విద్యాబుద్దులు సరే..కానీ ఈ విషబీజాలెందుకు?

0
933

తెలుగు రాష్ట్రాలే కాదు…దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే ఆన్ లైన్ మీడియాలో సైతం ఒకటే చర్చ! అది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి..డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గురించి..!  పెద్దపల్లి జిల్లా దూలికట్లలోని బౌద్ధ క్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో, ఆయన సమక్షంలో అక్కడికి హాజరైన ప్రజల చేత చేయించిన ప్రతిజ్ఞ..గురించి!  ప్రతిజ్ఞ చేయిచండం తప్పుకాదు.! కానీ ప్రతిజ్ఞ పేరుతో హిందూ సంస్కృతి, సంప్రదాయాలను, దేవీ దేవతలను తులానడటం ఎంత వరకు కరెక్టు అనేదే అసలు ప్రశ్న.? అంతేకాదు.. ఆ ప్రతిజ్ఞలో ఒక దగ్గర కుట్ర అనే పదం కూడా వాడటం జరిగింది.! ప్రభుత్వ ఉన్నతాధికారిగా అన్ని మత సంప్రదాయాలను గౌరవించడం ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కనీస బాధ్యత.! అయితే ఆయన హిందూ ద్వేషిగా మారిపోయారా?  హిందూ ధర్మాన్ని కించపర్చడమే లక్ష్యంగా ఆ ప్రతిజ్ఞను రూపొందించారా ? అంటూ కొంతమంది ధార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఆయనపై మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు కూడా చేశారు.

ఎన్నో మంచి పనులు చేసి కూడా…,  జస్ట్ ఒక చిన్న మిస్టేక్ తో అప్పటి వరకు  చేసిన ఆ మంచి పనులు అన్ని కూడా సెంకడరీ అయిపోతాయని కొంతమంది పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలోనూ ఇదే జరుగుతోందని అనేవారు కూడా లేకపోలేదు.

ఒకప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలు, హస్టళ్ల పేరు చెబితే అందరూ హడలిపోయేవారు. అరకొరవసతులతో, కనీస సౌకర్యాల లేమితో, నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండేవి. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత గురుకుల సంక్షేమ పాఠశాలల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారన్నది వాస్తవం. పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపర్చారు. మీరు ఎవరికంటే కూడా తక్కువ కాదు.! బుద్దిగా చదువుకుని జ్ఞానాన్ని సమపార్జించుకుంటేనే బంగారు భవిష్యత్తు అంటూ విద్యార్థులను మోటివేట్ చేశారు. మీరు తలచుకుంటే… మీ ముందు ఎవరెస్టు శిఖరం ఎంత..! అంటూ గురుకుల విద్యార్థుల చేత ఆ ఎవరెస్టు శిఖరాన్ని సైతం అధిరోహింప చేశారు.! విద్యార్థుల భోజనం దగ్గర నుంచి ఆటల వరకు అన్ని ఎప్పటికప్పుడూ స్వయంగా వాట్సాప్ గ్రూపు ద్వారా తెలుసుకుంటారు. సమ్మార్ సెలవుల్లో విద్యార్థులు ఇంటికి వెళ్లే కంటే, హాస్టళ్లల్లోనే ఉండి ఆటల్లో ప్రత్యేక శిక్షణ తీసుకోవాలంటూ పోత్సహించారు.

అంతేకాదు కార్పొరేట్ విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లకు దీటుగా… 2018-19 విద్యాసంవత్సరంలో గురుకుల సంక్షేమ కాలేజీల నుంచి ఎంబీబీఎస్ లో 53 మంది విద్యార్థులు, బీఎస్లో 27 మంది విద్యార్థులు, 2019-20 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ లో 102 మంది, బీడీఎస్ లో 40 మంది సీట్లు సాధించారంటే దీని వెనుక ఆర్ఎస్ ప్రవీణ్…సంకల్పం, సంక్షేమ శాఖ గురుకులాల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుల కృషిని అందరూ అభినందించాల్సిందే.!

