ముంబయి క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ ఓ ఇంటివాడు అయ్యాడు. జమ్మూకశ్మీరుకు చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఖాన్ కశ్మీరులోని షోపియాన్ జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నల్లరంగు షేర్వానీలో సర్ఫరాజ్ ఖాన్, కశ్మీరు వధువు ఎర్రరంగు చుడీదార్ లో మెరిశారు.
“Alhamdulillah married,” అంటూ సర్ఫరాజ్ తనకు పెళ్లి అయినట్లు పోస్టు పెట్టాడు. స్థానిక మీడియా సంస్థతో సర్ఫరాజ్ మాట్లాడుతూ.. “కశ్మీర్‌లో పెళ్లి చేసుకోవడం నా విధి.. ఆ దేవుడు ఇది నిర్ణయించాడు. నేను ఇక్కడ ఎంతో ప్రేమను పొందాను. నాకు సమయం దొరికినప్పుడల్లా నేను కశ్మీర్ కు వస్తుంటాను” అని సర్ఫరాజ్ చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ భారత జట్టుకు సర్ఫరాజ్ ఎంపిక అవ్వడం లేదు. దీనిపై కూడా సర్ఫరాజ్ స్పందించాడు. “నేను ఇక్కడే పెళ్లి చేసుకుంటానని అల్లా రాశాడు. అదే విధంగా నేను భారత్‌కు ఆడతానని రాసి ఉంటే తప్పకుండా జరిగి తీరుతుంది.” అని చెప్పడం విశేషం. సోషల్ మీడియాలో సర్ఫరాజ్ కు పలువురు క్రికెటర్లు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అతని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు చాలా మంది క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. భారత స్టార్లు అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. సూర్యకుమార్ కెప్టెన్సీలో డిసెంబర్ 2014లో రంజీ ట్రోఫీలో ముంబై తరఫున సర్ఫరాజ్ అరంగేట్రం చేశాడు.
సర్ఫరాజ్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అతడికి భారత టెస్టు జట్టులో అవకాశం ఇవ్వడం లేదని బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న సర్ఫరాజ్.. T20 ఫార్మాట్‌లో ఇంకా ఆకట్టుకోలేకపోయాడు. అయితే సర్ఫరాజ్ గత నాలుగు సంవత్సరాలుగా దేశీయ ఫస్ట్ క్లాస్ సర్క్యూట్‌లో అత్యంత నిలకడగా ఆడుతున్న బ్యాట్స్మెన్లలో ఒకడు. 2022-23 రంజీ ట్రోఫీ లో 92.66 సగటుతో ఆరు గేమ్‌ల్లో 556 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక 2021-22 రంజీ ట్రోఫీ సీజన్‌లో, అతను 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు.