ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని బయటకు తీసుకుని వచ్చిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖడే పేరు దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఆర్యన్‌ఖాన్ క్రూజ్ డ్రగ్ కేసు దర్యాప్తు వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆయనను ఒక వర్గం వ్యతిరేకిస్తూ వచ్చింది. ఎన్నో ఆరోపణలు కూడా కొందరు చేస్తూ వచ్చారు. చివరికి ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను కెమెరా కళ్ళు వెంటాడాయి. తాజాగా ఆర్యన్‌ఖాన్ క్రూజ్ డ్రగ్ కేసు దర్యాప్తు నుంచి సమీర్ వాంఖడేను తప్పిస్తున్నట్టు ఆ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (వాయవ్య జోన్) ముతా అశోక్ జైన్ శుక్రవారం తెలిపారు. ఈ కేసుతో పాటు మరో ఐదు కేసుల దర్యాప్తు బాధ్యతను ముంబై యూనిట్ నుంచి ఢిల్లీ సెంట్రల్ యూనిట్‌కు బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసుల దర్యాప్తు వివిధ రాష్ర్టాలతో ముడిపడి ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
సమీర్ వాంఖడేపై అవినీతి ఆరోపణలు భారీగా వచ్చాయి. ఆయనపై పెద్ద ఎత్తున లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సమీర్ పై సంచలన ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. వాంఖడే నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగం సంపాదించారని ఆరోపించారు. అతడు రూ.70 వేల విలువైన షర్టు, రూ.25–50 లక్షల విలువైన వాచీలు వాడుతుంటారని ఆరోపించారు. నీతి నిజాయితీగల ఒక అధికారి అంతటి ఖరీదైన వస్తువులు ఎలా కొనుక్కోగలడని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుల్లో ప్రముఖుల్ని తప్పుడుగా ఇరికించి వారి నుంచి కోట్లు దండుకోవడమే అతను చేస్తున్న పని అని ఆరోపించారు.
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కొద్దిరోజుల కిందటే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యాడు. ఆర్యన్ ఖాన్‌తోపాటు మరికొంత మందిని కూడా అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీబీ అధికారులు విచారణ అనంతరం ఆర్యన్ జైలుకు వెళ్లాడు. బెయిల్‌కు 14 షరతులను విధించారు. వీటిలో ఓ ఒక్క షరతును ఆర్యన్ ఖాన్ ఉల్లంఘించినా బెయిల్ రద్దుకు ఎన్సీబీ అధికారులు దరఖాస్తు చేయవచ్చు.