10% రాజకీయాలు, 90% సామాజిక సేవ చేస్తా: నితిన్ గడ్కరీ

0
875

గురువారం పూణెలో ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన జీవితంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి పంచుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రతన్ టాటాను తీసుకురావాలకి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ఒకరు తనను అభ్యర్థించారని గడ్కరీ చెప్పారు. ఆర్ఎస్ఎస్ కట్టిన ఆ ఆసుపత్రి హిందూ సమాజానికి మాత్రమే ఉపయోగపడుతుందా అని రతన్ టాటా తనను అడిగారని ప్రారంభోత్సవం సందర్భంగా గడ్కరీ చెప్పారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మతం ఆధారంగా వివక్ష చూపదని గడ్కరీ బదులిచ్చారు.

గడ్కరీ పూణేలోని సిన్హాబాద్ ప్రాంతంలో ఓ చారిటబుల్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. “గతంలో నేను మహారాష్ట్రలో శివసేన-బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో ఔరంగాబాద్ లో కొత్తగా ఆసుపత్రి నిర్మించారు. ఆ ఆసుపత్రికి దివంగత ఆర్ఎస్ఎస్ అగ్రనేత కేబీ హెడ్గేవార్ పేరు పెట్టారు. ఆ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రతన్ టాటాను పిలుద్దామని ఓ ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు నాకు సూచించారు. రతన్ టాటాను ఆహ్వానించే బాధ్యతను నాకు అప్పగించారు. ఆ విషయం రతన్ టాటాకు విషయం చెప్పాను. ఆయన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చేందుకు అంగీకరించారు. స్వయంగా వెళ్లి తీసుకుని వస్తున్న సమయంలో ఆసుపత్రికి మరికొంతసేపట్లో చేరుకుంటామనగా, రతన్ టాటా నన్నో ప్రశ్న అడిగారు. ఈ ఆసుపత్రిలో కేవలం హిందువులకే వైద్యం చేస్తారా? అని అడిగారు. అలా ఎందుకు అనుకుంటున్నారు? అని అడిగాను. ఈ ఆసుపత్రి ఆర్ఎస్ఎస్ కు చెందినది కదా? అని ఆయన బదులిచ్చారు. ఈ ఆసుపత్రి అన్ని వర్గాల వారికీ చెందినదని, మతాల ఆధారంగా ఇక్కడ వివక్ష చూపించడం జరగదని తెలిపాను. దాంతోపాటు ఆసుపత్రి గురించి మరికొన్ని విషయాలు కూడా వివరించడంతో రతన్ టాటా ఎంతో సంతోషించారని నితిన్ గడ్కరీ నాటి సంఘటనను గుర్తు తెచ్చుకున్నారు.

దేశంలో ఆరోగ్యం మరియు విద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మరిన్ని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. “దేశంలో విద్య, ఆరోగ్య రంగాలలో అవసరమైనంత సౌకర్యాలు లేవు. పట్టణ ప్రాంతంలో సౌకర్యాలు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి బాగాలేదు, ముఖ్యంగా విద్యారంగం పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి.” అని ఆయన అన్నారు. తాను 10% రాజకీయాలు, 90% సామాజిక సేవ చేస్తానని గడ్కరీ అన్నారు.