More

    నయా పాలిటిక్స్.. బీజేపీకి వ్యతిరేకంగా ‘సెంట్’ ఓట్లను రాబడుతుందా..?

    మనం ఎన్నో పెర్ఫ్యూమ్ యాడ్స్ చూస్తుంటాం.. ఓ అబ్బాయి పెర్ఫ్యూమ్ కొట్టుకోగానే.. అమ్మాయిలు ఆ వ్యక్తి వెంట పడుతూ ఉంటారు. ఆ పెర్ఫ్యూమ్ కారణంగానే అమ్మాయిలు అతడి పట్ల ఆకర్షిస్తులయ్యారనేది ఆ యాడ్స్ అర్థం. అది ఎంత మాత్రమూ నిజం కాదనేది అందరికీ తెలిసిన విషయమే..! ఇక ఓ పొలిటికల్ పార్టీ కూడా తాజాగా ‘సెంట్’ బాటిల్ ను తీసుకుని వచ్చింది. ఈ సెంట్ ఓటర్లను ఆకర్షిస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

    వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఓ సెంట్(పెర్ఫ్యూమ్) ను ప్రవేశపెట్టారు. ‘సమాజ్‌వాదీ అత్తర్‌’ పేరిట ఈ సెంట్‌ ను తీసుకుని వచ్చారు. వచ్చే ఎన్నికల్లో మ్యాజిక్‌ను సృష్టించబోతున్నట్టు ఆ పార్టీ నాయకులు చెప్పారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వినూత్న మార్గాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకులను తమవైపు తిప్పుకోవడానికి పలు హామీలను ఇస్తూ ఉంటారు.. అఖిలేష్ యాదవ్ మాత్రం తన పార్టీని మార్కెట్ చేసుకునే వ్యూహంగా రానున్న ఎన్నికలకు ముందు ‘సమాజ్‌వాదీ పార్టీ సెంట్’ ను ప్రారంభించారు. ఎరుపు మరియు ఆకుపచ్చ గాజు సీసాలతో ఆయన పార్టీ ‘సెంట్ ఆఫ్ సోషలిజం’ని ప్రారంభించింది. విలేకరుల సమావేశంలో పార్టీ అధినేత ముందు ఉంచిన టేబుల్‌పై అఖిలేష్ యాదవ్ ‘పర్సనలైజ్డ్’ పెర్ఫ్యూమ్ బాటిల్ ను కూడా ఉంచారు.

    ఆ పెర్ఫ్యూమ్ పెట్టెపై పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చిత్రంతో పాటు పార్టీ గుర్తులు మరియు రంగులు ఉన్నాయి. పెర్ఫ్యూమ్ యొక్క స్టెయిన్డ్ గ్లాస్ బాటిల్ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులలో ఉంది, దానిపై సమాజ్ వాదీ పార్టీ అని వ్రాయబడింది. అలాగే పార్టీ సైకిల్ గుర్తును కూడా కలిగి ఉంది. కన్నౌజ్ MLC పమ్మి జైన్ వ్యక్తిగత ఫోన్ నంబర్ కూడా బాక్స్ వెనుక ఉంచారు. ఇరవై రెండు సహజ సువాసనలతో తయారు చేయబడిన ‘సమాజ్‌వాదీ సెంట్’ ను ఆవిష్కరించిన సందర్భంగా పమ్మి జైన్ మాట్లాడుతూ ప్రజలు దీనిని వాడినప్పుడు.. దానిలో సోషలిజం వాసన చూస్తారని అన్నారు. 2022లో ఈ పెర్ఫ్యూమ్ ద్వేషాన్ని అంతం చేస్తుందని జైన్ చెప్పుకొచ్చారు.

    ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2016 సంవత్సరంలో సమాజ్‌వాదీ పార్టీ నాలుగు సంవత్సరాల పాటూ అధికారంలో ఉన్న సందర్భంగా నాలుగు సెంట్ లను విడుదల చేసింది. నాలుగు ప్రత్యేక ఎడిషన్ సమాజ్ వాదీ సెంట్ లు ఉత్తరప్రదేశ్ లోని నాలుగు చిహ్నాలకు గుర్తుగా విడుదల చేశారు. బెనారస్ ఘాట్ (వారణాసి), కన్నౌజ్, తాజ్ మహల్ మరియు లక్నోలోని రూమి దర్వాజా ల చిహ్నాలతో ఉంచిన సెంట్ లను అప్పట్లో విడుదల చేశారు. ఇది పరిమిత ఎడిషన్ పెర్ఫ్యూమ్ అని అప్పట్లో తెలిపారు.

    Trending Stories

    Related Stories