More

  తీవ్ర అనారోగ్యంతో.. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధుడు..!

  మాతృభూమి మీద ప్రేమ.. ధర్మం మీద అభిమానం.. ఆర్ఎస్ఎస్ మీద ఎనలేని మక్కువ.. స్వయం సేవకుడిగా నిరంతరం పార్టీ నిర్మాణం కోసం.. నిస్వార్థంగా కృషి చేసిన ఓ పోరాట యోధుడు నేడు తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నాడు. ఆయనే శ్రీరామోజు షణ్ముఖ అలియాస్ జెన్నయ్య.

  1963 నుంచి దాదాపు 65 ఏళ్ల పాటు స్వయం సేవక్ గా సేవలు అందించారు శ్రీరామోజు షణ్ముఖ. నల్గొండ పట్టణంలోని పాతబస్తీ శివాలయం దగ్గర మొదలైన అయన జీవన ప్రస్థానం.. భారతీయ జనసంఘ్, హిందూ వాహిని, ఏబీవీపీలో కొనసాగింది. అలాగే బీజేపీ రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇంఛార్జిగా కూడా అయన విశేష సేవలు అందించారు. ఓయూతో పాటు.. గుంటూరు ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా కూడా పనిచేశారు.

  1975 జూన్ 25 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించగానే.. ఆ మరుసటి రోజునే అంటే 1975 జూన్ 26 ఆయన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలోకి దూకారు. సహచర మిత్రులు, తోటి స్వయం సేవకులు ఎర్రమల్ల భాస్కర్, మిర్యాల ప్రకాష్ తో కలిసి ఉద్యమ కార్యచరణకు సిద్ధమయ్యారు. నల్గొండ గాంధీ పార్కులో సమావేశాలు నిర్వహించడంతో పాటు తన సొంత ఇంట్లో కూడా సమావేశమై ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రణాళికలు రచించారు. ఇందిరాగాంధీ దమననీతికి వ్యతిరేకంగా కరపత్రాలు ముంద్రించి పంపిణీ చేశారు. ఇంట్లోనే జిల్లి మిషన్ పెట్టి కరపత్రాలు ముద్రించేవారు. చీకటి పడిన తర్వాత సాయంత్ర 5 నుంచి 8 గంటల మధ్యలో కరపత్రాల పంపిణీ చేసేవారు. వాటిని కలెక్టర్, జడ్జిలు వంటి ప్రముఖుల ఇళ్లతో పాటు.. సినిమా హాళ్లలో పంపిణీ చేసేవారు. ఈ కరపత్రాల కోసం మిర్యాల ప్రకాష్ పెద్ద ఎత్తున పేపర్ సమాకూర్చే వారు.

  ఐతే పోలీసుల నిఘా వల్ల షణ్ముఖ, భాస్కర్ అజ్ఞాతంలోకి వెళ్లాల్సివచ్చింది. అయితే, ఈ విషయం తెలియని మిర్యాల ప్రకాష్ ఓరోజు సినిమా చూడ్డానికి వెళ్లాడు. దీంతో అప్పటికే కరపత్రాల ముద్రణ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఈ కరపత్రాలకు పేపర్ ఎక్కడ కొనుగోలు చేశారని ఆరాతీశారు. క్లూ దొరకడంతో ప్రకాష్ ఇంటికి వెళ్లి ఎంక్వయిరీ చేశారు. అయితే, విషయం తెలియిని ప్రకాష్ కుటుంబ సభ్యులు,.. ఆయన ఇంట్లో లేరని,.. సినిమాకు వెళ్లారని చెప్పారు. దీంతో వెంటనే సినిమా హాలుకు వెళ్లి మిర్యాల ప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసుల టార్చర్ భరించలేక,.. షణ్ముక, భాస్కర్ పేర్లను బయటపెట్టారు మిర్యాల ప్రకాష్. ఆ తర్వాత షణ్ముఖ, భాస్కర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి.. టార్చర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న నాటి ఎమ్మెల్సీ వి. రామారావు.. అసెంబ్లీలో స్వయం సేవకుల అరెస్టులపై నిలదీశారు. దీంతో 5 రోజులు టార్చర్ చేసిన తర్వాత.. ముగ్గుర్ని పోలీసులు విడిచిపెట్టారు.

  ఆ తర్వాత కూడా అజ్ఞాతంలో ఉండే.. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో షణ్ముఖ, భాస్కర్, ప్రకాష్ పాల్గొన్నారు. ఆరెస్సెస్ పిలుపు మేరకు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా నగరంలో సత్యాగ్రహాలు నిర్వహించారు. అజ్ఞాతం నుంచే సత్యాగ్రహాలకు దిశానిర్దేశం చేసేవారు. అలా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నల్గొండ నగరంలో రోజుకో చోట సత్యాగ్రహం జరిగేది. అటు దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంతో అరెస్టులు ఊపందుకున్నాయి. అప్పటికే వాజ్ పేయి, జయ ప్రకాష్ నారాయణ, అద్వానీ లాంటి అనేకమందిని జైల్లో పెట్టారు. గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాన్ని అణచివేసిన పోలీసులు.. లక్షలాది మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలా 1976 జనవరి 26న షణ్ముఖతో పాటు, భాస్కర్, కూడా పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చింది. తర్వాత వారిని ఆర్నెళ్లు జైల్లో ఉంచారు. ఎలాంటి ఎన్నికల లబ్ది లేకుండా.. రాజకీయ ప్రయోజనాలు ఆలోచించకుండా.. కేవలం దేశం కోసం శ్రీ రామోజు షణ్ముఖ అండ్ టీమ్ స్వచ్చందంగా ఉద్యమించారు.

  అలాంటి షణ్ముఖ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిస్వార్దానికి మారుపేరైన శ్రీ రామోజు షణ్ముఖ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. షణ్ముఖను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని నేషనలిస్ట్ హబ్ మనసారా ఆకాంక్షిస్తోంది.

  Trending Stories

  Related Stories