రష్యా యుద్ధ విమానాలను కూల్చేస్తున్న ఉక్రెయిన్.. రష్యా మరింత దూకుడు

0
900

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌ను మూడు వైపులా చుట్టుముట్టిన రష్యా బలగాలు రాజధాని కీవ్‌ సహా ప్రధాన నగరాలపై పెద్దఎత్తున బాంబులతో దాడులు చేస్తోంది. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద, ఖార్కివ్‌లలో పెద్దఎత్తున పేలుళ్లు సంభవించాయి. డెనెట్స్క్‌ ప్రావిన్స్‌లోని యరియుపోల్‌పై బాంబులతో దాడి చేసింది. ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్‌ ప్రారంభిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించిన కొద్ది సేపట్లోనే ఆ దేశంలోని ప్రధాన నగరాలపై సైన్యం బాంబుల వర్షం కురిపించింది. రష్యా చర్యలతో ఉక్రెయిన్‌ ప్రభుత్వం అప్రమత్తమయింది. అప్పటికే దేశంలో ఎమర్జెనీ విధించిన సర్కార్‌ ఎయిర్‌ స్పేస్‌ను మూసివేసింది. రష్యా దాడిని ఉక్రెయిన్‌ సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. లుహాన్స్‌ రీజియన్‌లో రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్‌ను కూల్చివేశామని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది.

ఉక్రెయిన్ ఎయిర్ బేస్‌, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. ప‌లు విమానాల‌ను కూడా ర‌ష్యా ధ్వంసం చేసిన‌ట్లు తెలుస్తోంది. రష్యా యుద్ధం ప్రారంభించి, ఉక్రెయిన్ గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేస్తుండ‌డంతో ఉక్రెయిన్‌లోని విదేశీయులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఇప్ప‌టికే ఉక్రెయిన్ ఎయిర్ పోర్టులను మూసివేసింది. ఉక్రెయిన్ లోని విదేశీయులు త‌మ సొంత దేశాల‌కు వెళ్ల‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఉక్రెయిన్ తూర్పున ఉన్న నగరాల్లో ఎయిర్ పోర్టులను మూసివేసింది. పౌర విమాన ప్రయాణాల కోసం గగనతల వినియోగాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తూర్పు ఉక్రెయిన్లోని గగనతలాన్ని డేంజర్ జోన్‌గా ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్‌లోనే భార‌త్ స‌హా ప‌లు దేశాల పౌరులు చిక్కుకుపోయారు. ఎయిర్ ఇండియా విమానం AI1947 భార‌తీయుల‌ను తీసుకురావ‌డానికి ఉక్రెయిన్ వెళ్ల‌గా, ఆ దేశంలోకి అనుమ‌తి దొర‌క‌క‌పోవ‌డంతో తిరిగి న్యూఢిల్లీకి పయనమైంది. అక్కడి భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలను చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ప్రశాంతంగా ఉండాలని.. భారతీయులంతా ఎక్కడున్నా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, ఇల్లు, హాస్టల్ లేదా ప్రయాణాల్లో ఉన్నా భద్రంగా ఉండాలని సూచన చేసింది. కీయివ్ కు వెళ్లేవాళ్లు, కీయివ్ నుంచి వేరే సిటీలకు వెళుతున్న వారు వెంటనే తమ తమ ఇళ్లకు వెనక్కు వెళ్లిపోవాలని సూచించింది. ఉక్రెయిన్ లోని పాశ్చాత్య దేశాల సరిహద్దుల వెంబడి ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నా దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ విషయంలో వకాల్తా జోక్యం చేసుకోవాలని చూసినా, మా దేశాన్ని బెదిరించినా వెంటనే బదులిస్తామని అన్నారు. మేము ఇచ్చే బదులు ఎలా ఉంటుందంటే.. మీ జీవితంలో అలాంటి తీవ్రమైన పరిణామాలను కనీవినీ ఎరిగి ఉండరని అన్నారు. దీనికి సంబంధించి మేం దేనికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉక్రెయిన్ ను ఆక్రమించాలన్న ఉద్దేశం తమకు లేదని, ఇప్పటి రక్తపాతానికి ఆ దేశ ప్రభుత్వాలే కారణమని అన్నారు.