గాంధీ జయంతి వేళ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. తెలంగాణ సాధన జరిగి ఏడేళ్లు గడచిపోయాయి. నేటికీ అభివృద్ధి ఫలాలు అందక, ఆశ నిండిన కళ్లతో కూడలిలో ఎదురుచూస్తూ నుంచున్న మట్టిబిడ్డలను పలకరించేందుకు బండి సంజయ్ పల్లెబాట పట్టాడు.
నేతలు తమ ప్రాపకం కోసం, పదవుల కోసం, అధికార లాలస కోసం చేసే పాదయాత్రల్లాంటిది కాదు ఇది. అంతిమ లక్ష్యం అధికారమే కావచ్చు. అయితే, అందులో స్వలాభం లేదు. కీర్తి కండూతి ఊసు లేదు. నియంతృత్వానికి అంతిమ సంస్కారాలు చేయాలనీ, నిరుపేదలకు ప్రభుత్వం చేదోడుగా ఉండాలనే అకుంఠిత దీక్షతో చేసిన పాదయాత్ర ఇది.
బండి సంజయ్ కేసీఆర్ లాంటి ఘటనాఘటన సమర్థులను ఢీకొనగలడా? రేవంత్ రెడ్డి లాంటి సంపన్న నేతలకు దీటుగా వ్యూహరచన చేయగలడా? మాటచతురత, మర్మకళ తెలిసిన నేతలు మోహరించిన రాజకీయ మైదానంలో బండి సంజయ్ ఏ తరహా అమ్ములపొదిని ధరించి యుద్ధకళను ప్రదర్శిస్తాడు? అసలు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సాధించిన లేదా సాధించబోయే విజయాలేంటి? ప్రజా సంగ్రామ యాత్రను ఎలా చూడాలి?
తెలుగు ప్రాంతాల రాజకీయ చరిత్రలో అత్యంత కీలక దశ ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రను గమనిస్తే 1957-1982 మధ్య పాతికేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ తన ‘retentive capacity’ని ప్రదర్శించింది. 1982లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1984-89 మధ్య, 1995-2003 డిసెంబర్ వరకూ సుమారు దశాబ్దన్నర కాలం పాటు టీడీపీ పాలించింది.
90వ దశకంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకున్న దశలో టీడీపీ అధికారంలో ఉంది. సంస్కరణలు సంక్షోభాన్ని సృష్టించిన కాలంలో ఆరేళ్ల పాటు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవిధంగా చెప్పాలంటే…సంక్షోభాన్ని సింహాసనంగా పోత పోసుకోగలిగాడు వైఎస్.
1982-2014 మధ్య మూడు దశాబ్దాల కాలాన్ని నిశితంగా పరిశీలిస్తే మారిన రాజకీయ పార్టీల స్వభావాన్నీ, నాయకుల నేపథ్యాల్లో మార్పును గుర్తించడం సులభం. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పుట్టుకువచ్చిన అనేక కొత్త వ్యాపారాలు, కొత్తరంగాలకు చెందిన వాణిజ్య దిగ్గజాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, మద్యం సిండికేట్లను నడిపేవారూ… ఈ మూడు దశాబ్దాల కాలంలోనే నేతలయ్యారు.
ఆ తర్వాత ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి చట్టసభల్లోకి ప్రవేశించారు. తొంభయ్యవ దశకం కన్నా ముందు వార్తా పత్రికల్ని, అసెంబ్లీ సమావేశాల్లోని ప్రసంగాల్నీ గమనిస్తే…మారిన మన రాజకీయాల స్వభావాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంటే బలమైన వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆశించి రాజకీయాల్లోకి రావడమో లేదా రాజ్యాంగ పదవుల్ని రక్షణ కవచంగా వాడుకోవడమో ఎజెండాగా ఉంటూ వస్తోంది.
ఈ పరిణామమే నిజాయితీగల నేతలను ప్రజాక్షేత్రం నుంచి దూరం చేసింది. కుడిఎడమగా దేశ వ్యాప్తంగా ఈ మార్పును గమనించవచ్చు. గారడీవిద్య తెలిసినవారూ, మాయల మరాఠీలు, మేకవన్నె పులులూ మోసాన్ని మార్కెట్ చేసే నిపుణులూ రాష్ట్రాల అసెంబ్లీలో, పార్లమెంట్ ఉభయ సభల్లో దర్శనమిస్తారు.
