రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. అలాగే ఎవరు ఎప్పుడు ఏ పార్టీకి మారుతారో ఎవరికీ అర్ధం కాదు. ఎప్పుడు ఏ ప్రభుత్వం కూలిపోతుందో..? ఎవరు అధికార పీఠం ఎక్కువతారో ఊహించలేం. విశ్వాసానికి మారుపేరు అయినా వ్యక్తులు కూడా రాజకీయాల్లో వెన్నుపోట్లు పొడుస్తుంటారు. అలాంటి ఘటనే ఒకటి మహరాష్ట్రలో చోటు చేసుకుంది.
మహసంక్షోభంలో అనేక ట్విస్ట్ ల తర్వాత షిండే ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. అయితే సోమవారం జరిగిన బలపరీక్షలో మాత్రం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నిన్నటి వరకు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అండగా ఉన్న శివసేన ఎమ్మెల్యే సంతోష్ భాంగర్ ఒక్కసారిగా రూటు మార్చేశారు. వారం రోజుల క్రితం ఉద్ధవ్ కోసం ప్రచారం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే సంతోష్.. సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో ఏక్నాథ్ షిండేకు మద్దతు ప్రకటించారు.
అయితే గత రెండు వారాల నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ వర్గం.. ఉద్ధవ్ నుంచి వేరుపడిన సమయంలో ఎమ్మెల్యే సంతోష్ తన నియోజకవర్గంలో ఓ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆ ర్యాలీలో ప్రజలంతా ఉద్ధవ్‌కు మద్దతుగా నిలువాలని కోరారు. ఉద్వేగంగా మాట్లాడుతూ ఉద్ధవ్ వద్దకు ఏక్నాథ్ రావాలని కోరుకున్నారు. ఆ ప్రసంగం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే సంతోష్ భాంగర్ ఏడ్చేశారు. ర్యాలీలో పక్కనే ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే సంతోష్ కన్నీళ్లను కూడా తూడ్చాడు. ఉద్ధవ్తోనే తామంతా ఉన్నట్లు కూడా చెప్పారు. జూన్ 24వ తేదీన ఈ ఘటన జరిగింది. కానీ సోమవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష సమయంలో ఎమ్మెల్యే భాంగర్ తన మద్దతును ఏక్నాథ్ షిండేకు అనుకూలంగా ప్రకటించారు. మరో ఎమ్మెల్యే శ్యామ్‌సుందర్ షిండే కూడా చివరి నిమిషంలో ఏక్‌నాథ్‌కు అనుకూలంగా ఓటేశారు.
ఇక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేవిశ్వాస పరీక్షలో విజయం సాధించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన బలపరీక్షలో సీఎం షిండే నెగ్గారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. షిండేను మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు సమర్థించారు. దీంతో ఆయన బలపరీక్షలో గెలుపొందినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే శనివారం నాడు ప్రమాణస్వీకారం చేయగా, గవర్నర్ ఆదేశాల మేరకు బలపరీక్ష నిమిత్తం రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివానం నాటి సభలో స్పీకర్ ఎన్నిక జరగ్గా.. బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్ గెలుపొందారు. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ బలపరీక్ష ప్రక్రియను చేపట్టారు. సభ్యులు నిలబడి ఉండగా తలలు లెక్కించే విధానంలో విశ్వాస పరీక్ష చేపట్టారు. సీఎం షిండేకు అనుకూలంగా 164 ఓట్లు రాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. సభకు హాజరైన వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. మొత్తంగా 164-99 తేడాతో షిండే విశ్వాస పరీక్షలో నెగ్గారు.
నిజానికి రెబల్ నేత ఏక్నాథ్ షిండేను శివసేన నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించినప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలంతా షిండేనే తమ నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఉద్ధవ్ సైన్యంలేని శివసేనానిగా మిగిలిపోగా, పార్టీ దాదాపు షిండే హస్తగతమైనట్లయింది. అయితే, ఉద్ధవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే పార్టీ కైవసం అధికారికం కానుంది. సీఎం ఏక్నాథ్ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా, చిఫ్‌విప్‌గా మరో తిరుగుబాటు నేత భరత్ గొగవాలేను గుర్తిస్తున్నట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. శివసేన పార్టీని షిండే వర్గం కైవసం చేసుకోవడం, వారిపై అనర్హత వేటు, విప్ జారీ అధికారలు తదితర అంశాలకు సంబధించి ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈనెల 11న విచారణ కు రానుంది. సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నిలిపేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఉద్ధవ్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.