ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు భీకర బాంబు దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారీ ప్రాణ నష్టం, ప్రాణ నష్టం జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లోని మరియపోల్ విషయంలో రష్యా కీలక ప్రకటన చేసింది. మరియపోల్‌లో కొన్ని నెలల పాటు సాగిన యుద్ధం ముగిసినట్లు రష్యా ప్రకటించింది. అజోవ్ స్టీల్ ప్లాంట్ కూడా విముక్తి అయినట్లు వెల్లడించింది. అజోవ్ ప్లాంట్‌కు రక్షణగా ఉన్న ఉక్రెయిన్ సైనికులు పూర్తిగా లొంగిపోయినట్లు రష్యా రక్షణశాఖ కార్యాలయం అధికారులు ప్రకటించారు. ప్లాంట్‌లో పూర్తి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చినట్లు రష్యా దళాలు తెలిపాయి.
అజోవ్ స్టీల్ ప్లాంట్ ఆక్రమణతో శుక్రవారం 531 మంది ఉన్న ఉక్రెయిన్ సైనికుల చివరి గ్రూపు లొంగిపోయినట్లు రష్యా సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఇగర్ కొనషెంకోవ్ వెల్లడించారు. అంతకు ముందు 2400 మంది ఉక్రెయిన్ పౌరులు, సైనికులను రష్యా సైన్యం తమ అదుపులోకి తీసుకుంది. అయితే, రష్యా బలగాల దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లోనే భారీ పరిశ్రమ అయిన అజోవ్ ప్లాంట్‌లో కొన్ని నెలల పాటు ఉక్రెయిన్ సైన్యం తలదాచుకుంది. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఆంక్షలపర్వం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడుల్లో రష్యాకు సహకారం అందించిన కారణంగా బెలారస్‌పై సెర్బియా ఆంక్షలు విధించింది. అంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యాకు చెందిన ప్రముఖులపై కెనడా బ్యాన్ విధించింది.