రాజకీయ చదరంగంలో ఆటగాళ్ల స్థానంలో జూదగాళ్లు ప్రవేశించిన…సంక్లిష్ట సందర్భంలో బండి సంజయ్ వ్యక్తిగత నిజాయితీని మాత్రమే నమ్ముకుని కమల దళానికి నేతృత్వం వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులు ఎలాంటి భాషను వాడుతున్నారో గమనిస్తే…వారి నేపథ్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో కేసీఆర్ పాలన ఏకఛత్రాధిపత్యాన్ని తలపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు…పిల్లల బడిలో బాలురవలె భయంతో ముఖ్యమంత్రి ముందు నిలబడిన దృశ్యాలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార సాధన ఆవశ్యకతను గుర్తించింది. నెగ్గుకురాగలదా లేదా వేచి చూడాలి.
ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని శతవిధీ ప్రయత్నిస్తోంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్రకు అనేక విధాలుగా ప్రాధాన్యత ఉంది. దశాబ్దాల కల తెలంగాణ రాష్ట్ర సాధన సాకారమైన ఏడేళ్ల కాలంలో ఏం సాధించాం? ఎన్ని అబద్ధాలు చెప్పాం? ఎంత అవినీతికి పాల్పడ్డాం అనే ప్రశ్నలకు జవాబు వెతికే క్రమంలో రూపుదిద్దుకున్నదే ‘ప్రజా సంగ్రామ యాత్ర’.
ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. పెన్షనర్లకు సమయానికి భృతి రావడం లేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉంది. నిర్దిష్టమైన, నిర్మాణాత్మకమైన పథకాలు లేవు. సంక్షేమం పేరుతో పదీపరకా ఇచ్చి సంతృప్తి పరచడం తప్ప దీర్ఘకాలం ఉపాధినిచ్చే….ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవు. ఇష్టానుసారంగా భూ ఆక్రమణలు, అంతకు మించిన అవినీతి జలగల వికృత క్రీడలు దిన పత్రికల్లో దర్శనమిస్తున్నాయి.
ఏలినవారు రోజుకో అబద్ధాన్ని అలంకరించి ప్రజలకు ఆశలపల్లకిలా చూపే ప్రయత్నం చేస్తున్నారు. నిఘంటువులోకి ప్రవేశించిన తర్వాత అతి ఎక్కువగా…దగా పడిన పదం ఏదైనా ఉందంటే…అది ‘అబద్ధం’అనీ, సదరు అబద్ధాన్ని అతిగా వినియోగించిన రాష్ట్రం తెలంగాణ అనీ చరిత్రలో నమోదు చేయాలి.
ప్రతి అబద్ధానికీ ఓ ఆసక్తికరమైన ఊహను జోడిస్తారు మన ముఖ్యమంత్రి. జిల్లా కేంద్రాలను అంతర్జాతీయ నగరాలుగా మారుస్తాననీ, మురికినీరు పారే సరస్సులు, ఇసుక మేటలు వేసిన చెరువులను అందంగా తీర్చిదిద్ది….అందులో పుష్పాలంకృత పడవలు ఏర్పాటు చేస్తాననీ..కాల్పనిక రచనను తలదన్నే వర్ణనతో నిండిన కలల్ని కానుకగా ఇస్తారు మన ముఖ్యమంత్రి.
జనం ఎప్పటికప్పుడు పాత కలను మరిచిపోయి…కొత్త కల ఎరకు చిక్కడమే విచిత్రం. ఆశతో ఎదురు చూస్తున్నవారిని, ఆకలితో అలమటించే వారినీ, కనీస అవసరాల కోసం అగచాట్లు పడుతున్నవారిని మోసగించే వ్యక్తిత్వం అత్యంత హేయమైంది. ‘నమ్మినవారినే కదా మోసగిస్తాం-నమ్మనివారు వలకు చిక్కరు కదా’ అనే తర్కాన్ని కూడా ఆశ్రయిస్తారు నేటి మన పాలకులు.
