ఖేర్సన్ నగరం కూడా రష్యా నియంత్రణలోకి

0
875

మార్చి 2న, ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఖేర్సన్ రష్యా నియంత్రణలోకి వచ్చింది. ఖేర్సన్ మేయర్ Ihor Kolykhaiev, రష్యా సైనికుల ఆదేశాలను పాటించాలని నివాసితులను కోరుతూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఖేర్సన్ లో దాదాపు 2,90,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇది రాజధాని కీవ్‌కు దక్షిణంగా 480 కిమీ దూరంలో ఉంది. ఉక్రేనియన్ పాలకుల నుండి అధికారిక ప్రకటన రావడానికి కొన్ని గంటల ముందు తాము నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యన్లు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ గురువారం తెల్లవారుజామున ప్రసంగిస్తూ, రష్యా సైన్యాన్ని ప్రతిఘటించాలని ఉక్రెయిన్ ప్రజలను కోరారు. ఖేర్సన్‌ సహా ప్రధాన నగరాలను రష్యా తన ఆధీనంలోకి తీసుకుందా లేదా అనే దానిపై అతను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుండి ఉక్రెయిన్ నుండి ఇప్పటికే ఒక మిలియన్ ప్రజలు వెళ్లిపోయారని మీడియా సంస్థలు తెలిపాయి. ర‌ష్యా దాడుల నేప‌థ్యంలో ఉక్రెయిన్లో వలసలు పెరిగాయని ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 10 లక్షల మంది ఇత‌ర‌ దేశాలకు వెళ్లారని ఓ నివేదికలో పేర్కొంది.

ఉక్రెయిన్‌ లోని ప్ర‌భుత్వ ఆస్తులు, కార్యాల‌యాల‌నే ల‌క్ష్యంగా చేసుకుని దాడులు జ‌రిపిన ర‌ష్యా ఇప్పుడు జ‌నావాసాల‌పై కూడా దాడులు జరుపుతోంది. ర‌ష్యా దాడులు తీవ్రత‌రం చేసి ఆసుప‌త్రులు, పాఠ‌శాల‌లు, భ‌వ‌నాల‌పై కూడా దాడులు జ‌రుపుతోంది. మెట్రో స్టేషన్ స‌మీపంలో కూడా భారీ పేలుళ్లు సంభ‌వించాయి. కీవ్ న‌గ‌రంలోని ఇత‌ర ప్రాంతాల్లోనూ ర‌ష్యా బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను స్వాధీనం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ర‌ష్యా దాడులు కొన‌సాగిస్తోంది. ఒబ్లాస్ట్, లవీవ్, మైకొలివ్, చెర్నిహివ్, త‌దిత‌ర‌ ప్రాంతాల్లో ర‌ష్యా వైమానిక దాడుల‌కు సిద్ధ‌మైంది.