా ఎస్‌ఐ గోపాలకృష్ణ మనస్తాపం చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మృతదేహాన్ని ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.