More

    కోహ్లీని ఆకాశానికి ఎత్తేసిన సచిన్

    టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 6 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ, హార్దిక్ పాండ్యా జోడీ భారత్ ను ఆదుకుంది. పాండ్యా 37 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 40 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 2, మహ్మద్ నవాజ్ 2 వికెట్లు తీశారు. అద్భుతమైన ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది.

    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోహ్లీ విధ్వంసాన్ని పొగడకుండా ఉండలేకపోయారు. “విరాట్ కోహ్లీ ఇది నిస్సందేహంగా నీ జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్. కోహ్లీ గేమ్ చూడడం ఒక విందు భోజనంలా అనిపించింది. 19వ ఓవర్‌లో రవూఫ్‌ బౌలింగ్ లో లాంగ్‌ ఆన్‌లో బ్యాక్‌ఫుట్‌లో సిక్స్‌లు అద్భుతంగా ఉన్నాయి! ఇదే ఆటను కొనసాగించు” అని టెండూల్కర్ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.

    ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాక కోహ్లీ మాట్లాడుతూ ఏం మాడ్లాడాలో తెలియడంలేదని, మ్యాచ్ ను ఎలా గెలిచామో ఇప్పటికీ నమ్మశక్యం కావడంలేదని అన్నాడు. చివరివరకు క్రీజులో ఉంటే ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలుస్తామని హార్దిక్ పాండ్యా గట్టిగా నమ్మాడని కోహ్లీ అన్నాడు. పెవిలియన్ ఎండ్ నుంచి షహీన్ అఫ్రిది బౌలింగ్ చేస్తే అతడికి కొట్టాలని నిర్ణయించుకున్నామన్నాడు. హరీస్ రవూఫ్ వాళ్ల మెయిన్ బౌలర్. అతడి బౌలింగ్ లో కొడితే.. పాక్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని తెలిసే రెండు సిక్సులు కొట్టాను. ఇవాళ్టి వరకు నేను ఆడిన ఇన్నింగ్స్ లలో మొహాలీలో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పేవాడ్ని. కానీ ఇవాళ్టి నుంచి పాకిస్థాన్ తో మ్యాచే నా బెస్ట్ ఇన్నింగ్స్ అంటానని కోహ్లీ తెలిపాడు.

    Trending Stories

    Related Stories