More

    ఉదయనిధి స్టాలిన్‌, ప్రియాంక్‌ ఖర్గే పై కేసు నమోదు

    సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉదయనిధి స్టాలిన్ పై కేసులు నమోదవుతూ ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లో మరో కేసు నమోదైంది. ఉదయనిధితో పాటు ఆయనకు మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తనయుడు ప్రియాంక్‌ ఖర్గే పై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యల కారణంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హర్ష గుప్తా, రామ్‌ సింగ్‌ లోధి అనే ఇద్దరు న్యాయవాదులు రాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2023 సెప్టెంబర్ 4న సనాతన ధర్మానికి సంబంధించి మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ ఉద్వేగభరితమైన ప్రకటన చేశారని న్యాయవాది హర్ష్ గుప్తా తన ఫిర్యాదులో తెలిపారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటితో పోల్చారని మాట్లాడారు. ఉదయనిధి వ్యాఖ్యలను ప్రియాంక్ ఖర్గే సమర్థించారన్నారు. ఇది హిందూ మతాన్ని విశ్వసించే వారి మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని అన్నారు. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 15న జరగనుంది. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరు దక్షిణ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎన్‌ఆర్‌ రమేశ్‌ ఫిర్యాదు మేరకు బనశంకరి పోలీసు స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు.

    ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై తిరుపతి ఎస్పీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉదయనిధి స్టాలిన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందుమతాన్ని కించపరిచిన ఉదయనిధి స్టాలిన్ సిఫార్సు చేసిన బాలసుబ్రహ్మణ్యం పళని స్వామిని టీటీడీ పాలకమండలిలో సభ్యున్ని చేశారని తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ ప్రతిపాదించిన బాలసుబ్రహ్మణ్యం పళని స్వామిని తక్షణం టీటీడీ పాలకమండలి నుంచి సీఎం జగన్ తొలగించాలని కోరారు. తమిళ భగవద్గీతను ఉదయనిధికి పంపుతున్నామని.. భగవద్గీతను చదివాక ఆయన తప్పకుండా తిరుమలకు వస్తారని భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు.

    చెన్నైలో తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల సంఘం సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని అన్నారు. సామాజిక న్యాయం భావనకు సనాతన ధర్మం వ్యతిరేకమన్నారు. కొన్నింటిని వ్యతిరేకించడం సరిపోదని.. వాటిని పూర్తిగా నిర్మూలించాల్సిందేనన్నారు. మనం డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనా వంటి వాటిని వ్యతిరేకించడం సరిపోదని.. వాటిని సమూలంగా నిర్మూలించాలన్నారు. అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.

    Related Stories