దగుల్బాజీతత్వం పాలన యంత్రాంగానికీ, ప్రజాప్రతినిధులకూ సోకిన నేపథ్యంలో బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ సారథిగా బాధ్యతలు చేపట్టారు. బండి సంజయ్ కరీంనగర్ రణరంగం నుంచి…నేరుగా…మహానగరం చేరుకున్నారు. కోటీశ్వరులూ, ఖరీదైన కార్లూ, బంజారాహిల్స్ బంగళాలూ, పబ్ లకు వెళ్లే సంతానం ఉన్న ఘనమైన నేతల మధ్యకు…నిక్కచ్చి మాటతీరు, నిరాడంబర జీవితం, బరిగీసే సాహసం లాంటి పల్లెటూరి స్వాభావిక వ్యక్తిత్వంతో….సువిశాల మైదానంలోకి అడుగుపెట్టారు బండి సంజయ్.
అబ్రకదబ్రా నేతలు, అద్భుతదీపం పట్టుకున్న నాయకులూ ఆల్రెడీ వలలు వేసి కూర్చున్న మాట నిజం. అర్థబలం, అంగబలం, ఆదేశిస్తే…అద్దాలు పగలగొట్టి…వార్తలకెక్కే అనుచరగణం ఉన్నమాట కూడా నిజమే! ఇవేవీ లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యమా అనే సందేహం ఇవ్వాల్టి పొలిటికల్ గ్రౌండ్ ను చూస్తే కలగవచ్చు. కానీ, నాలుగు దశాబ్దాల బీజేపీ ప్రయాణాన్ని నిశితంగా పరిశీలిస్తే…చిల్లిగవ్వ లేకుండా చట్టసభల్లోకి ప్రవేశించవచ్చనీ….పరంపరంగా వచ్చిన కాణీ సంపద లేకపోయినా పార్లమెంట్ వేదికపై నిప్పులు కురిపించవచ్చనే నిజం బీజేపీ పునాదుల్లో కనిపిస్తుంది.
‘నా వ్యక్తిత్వానికి ఆరోపణను మించిన అవమానం లేదు. విలువల్లేని కూటమిలో చేరి అధికారాన్ని కాపాడుకోవాల్సి వస్తే…పదవి కొనగోటితో సమానం’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన నిఖార్సయిన నేత అటల్ బిహారీ వాజ్ పేయి. ఆయన కీర్తి కిరీటంలో ఉన్నది నిజాయితీయే తప్ప…కనుపాపను ఆశకు గురిచేసే కరెన్సీ కాదు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యానంతరం కొనసాగించిన స్థిరమైన ‘retentive capacity’ ని ప్రస్తుతం బీజేపీ ప్రదర్శిస్తోంది. ఢక్కాముక్కీలుతిని యుద్ధకళను అలవర్చుకుంది.
బీజేపీ ప్రస్తుతం తన శ్రేణులకు నేర్పిస్తున్న యుద్ధవిద్యల్లో…వ్యక్తిగత నేపథ్యాలూ, బ్యాంకు బాలెన్స్ లూ, వందిమాగధ బృందాలూ అక్కరలేదు. బరిలోకి దిగుతాననే విశ్వాసం ఉన్న ఎవరినైనా సరే…వెన్నుతట్టి, ఆయుధమిచ్చి, వ్యూహం చెప్పి…రణరంగంలోకి పంపుతుంది. ఎన్నికల యుద్ధక్షేత్రంలో జయాపజయాలు నిర్ణయించాల్సింది అంతిమంగా ఓటరు మహాశయులే! 1984లో పార్లమెంట్ సాక్షిగా గెలిచిన రెండు స్థానాలకు ‘రెండు వేళ్లు’ చూపి బీజేపీని అవమానించిన వారు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు.
