భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటన చేసింది. 36 సంవత్సరాల సానియా తాను త్వరలోనే రిటైర్మెంట్ అవ్వబోతున్నానని తెలిపింది. ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరగబోయే డబ్ల్యూటీఏ 1000 (విమెన్ టెన్నిస్ అసోసియేషన్) టోర్నీతో తన కెరీర్ కు ముగింపు పలకనున్నట్లు తెలిపింది. మాజీ డబుల్స్ నెంబర్ 1 అయిన సానియా మీర్జా ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే WTA 1000 ఈవెంట్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ అవ్వబోతున్నట్లు ధృవీకరించింది.
దశాబ్దానికి పైగా దుబాయ్లో నివసిస్తున్న భారత టెన్నిస్ స్టార్, అక్కడే వీడ్కోలు పలకాలని చూస్తోంది. గతేడాది సానియా రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నా.. కొన్ని కారణాలవల్ల తర్వాత తన మనసు మార్చుకుంది. యూఎస్ ఓపెన్ ఆడి ఆటకు గుడబై చెప్పాలనుకుంది. కానీ, గాయం కారణంగా టోర్నీకి దూరం అయింది. దాంతో రిటైర్మెంట్ వాయిదా పడింది. గాయంతో కెరీర్ ముగించుకోవాలి అనుకోలేదని.. అందుకే రిటైర్మెంట్ ని పోస్ట్ పోన్ చేశానని సానియా గతంలో చెప్పుకొచ్చింది. జనవరి 16 నుంచి ప్రారంభం కాబోయే ఆస్ట్రేలియా ఓపెన్ లో కూడా సానియా తలపడుతోంది. ఆ తర్వాత దుబాయ్ కు వెళ్లనుంది. 4 ఏళ్ల పిల్లాడు ఇజాన్కు తల్లి అయిన సానియా మీర్జా ఇటీవలే దుబాయ్లో టెన్నిస్ అకాడమీని ప్రారంభించింది.