More

    ముంబై ఎయిర్ పోర్టులో సల్మాన్ ఖాన్ ను ఆపిన సిఐఎస్ఎఫ్ అధికారిపై చర్యలు తీసుకున్నారా..?

    బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ముంబై విమానాశ్రయంలోకి ప్రవేశించే ముందు భద్రతా తనిఖీలను పూర్తి చేయాలని సిఐఎస్ఎఫ్ అధికారి ఆపివేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐడీ ప్రూఫ్ చూపించి వెళ్లాలని సల్మాన్ ఖాన్ ను సిఐఎస్ఎఫ్ అధికారి కోరారు. సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం టైగర్ 3 చిత్రీకరణ కోసం రష్యా వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి వెళ్ళాడు. సల్మాన్ ఖాన్ ప్రవేశద్వారం వద్ద భద్రతా తనిఖీని పూర్తి చేయకుండా విమానాశ్రయం లోపలికి నడవటానికి ప్రయత్నించాడు. సల్మాన్ ఖాన్ తన పరివారంతో భద్రతా సిబ్బందిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళబోయాడు. అయితే అక్కడే విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారి సల్మాన్ ను ఆపేశాడు. తన ఐడెంటీని కన్ ఫర్మ్ చేసుకోవాలని సల్మాన్ కు సూచించాడు. సల్మాన్ ఖాన్‌ను విమానాశ్రయంలోకి రాకుండా ఆపి, లైన్‌లో ఉండమని వెనుక ఉన్న వాళ్లను కోరారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఒక్క ఘటనతో సిఐఎస్ఎఫ్ అధికారి కాస్తా హీరో అయ్యాడు. రూల్స్ అందరికీ ఒకటేనని అతడు నిరూపించాడని పలువురు సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు.

    అయితే కొన్ని మీడియా సంస్థలు మాత్రం సల్మాన్ ఖాన్ ను ఆపినందుకు సిఐఎస్ఎఫ్ అధికారి సోమనాథ్ మహంతి చిక్కుల్లో పడ్డాడని కథనాలను ప్రచారం చేశాయి. సల్మాన్ ఖాన్ ను ఆపిన విషయమై మీడియా సంస్థలతో మాట్లాడినందుకు సిఐఎస్ఎఫ్ అధికారి ‘ఇబ్బందుల్లో పడ్డారు’ అని న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాలను రాసింది. “మొహంతి మీడియాతో సంభాషించినందున అతని మొబైల్ ఫోన్ ను సిఐఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన. ఈ సంఘటన గురించి అతను మీడియాతో మాట్లాడకుండా అధికారులు అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు” అని కథనాలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి కథనాలనే ప్రచారం చేసింది.

    తప్పుడు కథనాలని తేల్చేసిన సిఐఎస్ఎఫ్

    ఉన్నతాధికారులు సోమనాథ్ మహంతిపై చర్యలు తీసుకున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. సిఐఎస్ఎఫ్ విభాగం.. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. అతను చేసిన పనికి గర్వంగా ఉందని.. సామాన్యులు, సెలెబ్రిటీలు ఒకటేనని అతడు రుజువు చేశాడని.. అతడిని సత్కరిస్తామని కూడా అధికారులు తెలిపారు. మంగళవారం (ఆగస్టు 24) ఒక ట్వీట్‌లో, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఈ కథనాలన్నీ తప్పు అంటూ చెప్పుకొచ్చింది. ఆ అధికారికి రివార్డ్ కూడా ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది.

    Related Stories