రాజకీయాలు సంపన్న వర్గాల అధికార క్రీడగా మారిన మాట ఎంత నిజమో…జనం వారికి కాలం కలిసివచ్చినపుడు తగిన బుద్ధి చెపుతారనే మాట కూడా అంతే నిజం. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక వేళ భాగ్యనగరం నుంచి కోట్ల డబ్బు రహస్యంగా తరలిపోలేదా? బల్దియా ఎన్నికల వేళ నగర ఓటర్లు వరదల కారణంగా పడిన యాతన ఓటు రూపంలో వ్యక్తం కాలేదా?
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ తనయి కవితక్క ఓటమికి కారణాలు తెలియదా? ధర్మపురి అరవింద్ గెలుస్తాడని అప్పటికీ ఎవరైనా ఊహించారా? అందాకా ఎందుకు న్యాయవాదీ, కేసీఆర్ సన్నిహితుడూ అయిన వినోద్ కుమార్ కరీంనగర్ లో బండి సంజయ్ చేతిలో ఓడిపోతాడని అనుకున్నారా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ లో చిత్తరంజన్ దాస్ అనే దళిత కాంగ్రెస్ యువనేత ఎన్టీఆర్ ఓడించి…‘జెయింట్ కిల్లర్’ గా పేరుతెచ్చుకున్నాడు. గెలిచేవరకూ ఆయన పేరు ఆ నియోజకవర్గంలోనే చాలా మందికి తెలియదు. చీమలు పెట్టిన పుట్టలు…పాములకు ఆవాసంగా మారవచ్చు. అయితే…చలిచీమల చేతజిక్కిన వైనం కూడా చరిత్రలోనే కదా తారసపడుతుంది.
ప్రజా సంగ్రామ యాత్రను గెలుపోటముల త్రాసులో కాకుండా…సంకీర్ణ రాజకీయ పరిణామాల సందిగ్ధత నేపథ్యంలో చూడాలి. ఎన్ని ఓట్లు వచ్చాయి? ఎంతమంది గెలిచారు? పరస్పర పోరులో ఎవరికి ఎంత శాతం వచ్చాయి…తులనాత్మక దుర్బిణిలో కాదు ప్రజా సంగ్రామ యాత్రను చూడాల్సింది….ఎంత ప్రభావం వేసింది? ప్రత్యామ్నాయం ఉందనే భరోసా ఇచ్చిందా లేదా? వీటిని కూడా కాసేపు వదిలేద్దాం…ముఖ్యమంత్రిని విమర్శించే ఒక సాహసం గల నేతా, నీళ్లనూ, పాలనూ వేరు చేసినట్టే…అబద్ధాన్నీ, నిజాన్నీ బట్టబయలు చేసి ప్రజలకు చెప్పగలిగిన ఒక నాయకుడూ ఉన్నాడనే భరోసాను ప్రజా సంగ్రామ యాత్ర ఇచ్చిందా లేదా అన్నదే ముఖ్యం.
దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన నెహ్రూ కుటుంబం…అధికార పీఠం నుంచి దూరంగా విసిరివేయబడిన దాఖలా కళ్లెదురుగానే ఉంది. తన అధికారానికి తిరుగులేదని విర్రవీగిన ఇందిరాగాంధీ చరిత్ర పేజీల్లో రక్తవర్ణరంజితమై ప్రత్యక్షమవుతుంది.
రాజకీయ నేతకు అనుభవమే…అత్యంత ప్రధానం. అదే విజయ తీరాలకు చేరుస్తుంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వ్యక్తిగతంగా ఆయన జీవితంలో అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. రాబోయే ఎన్నికల రణక్షేత్రంలో ఆ అనుభవం ఉపకరిస్తుంది. అంతేకాదు, తెలంగాణ సాధన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రజాప్రతినిధులు జడుస్తున్నారు. ప్రజలు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం లేదు. అభివృద్ధి చేసి చూపించే వెన్నుముక అంతకన్నా లేదు. మరబొమ్మల వలె కనిపించే ప్రజా ప్రతినిధుల మధ్య ధైర్యం, వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ఉన్న నేతగా బండి సంజయ్..విస్తరణ స్వభావాన్ని రక్తగతంగా మార్చుకున్న భారతీయ జనతా పార్టీ…ఎలాంటి విజయాలు నమోదు చేస్తాయో వేచి చూడాల్సిందే!