Telugu States

సీఎం జగన్ కు లేఖ రాసిన చంద్రబాబు.. విమర్శలు గుప్పించిన సజ్జల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం బకాయిలను చెల్లించాలని చంద్రబాబు నాయుడు లేఖలో కోరారు. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతు ప్రభుత్వం అని చెప్పి వారినే నిండా ముంచే విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని.. బ‌కాయిల‌ను వెంటనే చెల్లించాలని కోరారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంలో స‌ర్కారు విఫలమైందన్నారు. వైసీపీ సర్కారు రైతుల‌కు న‌ష్టం తెచ్చిపెట్టే విధానాలను అనుసరిస్తోందని విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్లు చేసి రెండు నెలలు దాటినా రైతుల అకౌంట్లలో డబ్బులు జ‌మ చేయ‌ట్లేదని అన్నారు. తెదేపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని అన్నారు. పంటలు పండించేందుకు తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేదెవరు, ఖరీఫ్ కు పెట్టుబడులు ఎవరిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ.2500 కోట్లు బకాయిలు ఉన్నాయని.. వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో ధాన్యం సేకరణలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. రాయలసీమలో అరకొరగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టారని.. ధాన్యం కొనుగోలుకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పేరుతో హడావుడి చేశారు తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం జరగలేదని అన్నారు. రాయలసీమలో వేరు శనగ పంట నష్టపోయినా పెట్టుబడి రాయితీ అందలేదని.. కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సాయం అందడం లేదన్నారు.

చంద్రబాబు లేఖపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని.. రైతుల పట్ల ప్రతిపక్షం కపటప్రేమ కనబరుస్తోందని అన్నారు. రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని.. టీడీపీ హయాంలోని బకాయిలను తమ ప్రభుత్వం తీర్చిందని గుర్తు చేశారు. టీడీపీ హయాంలోని చీకటి రోజులు ఇంకా ప్రజలు మరచిపోలేదని.. ప్రజా జీవనాన్ని ఒక గాడిమీదకు తీసుకొచ్చిన ప్రభుత్వం మాదని తెలిపారు. కౌలు రైతులకు టీడీపీ హయాంలో చేసిందేమీ లేదని.. చంద్రబాబు లేఖలో రాసిన అంశాలన్నీ అబద్ధాలు, అవాస్తవాలు అని ఆయన కొట్టిపారేశారు. విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతుకు లాభసాటిగా ఉండాలని.. రైతులు తమ సొంత కాళ్లపై నిలబడాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని సజ్జల అన్నారు. ఆదాయపు పన్ను విషయంలో కూడా దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రం, 15వ ఆర్థిక సంఘం సూచనలనే అమలు చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. సీఎం జగన్ పాలన రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని.. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు నిధులను వేరే కార్యక్రమాలకు వినియోగించారని సజ్జల ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొక్యూర్‌మెంట్ బకాయిలను జగన్ చెల్లించారని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. జగన్ పాలనలో రైతుల్లో విశ్వాసం పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. 2014-15లో 18 లక్షల 91 టన్నులు, 15-16లో 21 లక్షల టన్నులు, 16-17లో 16 లక్షల 95 వేల టన్నులు, 17-18లో 18 లక్షల టన్నులు, 18-19లో 27 లక్షల 52 వేల టన్నుల ప్రొక్యూర్‌మెంట్ జరిగిందన్నారు. 19-20లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 34 లక్షలకు టన్నుల్ని ప్రొక్యూర్‌ చేశామని గుర్తుచేశారు. 20-21లో రబీ సీజన్‌లో ఇప్పటి వరకు 25 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని ప్రొక్యూర్ చేశామని.. 45 లక్షల టన్నులను టార్గెట్ గా పెట్టుకున్నామని సజ్జల వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − fifteen =

Back to top button