More

  RSS కార్యకర్త హత్య వెనుక SDPI..?
  చోద్యం చూస్తున్న పినరయి సర్కార్..!!

  కేరళలో అధికార సీపీఎం మళ్లీ హత్య రాజకీయాలను మొదలు పెట్టిందా? అందుకోసం ఇస్లామిక్ మతోన్మాద గ్రూపులతో జట్టుకట్టిందా? కేరళ లో పట్టపగలు నడి రోడ్డుపై ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తను… అతని భార్య కళ్లేదుట దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు పాల్పడింది ఎస్‌డీపీఐ గూండాలని పోలీసులు అనుమానిస్తున్నారు.

  పాలక్కాడ్ జిల్లా ఎల్లపులికి చెందిన సంజిత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. నవంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం తన భార్యతో కలిసి బైక్ వెళ్తుండగా దారికాచి అడ్డగించిన SDPI గుండాలు అతనిపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ తర్వాత దుండగులు కారులో పారిపోయారని స్థానికులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన సంజిత్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

  పక్కా ప్రణాళికతోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ హత్య జరిగిందని…పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని పాలక్కాడ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేఎం హరిదాస్ ఆరోపించారు. కేరళలో పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్.డీ.ఎఫ్ కూటమి ప్రభుత్వానికి SDPI రాజకీయంగా మద్దతునిస్తోందని ఆయన గుర్తు చేశారు.

  అంతేకాదు 1921లో మలబారు మోప్లా తిరుగుబాటు… జరిగి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేరళ అంతటా కూడా PFI, SDPI  భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. నిజానికి కేరళలో జరిగిన ఈ మలబారు తిరుగుబాటులో బాధితులు హిందువులు. దాదాపు 10 వేల మందికి పైగా హిందువులు చంపబడ్డారు.లక్షల మంది నిరాశ్రయులయ్యారనే విషయం మనం మర్చిపోరాదు. కేరళ హిందూ సమాజం ర్యాలీలు నిర్వహిస్తున్న తీరును తప్పుపడుతోంది. దీంతో రాజకీయ కారణాలతో PFI, SDPI లు హిందూ సంఘాల కార్యకర్తలు, నాయకులు టార్గెట్ గా హత్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. PFI, SDPIలను అదుపు చేయాల్సిన కేరళ పినరయ్ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  ఇంతకీ PFI, SDPI ఆర్గనైజేషన్స్ అసలు మోటివ్ ఏంటి? దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మతపరమైన ర్యాలీలు, హింసాకాండ, అల్లర్ల వెనుక PFI, SDPI లు ఉన్నాయా? గత ఏడాది దేశంలో జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళనల కోసం PFIకి విదేశాల నుంచి భారీగా నిధులు వచ్చాయా? గత ఏడాది డిసెంబర్ 22న బెంగళూరులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త వరుణ్ పై జరిగిన హత్య వెనుక కూడా ఉన్నది SDPI కార్యకర్తలేనా? ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరులోని డీజేహళ్లి, కేజీహళ్లి ప్రాంతాల్లో జరిపిన విధ్వంసం వెనుక SDPI , PFI సభ్యులు ఉన్నారా? మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో VHP బైక్ ర్యాలీపై దాడి కూడా వీళ్లపనేనా? ఇంకా యూపీలో జరిగిన హత్రాస్ ఘటనను రాజకీయంగా వాడుకుని ప్రజల మధ్య హింస జరిగేలా పీఎఫ్ఐ కుట్రలు చేసిందా? తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలోని రాయలసీమ జిల్లాల్లోని ముస్లిం మెజారిటీ నియోజకవర్గాలపై SDPI దృష్టి పెట్టిందా? ఈ ఏడాదిలో ఏపీలో ఈ సంస్థకు చెందిన కార్యకర్తల ఇళ్ళపై ఈడీ సోదాలు నిర్వహించడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  PFI అనేది ఒక ఇస్లామిక్ మతోన్మాద సంస్థ. దీని పూర్తి పేరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా..! దీని రాజకీయ విభాగం SDPI. దీని పూర్తి పేరు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. 1990వ దశకంలో దేశంలో నిషేధానికి గురైన సిమికి ప్రతిరూపమే ఈ PFI అని దేశ అంతర్గత భద్రత నిపుణులు చెబుతుంటారు. సిమి నిషేధానికి గురైన తర్వాత అందులోని క్రియశీలక సభ్యులుగా ఉన్నవారందరు కలిసి… ఇస్లామిక్ అనే పదం లేకుండా… బయట జనానికి చూసేందుకు ఒక డెమోక్రటిక్ సంస్థ మాదిరిగా కలరింగ్ ఇచ్చేలా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. నిఘా వర్గాల నుంచి తప్పించుకునేందుకు… తమకు సైతం పొలిటికల్ గా ఒక రక్షణ కవచంగా ఉండాలనే తలంపుతో సోషల్ డెమెక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగిందని విశ్లేషకులు చెబుతుంటారు.

