More

    రష్యా భారీ నౌకను ఉక్రెయిన్ ముంచేసిందా..?

    ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యాకు కూడా భారీ నష్టం చోటు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. జెట్స్, ట్యాంకర్స్, షిప్స్ కూడా రష్యా కోల్పోయిందనే ప్రచారం కొనసాగుతూనే ఉంది. తన యుద్ధనౌకలలో ఒకటైన మాస్క్వా క్రూయిజర్ నల్ల సముద్రంలో మునిగిపోయిందని రష్యా అంగీకరించింది. తుఫాను కారణంగా యుద్ధానికి బయలుదేరిన యుద్ధ నౌక వాతావరణానికి తీవ్రంగా ప్రభావితమైంది. రష్యన్ గైడెడ్-మిసైల్ డెస్ట్రాయర్ మాస్క్వా స్థితిపై గందరగోళం ఎట్టకేలకు వీడింది. సెవాస్టోపోల్ ఓడరేవుకు దెబ్బతిన్న ఓడను తీసుకెళ్తుండగా మునిగిపోయిందని రష్యన్ స్టేట్ మీడియా ప్రకటించింది.

    “వాతావరణంలో ప్రతికూలతల కారణంగా మాస్క్వా క్రూయిజర్‌ను డిజిగ్నేషన్ పోర్ట్‌కు లాగుతున్నప్పుడు, ఓడ దెబ్బతినడం వల్ల స్థిరత్వాన్ని కోల్పోయింది, మంటల కారణంగా మందుగుండు సామగ్రి కూడా పేలింది. భారీ తుఫాను మధ్య, ఓడ మునిగిపోయింది” అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నివేదించింది.

    రష్యన్ మీడియా ప్రకారం ఓడ లోని మందుగుండు సామగ్రి పేలడంతో తీవ్రంగా దెబ్బతిన్న మాస్క్వాను సెవాస్టోపోల్ నౌకాశ్రయానికి తీసుకువెళుతుండగా ఓడ మునిగిపోయింది. మాస్క్వా సిబ్బందిని ఇతర నౌకల్లోకి తరలించారు. మాస్క్వా మునిగిపోవడం WWII తర్వాత అతిపెద్ద నౌకాదళ నష్టాలలో ఒకటి. బ్లాక్ సీ ఫ్లాగ్‌షిప్ అయిన మాస్క్వా నౌకలో మంటలను ఆర్పిన తర్వాత తిరిగి ఓడరేవుకు లాగుతామని రష్యా ఇంతకుముందు తెలిపింది. క్షిపణి క్రూయిజర్‌ను నెప్ట్యూన్ క్షిపణి ఢీకొట్టిందని.. దీంతో అది మునిగిపోయిందని గతంలో ఉక్రెయిన్ పేర్కొంది. ఆ సమయంలో ఓడ ఇంకా తేలుతూనే ఉందని, ఓడలోని ప్రధాన ఆయుదాలు ఇంకా భద్రంగానే ఉన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    స్కై న్యూస్ నివేదిక ప్రకారం, మాస్క్వా ఓడలోని సిబ్బందిని సమీపంలోని మరికొన్ని నౌకల్లోకి తరలించారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఓడ దెబ్బతిన్నదని ధృవీకరించింది. ఉక్రెయిన్ క్షిపణి దాడి కారణంగా అది దెబ్బతిన్నదని వారు చెప్పలేదు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యలను ఉటంకిస్తూ టాస్ వార్తా సంస్థ, “మాస్క్వా క్షిపణి క్రూయిజర్‌లో మంటలు చెలరేగడంతో, మందుగుండు సామగ్రి పేలింది” అని పేర్కొంది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

    Trending Stories

    Related Stories