భారత ప్రధాని నరేంద్ర మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఇటీవల సమావేశమైన సంగతి తెలిసిందే..! గతంలో బీజేపీతో మిత్రత్వాన్ని కొనసాగించిన శివసేన మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ఎన్డీఏకు గుడ్ బై చెప్పి ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చాలా కాలం తర్వాత మోదీతో ఉద్ధవ్ నేరుగా సమావేశం అయ్యారు.
ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ భేటీ కొనసాగింది. మరాఠా రిజర్వేషన్లు, తుపాను నేపథ్యంలో తమ రాష్ట్రానికి అందాల్సిన సాయం, టీకాలు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. ఉద్ధవ్ థాకరే వెంట మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆ రాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ కూడా ఉన్నారు. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేయగా.. ఈ అంశంపై కూడా చర్చించారు.
మోదీతో తన భేటీ పూర్తిగా వ్యక్తిగతమైనదని, ఎలాంటి రాజకీయ కారణాలులేవని ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు. తనకు ప్రధాని మోదీకి మంచి సంబంధాలే ఉన్నాయని.. తాము దూరమైంది రాజకీయాల్లో మాత్రమేనని అన్నారు. తాను కలవడానికి వెళ్లింది నవాజ్ షరీఫ్(పాకిస్థాన్ మాజీ ప్రధాని) కాదని, మనదేశ ప్రధాని నరేంద్ర మోదీతో వ్యక్తిగతంగా భేటీ అవడంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు.

ఈ భేటీపై శివసేన కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ అనుబంధాలు ఎలా ఉన్నా వ్యక్తిగత సంబంధాలకు తమ పార్టీ విలువ ఇస్తుందని శివసేన తెలిపింది. వ్యక్తిగత సంబంధాలు, ప్రొటోకాల్ లో భాగంగానే ప్రధాని మోదీతో ఉద్ధవ్ థాక్రే సమావేశమయ్యారని శివసేన స్పష్టం చేసింది. ఉద్ధవ్ థాక్రే ఢిల్లీ పర్యటన రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదని, మహారాష్ట్రలో పెండింగ్ ప్రాజెక్టులు ఇతర పనులను కేంద్రం నుంచి సాధించుకునేందుకే ఢిల్లీకి వెళ్లారని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన తెలిపింది.