రష్యా నుండి భారత సైన్యంలోకి వచ్చేస్తున్న ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్.. ఇవే అసలైన గేమ్ ఛేంజర్లు..!

0
991

సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ లు పన్నుతున్న కుట్రలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఎలాగైనా వారికి బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఇక ఆయుధ సామాగ్రి విషయంలో కూడా భారత్ వారి కంటే ముందే ఉంది. సరిహద్దుల్లో ఇప్పుడు అసలైన గేమ్ ఛేంజర్ ను తీసుకుని వచ్చే విషయంలో భారత్ మరింత ముందుగా అడుగులు వేస్తోంది. భారత్‌కు ఎస్‌-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల సరఫరాను రష్యా ప్రారంభించింది. రష్యన్ ఫెడరల్ సర్వీసెస్‌ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్‌ (FSMTC) డైరెక్టర్ డిమిత్రి షుగేవ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. షెడ్యూల్‌ ప్రకారం వీటి సరఫరా జరుగుతోందని దుబాయ్ ఎయిర్ షోకు ముందు ఈ విషయాన్ని ఆయన తెలిపారు. FSMTC అనేది రష్యా ప్రభుత్వానికి చెందిన ప్రధాన రక్షణ ఎగుమతి నియంత్రణ సంస్థ. శత్రు దేశాల నుండి వచ్చే రాకెట్లను ఎస్‌-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ గాల్లోనే అంతం చేస్తుంతాయి. ఎస్-400 ఉపరితలం నుంచి గగనతలానికి సంధించే మిస్సైల్ వ్యవస్థ. మొత్తం ఐదు ఎస్-400 యూనిట్లు కొనుగోలు చేసేందుకు భారత్ 2018లో రష్యాతో 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ల సరఫరాను రష్యా ప్రారంభించింది.

ఎస్‌-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి ప్రస్తుతం భారత్ కు ఎంతో అవసరమని.. చైనా, పాక్ లను కట్టడి చేయవచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. శత్రు యుద్ధ విమానాలు, సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులను ఎస్‌-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ నాశనం చేస్తుంది. అత్యాధునిక ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల ఐదు యూనిట్లను కొనుగోలు చేసేందుకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ నేపథ్యంలో ఎస్‌-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ స్క్వాడ్రన్‌లోని మొదటి భాగాలు ఇప్పటికే భారత్‌కు చేరుకోవడం ప్రారంభించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. క్షిపణి వ్యవస్థల భాగాలు వాయు, సముద్ర మార్గాల ద్వారా వస్తున్నాయని చెప్పారు. వీటిలో మొదటి యూనిట్ వెస్ట్రన్ ఫ్రంట్‌కు సమీపంలో మోహరించరించనున్నట్లు తెలుస్తోంది. పాక్, చైనా గగనతలం నుండి ముప్పు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఎస్‌-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

ఎస్-400 మొదటి యూనిట్‌ను భారత వాయు సేన లడఖ్ సెక్టర్‌లో మోహరిస్తుంది. ఈ ప్రాంతంలో చైనాతో ప్రతిష్టంభన నేపథ్యంలో ఇది అత్యంత కీలక పరిణామంగా భావిస్తున్నారు. పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే సవాళ్ళను తిప్పికొట్టేందుకు వీలుగా వీటిని మోహరిస్తారని తెలుస్తోంది. చైనా ఇప్పటికే టిబెట్‌లో రెండు ఎస్-400 స్క్వాడ్రన్లను మోహరించింది. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ వెంబడి న్గరి గర్ గున్సా, న్యింగ్చి వైమానిక స్థావరాల్లో వీటిని మోహరించింది. 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రు విమానాలు, క్రూయిజ్ మిసైల్స్‌ను తిప్పికొట్టేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఎస్‌-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ మొదటి స్క్వాడ్రన్ డెలివరీ ఈ ఏడాది చివరికి పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనంతరం విస్తరణలో భాగంగా భారత వైమానిక దళం తూర్పు వైపు దృష్టి సారిస్తుందని చెప్పారు. ఎస్‌-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దేశంలోనే శిక్షణ ఇవ్వడానికి ఐఏఎఫ్‌ దృష్టిసారించింది.

ఎస్‌-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ ప్రత్యేకతలు:

భారత్ కు ప్రస్తుతం ఎంతో అవసరమైన ఎస్‌-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ హైబ్రిడ్ రాడార్ ఆధారిత వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. శత్రువుల ఆయుధాలను, క్షిపణులను గుర్తించడం వాటిపై దాడి చేసే విధంగా ఎస్-400ని అభివృద్ధి చేశారు. గాల్లోకి పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు, క్షిపణులు దూసుకొస్తుంటే ఈ వ్యవస్థలోని మాస్టర్ రాడార్ గుర్తించి.. ఆ టార్గెట్ల సంఖ్య ఆధారంగా ఎన్ని మిస్సైళ్లు, ఏ రేంజ్ వి ప్రయోగించాలో మిస్సైల్ సిస్టమ్స్ కు ఎలక్ట్రానిక్ పద్థతిలో సంకేతాలు పంపుతుంది. అప్పుడు మన వైపు నుండి ప్రతి దాడి మొదలవుతుంది. శత్రువులకు చెందిన వాటిని కూల్చి పారేయవచ్చు. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువును కూడా ఇది గుర్తించగలదు. ఎఫ్-16, ఎఫ్-22 వంటి ఆధునిక తరం యుద్ధ విమానాలు కూడా ఎస్-400 రాడార్ నుండి తప్పించుకోలేవు. బీ-1, బీ-2, ఎఫ్-15, ఎఫ్-35, ఎఫ్-16, ఎఫ్-22 వంటి బాంబర్లు, ఫైటర్ జెట్లు, టోమహాక్ వంటి క్రూయిజ్ మిస్సైళ్లు కూడా ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్ నుంచి తప్పించుకోలేవు. ఈ వ్యవస్థలో ప్రధానంగా నాలుగు రేంజ్ లు ఉంటాయి. 400 కిమీ, 250 కిమీ, 120 కిమీ, 40 రేంజిల్లో శత్రు కదలికలను గుర్తించి, అందుకు అనుగుణంగా ఏ మిస్సైల్ ను ప్రయోగించాలో రాడార్ నిర్ణయిస్తుంది. లక్ష్యాన్ని గుర్తించిన 9 నుంచి 10 సెకన్లలోనే ఇది స్పందిస్తుంది.