  మొదట్లో దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు దృష్టి నిలిపిన SDPI కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు…, ఆ ప్రభుత్వ పరోక్ష మద్దతుతో కర్ణాటక రాష్ట్రంలో తన బేస్ ను పటిష్టం చేసుకుంది. ఆ సమయంలో కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు.

  గత ఏడాది డిసెంబర్ 22న ఆర్ఎస్ఎస్ కార్యకర్త వరుణ్ పై హత్యయత్నం జరిగింది. దర్యాప్తు సందర్భంగా అనేక కీలక విషయాలు బయటపడ్డాయి. SDPIకి చెందిన ఇర్పాన్, సయ్యద్ అక్బర్, అక్బర్ బాషా, సయ్యద్ సిద్ధికి అక్బర్, సనావుల్లా షరీఫ్ లను పోలీసులు అరెస్టు చేశారు.

  అలాగే…ఈ ఏడాది ఆగస్టు 11న బెంగళూరులోని డీజేహళ్లి, కేజీహళ్లి ప్రాంతాలో జరిగిన విధ్వంసం వెనుక ఉగ్రకోణాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో  NIA నే రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేసింది. బెంగళూరులో జరిగిన అల్లర్లు వెనుక పెద్ద కుట్ర ఉందని… ముందస్తుగానే సమావేశం ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి… రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని… హింసను ప్రేరేపించారని విచారణలో తేలింది. బెంగళూరు జిల్లా SDPI అధ్యక్షుడు ఎండీ షరీఫ్, కెజి హల్లి వార్డ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ అహ్మద్ తోపాటు రుబా వకాస్, షబ్బార్ ఖాన్, షేక్ అజ్మల్ ను విచారించిన సమయంలో వారు విస్తుపోయే విషయాలను బయటపెట్టారని అంటారు. అల్లర్లను వ్యాప్తి చేయడానికి సద్దాం, సయ్యద్ సోహెల్, కలీముల్లా అనే

  వ్యక్తులు… ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ గూపుల్లో తప్పుడు ప్రచారం చేశారని తేలింది.అలాగే నాగ్వారా వార్డు అధ్యక్షుడు అబ్బాస్ తన అనుచురులతో  కలిసి కేజీహళ్లి పోలీస్ స్టేషన్ కు నిప్పు అంటించారని ఎన్ఐఏ అధికారులు విచారణలో గుర్తించి అరెస్టు చేయడం జరిగింది.ఈఘటనలో పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ ఇంటిని సైతం SDPI కార్యకర్తలు తగులబెట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

  మధ్యప్రదేశ్ లోకూడా గత ఏడాది డిసెంబర్ 25వ తేదీన ఉజ్జయినీలో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన బైక్ ర్యాలీపై బేగమ్ బాగ్ ఏరియాలో ఒక్కసారిగా రాళ్లదాడి జరిగింది.ఈ దాడుల ఘటన వెనుక PFI కార్యకర్తలు ఉన్నట్లుగా గుర్తించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా దాడి చేశారని నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