అయితే ఇంత వరకు బాగానే ఉన్నా… స్వేరోస్ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే హిందూ సంస్కృతి, పండుగలపై ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్లు…ఆయన స్థాయిని మరింత దిగజార్చాయని కొంతమంది నెటిజన్లు అంటుంటారు. దసరా,దీపావళి వంటి హిందూ పండుగలను వ్యతిరేకిస్తూ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్లును ప్రజలెవరు మర్చిపోలేదు. అలాగే తెలంగాణ ఆడపడుచులు ఎంతో ముచ్చటగా జరుపుకునే బహుజనుల పండుగ బతుకమ్మను సైతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యతిరేకించడం జరిగింది.

తాము నరకాసురుడి వారసులమని, ఆ నరకాసురుడినే చంపి.. తమ చేత తిరిగి పండుగుల జరిపిస్తున్నారని ఒక సందర్భంలో ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా బతుకమ్మ పండగను ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. కానీ ప్రభుత్వం తరపున పనిచేసే ఉన్నతాధికారి మాత్రం ఈ పండుగుల మావికావు అని బహిరంగంగానే అంటున్నా,  తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ, అలాగే బతుకమ్మ పండుగను విశ్వావ్యాప్తం చేశామని చెప్పుకునే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కానీ ఇంత వరకు పట్టించుకోలేదు. కనీసం ప్రవీణ్ కుమార్ చేసిన ఆ విదాస్పదవ్యాఖ్యలపై స్పందించనూ లేదు. ఖండించను లేదు.! మౌనంగా ఉండిపోయారు అంతే!  కేసీఆర్ ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిదంటే… ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగానే భావించాలా? ఇలా ప్రవీణ్ కుమార్పై ఇంకా చాలానే ఆరోపణలు ఉన్నాయి.  గురుకుల పాఠశాలు, కాలేజీల్లో  హిందూ పండుగలను నిర్వహించరాదని, ఆ రోజున సెలవులు కూడా ఇవ్వరాదని ఆయనే హుకులుం జారీ చేశాడని అంటారు. అయితే అదే సమయంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడాన్ని తెలుగు ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి.? హిందు ధర్మంపై ఎందుకంతా కోపం? క్రైస్తవంపై ఎందుకంతా ఉదారత..?

ఇంకా గురుకులాల్లో స్వేరోస్ పేరుతో జరుపుతున్న ఆగడాలపై జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి గతంలో అప్పటీ తెలంగాణ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసింది. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞకు బదులుగా., విద్యార్థుల చేత స్వేరోస్ ప్రతిజ్ఞ చేయిస్తున్నారని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కర్నె శ్రీశైలం ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రసంగిస్తుండగా… కొంతమంది స్వేరోస్ వచ్చి.. మీడియా సాక్షిగా శ్రీశైలంపై దాడి చేయడం జరిగింది. దీనిపై పంజాగుట్ట పీఎస్ లో కేసు కూడా నమోదు అయ్యింది. కనీసం ఈ ఘటనపై కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించలేదు. స్వేరోస్ చేసిన దాడిని ఖండిచను లేదు. తాజాగా కోదడ పర్యటనకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కూడా దాడికి యత్నించడాన్ని మనం చూశాం. స్వేరోలకు ప్రవీణ్ కుమార్ నేర్పుతున్నది ఏంటో తెలుసుకోవాడానికి ఈ రెండు ఘటనలు చాలు!

ఇక ప్రతి ఏడాది మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు రాష్ట్రంలో భీమ్ దీక్షను ప్రవీణ్ కుమార్ స్వేరోస్ ఆధ్వర్యంలో ప్రారంభింప చేశారు.  మార్చి 15న బీఎస్పీ పార్టీ స్థాపకుడు కాన్హీరామ్ జయంతి నుంచి అంబేద్కర్ జయంతి  ఏప్రిల్ 14 వరకు ఈ భీమ్ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్ష ద్వారా ఆధ్యాత్మికతోపాటు సమాజంలోని అన్ని వర్గాల మధ్య  సమరసతకు బాటలు వేయాల్సింది పోయి.. రెచ్చగొట్టే ప్రసంగాలతో విద్యార్థుల మనస్సుల్లో విషబీజాలు నాటుతున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ఇంకా భీమ్ దీక్షలో పాల్గొనే వారందరూ మద్యం, మాంసం భూజించరాదనే నియమం పెట్టారు.! బాగానే ఉంది. కానీ..!  ఇదే ప్రవీణ్ కుమార్.., కంచె ఐలయ్యకు తోడుగా బీఫ్ ఫెస్టివల్స్ ను ప్రోత్సహించిన విషయం కూడా ఎవరు మర్చిపోరాదు. ఒక వైపు మద్యం, మాంసం వద్దు అంటూనే ఈ బీఫ్ ఫెస్టివల్ ను ప్రోత్సహించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

