Sports

మరో సారి రవీంద్ర జడేజాపై తీవ్ర విమర్శలు.. విహారిని పక్కన పెట్టి తప్పు చేశారు

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్ ఓటమిపై పలువురు క్రికెట్ లెజెండ్స్ స్పందిస్తూ వస్తున్నారు. రెండు రోజులు ముందుగానే జట్టును ప్రకటించి తప్పు చేశారని.. ముఖ్యంగా ఇద్దరు స్పిన్నర్లు అనవసరమని చెప్పుకొచ్చారు. వర్షం పడిందని తెలిసి కూడా నలుగురు ఫాస్ట్ బౌలర్లను ఆడించలేదని.. లేదా జడేజా స్థానంలో ఒక బ్యాట్స్మెన్ ను తీసుకుని ఉండి ఉంటే పరిస్థితుల్లో చాలా మార్పు ఉండేదని విమర్శలు కురిపించారు.

ప్రముఖ కామెంట్రేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకుని తప్పు చేశారంటూ విమర్శలు గుప్పించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో రవీంద్ర జడేజాను తీసుకుని తప్పు చేశారని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. జడేజా ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసుకొని రెండు ఇన్నింగ్స్‌లలో 15, 16 పరుగులు చేశాడు. భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది, ఆల్‌రౌండర్ ఎంపిక కూడా కరెక్ట్ కాదని.. ఆ పని చేసి తప్పు చేయడమే కాకుండా భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శించాడు. ఆకాశం మేఘావృత‌మై, మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల ఒక రోజు ఆల‌స్యంగా ప్రారంభ‌మైనా ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగ‌డం పెద్ద తప్పని.. జ‌డేజాను టీమ్‌లోకి తీసుకుంది బ్యాటింగ్ కోస‌మే కానీ.. లెఫ్టామ్ స్పిన్ కోసం కాదు. అత‌న్ని కేవ‌లం బ్యాటింగ్ కోస‌మే టీమ్‌లోకి తీసుకోడాన్ని నేను ఎప్ప‌టి నుంచో వ్య‌తిరేకిస్తున్నానని మంజ్రేక‌ర్ అన్నాడు. పిచ్ పొడిగా ఉంది, స్పిన్ అయ్యే చాన్స్ ఉంది అంటే అశ్విన్‌తోపాటు జ‌డేజాను తీసుకోవ‌డంలో అర్థం ఉంది.. కానీ అత‌న్ని కేవ‌లం బ్యాటింగ్ కోసం తీసుకున్న వ్యూహం తప్పని మంజ్రేక‌ర్ అన్నాడు. హ‌నుమ విహారిలాంటి స్పెష‌లిస్ట్ బ్యాట్స్‌మ‌న్‌ను తీసుకున్నా ఇండియా ప‌రిస్థితి మెరుగ్గా ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఒత్తిడి స‌మ‌యాల్లో ఎప్పుడూ అతడు రాణించలేదని అని ప‌రోక్షంగా జ‌డేజాను విమ‌ర్శించాడు.

జడేజా గత మూడేళ్ళలో బ్యాటింగ్ లో బాగా రాణిస్తూ వస్తున్నాడు. అతను బ్యాటింగ్‌తో సగటున 50 కి పైగా ఉండగా, అతని బౌలింగ్ కూడా మెరుగుపడింది. అయితే ఫాస్ట్ బౌలర్లకు కలిసొచ్చేలా ఉన్న పరిస్థితులలో, జడేజాను జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యంగా అనిపించిందని మంజ్రేకర్ తెలిపాడు. వర్షం పడినా కూడా జట్టును మార్చకపోవడం.. డబ్ల్యుటిసి ఫైనల్ ప్రారంభమైన రోజు కూడా ఇంతకు ముందు ప్రకటించిన ఎలెవన్ కు భారత్ అతుక్కుపోయింది. ఉదాహరణకు, హనుమ విహారీ లాంటి స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ కలిగి ఉంటే, జట్టుకు అది ఉపయోగకరంగా ఉండేది. 170 నుండి స్కోరు 220, 225 లేదా 230 అయి ఉండవచ్చు, ఎవరికి తెలుసు? అని మంజ్రేకర్ చెప్పాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 − three =

Back to top button