హైదరాబాద్: సంవిధాన్ దివస్ (రాజ్యాంగ దినోత్సవం) శుక్రవారం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ లా కాలేజీలోని సర్దార్ పటేల్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. పాట్నా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నర్సింహారెడ్డి, కేశవ్ మెమోరియల్ వైస్ చైర్మన్ జె.నర్సింహారావు,కేశవ్ మెమోరియల్ సెక్రటరీ ఎ.వి.సుబ్రహ్మణ్యం భారత రాజ్యాంగ నిర్మాతలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో భాగంగా రాజ్యాంగ పీఠికను ప్రముఖులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ భిన్నత్వంలో దేశానికి ఏకత్వాన్ని చాటడంలో రాజ్యాంగం సమర్థంగా పనిచేస్తోందని అన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిని రక్షించడంలో రాజ్యాంగం అత్యున్నత పాత్ర పోషించింది” అని ఆమె తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదర్శాలు, విలువలను ప్రోత్సహించడం ద్వారా రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని పరిరక్షించాలని, ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. 1949లో నవంబర్ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా 2015 సంవత్సరం నుంచి రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రారంభించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ తమిళిసై కృతజ్ఞతలు తెలిపారు.
ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా రాజ్యాంగాన్ని రూపొందించడంలో బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకున్న గవర్నర్ తమిళిసై, ప్రపంచంలోనే అత్యుత్తమమైన, సమగ్రమైన రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన చేసిన కృషికి నివాళులు అర్పించారు. “మన రాజ్యాంగ నిర్మాతలకు మనం నిజమైన నివాళులు అర్పించాలంటే, దానిలో పొందుపరచబడిన విలువలు, ఆదర్శాలను నిలబెట్టడం ద్వారా అన్నిస్థాయిలలో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రోత్సహించడం ద్వారా మాత్రమేనని ఆమె అన్నారు. అలాగే కేశవ్ మెమోరియల్ చైర్మన్ రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి పాట్నా ఎల్. నర్సింహారెడ్డి మాట్లాడుతూ, మన ప్రాచీన సూత్రాల ప్రకారం పౌరులందరికీ ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తున్నందున, ఈ రోజు మనందరం అనుభవిస్తున్న అధికారానికి మన రాజ్యాంగమే మూలమని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.