అక్కడ కూడా తాలిబాన్లపై ప్రేమ చూపించిన పాక్.. సార్క్ వార్షిక సమావేశం రద్దు

న్యూయార్క్‌లో 25 సెప్టెంబర్ 2021 న జరగాల్సిన విదేశాంగ మంత్రుల సార్క్ (దక్షిణ ఆసియా అసోసియేషన్) సమావేశం రద్దు అయింది. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలో ఉన్న ఇస్లామిస్ట్ గ్రూప్ తాలిబాన్లను పాల్గొనడానికి ఇతర సభ్యులు అంగీకరించకపోవడంతో సమావేశం కాస్తా రద్దు చేయబడింది. సార్క్ సమావేశానికి ఆఫ్ఘనిస్తాన్ తరఫున తాలిబాన్ల ప్రతినిథిని అనుమతించాలని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం లోని పాకిస్తాన్ పట్టుబట్టింది. దీనికి సభ్యదేశాలు ఒప్పుకోకపోవడంతో సార్క్ వార్షిక సమావేశం రద్దయింది. ఈ నిర్ణయాన్ని నిర్వాహక దేశం నేపాల్ ప్రకటించింది.
ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం సార్క్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి, ప్రతినిధిని పంపడానికి తాలిబాన్లను అనుమతించాలని పట్టుబట్టడంతో సార్క్ సమావేశం రద్దు జరిగింది. న్యూయార్క్‌లో జరిగే UN జనరల్ అసెంబ్లీ (UNGA) 76 వ సెషన్లో భాగంగా సార్క్ శిఖరాగ్ర సమావేశం జరగాల్సి ఉంది. పాక్ డిమాండ్‌ను సభ్య దేశాలన్నీ ఏకపక్షంగా వ్యతిరేకించాయని పలు నివేదికలు తెలిపాయి. అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం సార్క్ సమావేశంలో దేశానికి ప్రాతినిధ్యం వహించదని హామీ ఇవ్వాలని పాక్ సార్క్ చైర్ లో ఉన్న నేపాల్‌ను కోరింది. అదీ కాకపోతే ‘ఖాళీ కుర్చీ’ ఉంచాలని పాక్ కోరింది. సార్క్ చైర్ లో ఉన్న నేపాల్ పాకిస్తాన్ లేదా తాలిబాన్ నాయకత్వానికి అలాంటి హామీ ఇవ్వడానికి నిరాకరించింది. అందువల్ల సమావేశం రద్దు చేయబడింది. తాలిబాన్లను అనుమతించకపోతే.. గత అష్రఫ్ ఘనీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులనును అనుమతించవద్దని పాక్ కోరడం వివాదాస్పదమైంది. దీంతో పాక్ తీరుపై సభ్య దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సార్క్ వార్షిక సమావేశం వాయిదా పడింది.
దక్షిణాసియా కూటమిలో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక సభ్యదేశాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రాతినిథ్యం లేకుండా సమావేశం నిర్వహించాలని మెజారిటీ సభ్యదేశాలు నిర్ణయించాయి. దీనికి పాక్ ఒప్పుకోలేదు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో సార్క్ విదేశాంగ మంత్రుల భేటీ ఆనవాయితీగా వస్తోంది. అయితే సార్క్ సభ్య దేశాల మధ్య సమ్మతి కొరవడటంతో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు నేపాల్ ప్రకటించింది. తాలిబాన్ పాలనను ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభుత్వాలు గుర్తించలేదు. 2020 లో సార్క్ సమావేశం COVID-19 మహమ్మారి కారణంగా వర్చువల్ గా నిర్వహించబడింది.
సార్క్‌లో మొత్తం ఎనిమిది సభ్య దేశాలు ఉన్నాయి, అవి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంక. సార్క్ 17 జనవరి 1987 న ఖాట్మండు లో స్థాపించబడింది. నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ లు 2007 లో చేరాయి. ఆస్ట్రేలియా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇరాన్, జపాన్, మారిషస్, మయన్మార్, దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ దేశాలు పరిశీలకులుగా ఉన్నారు. ఇస్లామిస్ట్ గ్రూప్ తాలిబాన్ ఈ సంవత్సరం ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంది. అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ నేతలు అయ్యారు. అప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ షరియాను అమలు చేయడానికి ఇస్లామిస్ట్ గ్రూప్ దురాగతాలను నిర్వహిస్తున్నట్లు నివేదికలు వచ్చాయి.