తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పిన సమంత

0
845

దక్షిణాది నటి సమంత తాను అరుదైన ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నానని.. కొన్ని నెలల నుంచి ఈ వ్యాధికి ఆటో ఇమ్యూనిటీ కండిషన్ చికిత్స తీసుకుంటున్నానని చెప్పింది. తాను కోలుకుంటున్నానని… ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని సమంత తెలిపింది. పూర్తిగా కోలుకోవడానికి తాను ఊహించిన దాని కంటే ఎక్కువ కాలమే పట్టేటట్టు ఉందని.. త్వరగానే కోలుకుంటానని డాక్టర్లు కూడా నమ్మకంతో ఉన్నారని తెలిపింది. తన జీవితంలో మానసికంగా, శారీరకంగా మంచి రోజులతో పాటు చెడు రోజులను కూడా చూశానని.. అలాంటి పరిస్థితులను మళ్లీ భరించలేనేమో అని అనుకున్నానని… అయితే ఆ క్షణాలు గడిచిపోయానని తెలిపింది పూర్తిగా కోలుకునే రోజు దగ్గరలోనే ఉందని చెప్పింది. ఒకవైపు చికిత్స పొందుతూనే, మరోవైపు తన సినిమా యశోదను పూర్తి చేసేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. వీలైనంత త్వరగా సమంత కోలుకోవాలని పలువురు ప్రముఖులు, ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మయోసైటిస్ వ్యాధిని దీర్ఘకాలిక కండరాల వాపు అని చెబుతారు. ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, చికిత్స తీసుకోకపోతే చివరకు ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో కొందరికి చర్మం దద్దుర్లు కూడా ఉంటాయి. ఈ అరుదైన వ్యాధిని నిర్ధారించడం కూడా కష్టమే. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందనే విషయాన్ని కూడా కొన్ని సార్లు నిర్ధారించలేరు. కాలక్రమేణా ఈ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా కనిపిస్తాయి. కండరాల నొప్పి, పుండ్లు పడటం, అలసట, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలుగా చెప్పుకోవచ్చు. మయోసైటిస్ లో ఐదు రకాలు ఉన్నాయి. డెర్మటో మయోసైటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్, జువెనైల్ మయోసైటిస్ (బాలలు), పాలీ మయోసైటిస్, టాక్సిక్ మయోసైటిస్ అనే రకాలు ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధులు, సాధారణ జలుబు, ఫ్లూ, హెచ్ఐవీ వంటి వైరస్ లు, విషపూరిత ఔషధాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మయోసైటిస్ కు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఎలాంటి మెడికేషన్ లేదు. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఫిజియోథెరపీ, వ్యాయామాలు, స్ట్రెచ్చింగ్, యోగా వంటివి చాలా ఉపయోగపడతాయి.