వింబుల్డన్ లో భారత సంతతి కుర్రాడు సంచలనం సృష్టించాడు. భారతీయ సంతతికి చెందిన అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు సమీర్ బెనర్జీ ఆదివారం వింబుల్డన్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఒక గంట 22 నిమిషాల పాటు కొనసాగిన ఫైనల్లో 7-5, 6-3 తేడాతో బెనర్జీ విక్టర్ లిలోవ్‌ను ఓడించాడు. 2014 తరువాత అతడు చేరుకున్న మొదటి ఆల్-అమెరికన్ ఫైనల్, ఇది బెనర్జీ సాధించిన రెండవ గ్రాండ్-స్లామ్. సమీర్ బెనర్జీ అమెరికాలో నివసించే భారత సంతతి కుటుంబానికి చెందినవాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ బాలుర విభాగంలో సమీర్ బెనర్జీ సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో 17 ఏళ్ల సమీర్ బెనర్జీ 7-5, 6-3 తో వరుస సెట్లలో అమెరికాకు చెందిన విక్టర్ లిలోవ్ ను ఓడించాడు. వింబుల్డన్ లో జూనియర్ విభాగంలో 1954లో రామనాథన్ కృష్ణన్ టైటిల్ గెలిచిన తర్వాత మరే భారతీయుడు ఆ ఘనత సాధించలేకపోయాడు.
ఇక వింబుల్డన్ మెన్స్ ఫైనల్ లో సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఇటలీ ఆటగాడు మటీయో బెరెట్టినిపై 6-7 (4-6), 6-4, 6-4, 6-3తో విజయం అందుకున్నాడు. తొలి సెట్ ను కోల్పోయిన జకోవిచ్ ఆ తర్వాత పుంజుకుని వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్ తో పాటు టైటిల్ కైవసం చేసుకున్నాడు. బెరెట్టిని ఏకంగా 16 ఏస్ లు సంధించినప్పటికీ ఫలితం లేకపోయింది. పలుమార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేయడం ద్వారా జకో ఆధిపత్యం చాటాడు. జకోవిచ్ 15 బ్రేక్ పాయింట్లకు గాను ఆరింట విజయవంతం కాగా, బెరెట్టిన 7 బ్రేక్ పాయింట్ల ముంగిట రెండింటిని మాత్రమే కాపాడుకున్నాడు. తొలి సెట్ ను టైబ్రేకర్ ద్వారా గెలిచిన బెరెట్టిని ఆ తర్వాత అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. జకోవిచ్ కెరీర్ లో ఇది ఆరో వింబుల్డన్ టైటిల్ కాగా.. ఓవరాల్ గా 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్. కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ సరసన ఇప్పుడు జకోవిచ్ కూడా చేరాడు.
