శబరిమల యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు.. సదుపాయాలు

0
638

శబరిమల యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. శబరిమల యాత్రకు దేశం నలుమూలల నుంచి భక్తులు రానున్నారు. యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులతో కలిసి భద్రతను ఏర్పాటు చేశామని.. దారిపొడవునా పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు అధికారులు తెలిపారు. కరోనా ఆంక్షల తొలగింపు నేపథ్యంలో ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు యాత్రకు వచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీని తట్టుకునేలా పలు ఏర్పాట్లు చేశారు. సుమారు 14 వేల మంది పోలీసులు ఈ యాత్రలో భక్తులకు భద్రత కల్పించనున్నారు. ఏరియల్ సర్వే కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాల సాయం తీసుకుంటున్నారు.

నవంబర్ 16న మండల పూజ ప్రారంభం కానున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా బోర్డు వర్చువల్ క్యూలైన్ టోకెన్ల జారీని కూడా ప్రారంభించింది. అయితే.. శబరిమల దర్శనం కోసం ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు వర్చువల్-క్యూ సిస్టమ్‌ను అమలు చేయడం, నిర్వహణపై శబరిమల ప్రత్యేక కమిషనర్ నివేదిక ఆధారంగా దాఖలైన సూవో పిటిషన్‌ను కేరళ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశాన్ని న్యాయమూర్తులు అనిల్ కె నరేంద్రన్, జస్టిస్ పిజి అజిత్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పరిశీలించింది. శబరిమల యాత్రికులకు సరైన సౌకర్యాలు కల్పించాలని కేరళ హైకోర్టు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ , కొచ్చిన్ దేవస్వోమ్ బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది. నిలక్కల్, పంబా, సన్నిధానం, ట్రెక్కింగ్ మార్గాలు, యాత్రికులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని.. దేవస్థానం అధికారులకు ఆలయ సలహా కమిటీలు అవసరమైన సహాయాన్ని అందించాలని కోర్టు ఆదేశించింది. సహాయ దేవస్వం కమీషనర్ ఎడతావలం (ట్రాన్సిట్ క్యాంపులు) వద్ద భక్తులకు అందించిన సౌకర్యాలను తనిఖీ చేయాలనీ, డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ త్రిస్సూర్ జిల్లాలోని గురువాయూర్ ఆలయంలో సౌకర్యాలను కూడా అంచనా వేయాలని తెలిపింది.