మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉండగా.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ఓ కేంద్ర మంత్రి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ”ఆయన మహారాష్ట్ర బిడ్డ. ఆయనను కొందరు బెదిరిస్తున్నారు. మోదీ జీ, అమిత్ షా జీ మీరు వింటున్నారా? శరద్ పవార్‌ను మీ మంత్రి బెదిరిస్తున్నారు. ఇటువంటి బెదిరింపులను మీరు సమర్థిస్తారా? మహారాష్ట్ర తెలుసుకోవాలనుకుంటోంది” అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మహా వికారస్ అఘాడీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని, రోడ్డుపైనే అడ్డుకుని ఇంటికి వెళ్లనివ్వబోమని శరద్ పవార్‌ను ఓ కేంద్ర మంత్రి బెదిరించారని ఆయన అన్నారు.
శివసేన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది రెబల్ లీడర్ ఏక్నాథ్ షిండే గూటికి చేరడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సహా ఆ పార్టీ అగ్రనాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. షిండేకు ప్రస్తుతం 47 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. వీరిలో 37 మంది శివసేన ఎమ్మెల్యేలే. ఉద్ధవ్ థాకరేకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 13-17కు పడిపోయింది. రెబల్ ఎమ్మెల్యేల బలం మరింత పెరిగింది.