More

    RSS ప్రధాన కార్యదర్శిగా కొత్తవారు రాబోతున్నారా.?

    రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రతినిధి సభా సమావేశాలు మార్చి 19న బెంగళూరులో ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ పరమ పూజనీయ శ్రీ మోహన్ భగవత్ , సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులుగా ఎన్నికవారితోపాటు రాష్ట్రాల ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.

    ఈ సమావేశాల్లోనే ఆర్ఎస్ఎస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఆర్ఎస్ఎస్ లో జరిగే ఈ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు కూడా సంఘ్ కేంద్ర స్థానమైన నాగపూర్ లోనే జరిగేది. అయితే కొవిడ్ కారణంగా ఈ సారి సమావేశాలు నాగపూర్ లో నిర్వహించేందుకు పరిస్థితులు అనువుగా లేకపోవడంతో ఈ సమావేశాలను బెంగళూరులో నిర్వహించడం జరుగుతోంది. ఈ సమావేశాలకు ఏటా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి 1500 మంది ప్రతినిధులు హజరయ్యేవారు. అయితే కరోనా నిబంధనల దృష్ట్యా ఈ సంఖ్యను 500కు కుదించారు. దీంతోపాటు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల ప్రతినిధులను ఈ సమావేశాలకు ఆహ్వానించలేదు.

    నిజానికి ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభా సమావేశాలు 2020 మార్చిలోనే జరగాల్సి ఉండగా…, కొవిడ్ కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఈ సమావేశాల్లో రాబోయే మూడు సంవత్సరాలకు సంబంధించిన సంఘ్ కార్యవిస్తరణ కోసం ప్రణాళిక రూపకల్పన జరగనుంది. అలాగే 2024 లో జరగబోయే లోక్ సభ ఎన్నికలతోపాటు, 2025నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా దేశంలోని అన్ని గ్రామాల్లో సంఘ్ శాఖలను పరిచయం చేయాలనే లక్ష్యంతో ఓ ప్రత్యేక అభియాన్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం సంఘ్ శాఖలు దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నడుస్తున్నాయి. అలాగే 85 శాతం తాలుకా కేంద్రాల్లో సంఘ శాఖలు యాక్టివ్ గా నడుస్తున్నాయి.ప్రస్తుతం దేశంలో 58 వేల500 మండలాలు ఉండగా అన్ని మండలాల్లో కూడా ఆర్ఎస్ఎస్ శాఖ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    శ్రీరామమందిర నిధి సేకరణ్ అభియాన్ లో భాగంగా దేశంలోని 5 లక్షల 45 వేల 737 గ్రామాలకు స్వయం సేవకులు వెళ్లారని, దాదాపు 20 లక్షల మంది కార్యకర్తలు ఈ కార్యంలో పాల్గొన్నారు. 12 కోట్ల 47 లక్షల కుటుంబాలను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గత మూడేళ్లు సంఘం నిర్వహించిన కార్యక్రమాల నివేదికను సభలో విడుదల చేయడం జరిగింది.

    అలాగే సంఘ్ లో సర్ సంఘచాలక్.. తర్వాత 2వ స్థానం ప్రధాన కార్యదర్శిదే. వీరే సంఘ్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. గత 12 సంవత్సరాలుగా ఈ బాధ్యతలో భయ్యాజీ జోషి కొనసాగుతున్నారు. 2009లో ఆయన మొదటిసారిగా ఈ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ బాధ్యతల నుంచి తనను తప్పించాల్సిందిగా భయ్యాజీ 2018లో సంఘ్ నాయకత్వాన్ని అభ్యర్థించారు. మార్చి 20వ తేదీన సంఘ్ నూతన కార్యవర్గం కోసం ఎన్నికలు జరగుతాయి. దీంతో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మళ్లీ భయ్యాజీనే కొనసాగుతారా? లేక వారి స్థానంలో యువకుడైన మరోక సీనియర్ ప్రచారక్ ను ఆ బాధ్యతల్లో నియమిస్తారా? అనేది ఈ సమావేశాల్లో తేలనుంది.

    Trending Stories

    Related Stories