  అలాగే యూపీలో జరిగిన హత్రాస్ ఘటనను రాజకీయంగా వాడుకోవడంతోపాటు, ప్రజల మధ్య హింస జరిగేలా రెచ్చగొట్టేందుకు PFI కుట్రలు చేసినట్లుగా యూపీ పోలీసులు గుర్తించడం జరిగింది. కులాల మధ్య చిచ్చురేపి దేశ వ్యాప్తంగా ఘర్షణలు జరిగేందుకు పీఎఫ్ఐ కుట్రలు చేసిందని , ఈ క్రమంలోనే  కేరళకు చెందిన సిద్దిక్ కప్పన్ అనే జర్నలిస్టుతోపాటు ముగ్గురిని యూపీ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు అయిన అందరూ కూడా పాపులర్ ఫ్రంట్ యాక్టివ్ మెంబర్లుగా తేలింది. యూపీలో జరిగిన సీఏఏ వ్యతిరేక అల్లర్లలో పీఎఫ్ఐ లింకులు బయటపడటంతో యూపీ ప్రభుత్వం రాష్ట్రంలో పీఎఫ్ఐ కార్యకలాపాలను నిషేధించడం జరిగింది.

  గత ఏడాది దేశంలో జరిగిన సీఏఏ ఆందోళనలు, అల్లర్ల వెనుక PFI పాత్ర ఉందని  గుర్తించిన NIA దేశం విస్తుపోయే వాస్తవాలను బయటపెట్టింది. పీఎఫ్ఐ చైర్మన్ ఓఎం అబ్దుల్ సలాం నివాసంతోపాటు, కేరళ పీఎఫ్ఐ యూనిట్ హెడ్ నసిరుద్ధున్ ఎలామరం ఇళ్లు , కార్యాలయంలోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోని బ్యాంకుల నుంచి పీఎఫ్ఐ ఖాతాల్లో కేవలం ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే…120 కోట్లు జమ అయినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.

  దేశంలోని అన్ని ప్రాంతాల్లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడం కోసం ఆ తర్వాత ఈ మొత్తం అమౌంట్ ను 73 PFI ఖాతాలకు మళ్లించినట్లు విచారణలో తేలింది. అలాగే….దుబాయ్ లోని PMA ఇంటర్నేషనల్  LLC దుబాయ్ బ్యాంక్ అకౌంట్ నుంచి PFI అనుబంధ ఎన్జీవో రెహాబ్ ఇండియా ఫౌండేషన్ కు సైతం పెద్దమొత్తంలో నిధులు జమ అయినట్లు చెబుతున్నారు.  

  ఈ వ్యవహారాలు అన్ని కూడా నడిపిస్తున్నది…కేరళ విద్యుత్ బోర్డులో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న అబ్దుల్ సలామేనని గుర్తించడం జరిగింది. దేశంలో ఇస్లామిక్ నెట్ వర్క్ క్రియేట్ చేయడంలో సలాం కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయా సంస్థలకు  సంబంధించిన  నిధుల తరలింపు వ్యవహారాలు అన్నింటిని  PFI ఛైర్మన్ హోదాలో అతనే మ్యానేజ్ చేస్తున్నాడని నేషనల్ మీడియాలో సైతం కథనాలు ప్రసారం అయ్యాయి.

  అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే…, పై అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అనేక సార్లు దుబాయ్ తోపాటు విదేశాలకు వచ్చినట్లు తేలింది. ఈడీ సోదాల్లో అందుకు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమైనట్లు ప్రచారం జరిగింది. అటు ఈడీ విచారణ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం…ఓఎం అబ్దుల్ సలాంను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది కూడా.!

  అలాగే ఈ మధ్యకాలంలో ఏపీలోని రాయలసీమ జిల్లాల్లోని ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో  SDPI విస్తృతంగా రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వీటికి అందుతున్న విదేశీ నిధులపై కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 23వ తేదీన ఏపీలోని కర్నూలు జిల్లా..నంద్యాల, ఎమ్మిగనూరులో PFI, SDPI నాయకుల ఇళ్ళల్లోను ఈడీ సోదాలు జరిపిన విషయం మనం మర్చిపోరాదు.

  SDPI,PFIల హత్య రాజకీయాలు దేశమంతట ఇంతలా కొనసాగుతున్న…కాంగ్రెస్ తోపాటు, వామపక్షాలు, మీడియా,పత్రికలు ఎందుకు మౌనం వహిస్తున్నాయో దేశ ప్రజలు ఇప్పటికైన అర్థం చేసుకోవాలి. దీనికీ మీరేమంటారు. మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. మనసా వాచా కర్మణా దేశహితం కోసం పాటుపడండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించడండి. భారత్ మాతాకీ జై.

  Trending Stories

  Related Stories