2017 డిసెంబర్ 31న పుణేలోని శనివార్ వాడలో ఎల్గార్ పరిషత్ సమావేశం ఒకటి జరిగింది. ఈ సమావేశంలో తుక్డే తుక్డే గ్యాంగ్ లో మొంబరైన ఢిల్లీ జెన్ఎయూ పూర్వ విద్యార్థి ఉమర్ ఖాలీద్ తోపాటు గుజరాత్ కు చెందిన ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ కూడా పాల్గొన్నాడు. మరుసటి రోజు  2018 జనవరి 1న భీమా కోరేగావ్ లో హింసకాండ చెలరేగింది. ఒక వ్యక్తి కూడా మరణించాడు. ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలతోనే ఘర్షణలు జరిగినట్లు తుషార్ దాంగుడే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘర్షణలకు సంబంధించి కొంతమంది వ్యక్తులను అరెస్టు చేసిన సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ ద్వారా… ఎల్గార్ పరిషత్ నేతలకు మావోయిస్టులతో సంబంధాలున్నట్లు తేలిందని..పోలీసులు ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది.

 ఆ ఎల్గార్ పరిషత్ సమావేశంలో అల్లర్లను రెచ్చగొట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జిగ్నేష్ మేవానీ హైదరాబాద్ కు కూడా వచ్చారు. ఆయన వచ్చిన సందర్భంలో ఓ ఓయూ ఫ్రొఫెసర్ ఇంట్లో కంచె ఐలయ్యతోపాటు ప్రవీణ్ కుమార్ రహస్య సమావేశమైనట్లు టీవీల్లో బ్రేకింగ్ న్యూసులు వచ్చాయి. మీడియా రాకను గమనించిన ప్రవీణ్ కుమార్ ఆ సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చిన దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో సైతం షికార్లు కొట్టాయి.

ప్రభుత్వ ఉన్నాధికారిగా ఉంటూ అసలు ఆ సమావేశానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు వెళ్లినట్లు? ఇక ఆ సమావేశం నుంచి బయటకు వచ్చిన జిగ్నేష్ మేవానీ బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలంటూ ఆ రోజు  చేసిన పొలిటికల్ ప్రకటనను ఏమనుకోవాలి? బీజేపీకి వ్యతిరేకంగా జిగ్నేష్ మేవానీ చేసిన రాజకీయ కామెంట్లు ఆ సమావేశంలో పాల్గొన్నవారందరి సమష్టి నిర్ణయమనే అనుమానాలు ఎవరికైనా కలుగక మానవు.

అంబేద్కర్ ప్రవచించిన బుద్ధుడి ఆధ్యాత్మిక సాధన సూత్రాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గానీ, ఆయన శిక్షణ ఇచ్చిన స్వేరోలు కానీ, త్రికరణ శుద్ధిగా పాటిస్తున్నారా ? అంటూ అనుమానాలు వ్యక్తం చేసే వారు కూడా ఉన్నారు. నిజానికి బుద్దుడు చెప్పిన సూత్రాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తే… అగ్రకులాలు, బ్రాహ్మణవర్గాలు అంటూ వారిని నిత్యం ఎవరూ  దూషించరు.!

భారతీయ సమాజంలో రాముడు, కృష్ణుడనేవారు విడదీయరాని భాగం. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య నగరానికి వచ్చాడని కొంతమంది సాహిత్యకారులు చెబుతుంటారు. అలాంటి రాముడి, కృష్ణుడి జీవితాలలోని ఘట్టాలను ప్రస్తావిస్తూ స్వేరోలు అవహేళన చేస్తుంటారు.

ఇవన్నీ చూసిన కొంతమంది ఆర్ఎస్ ప్రవీణ్ అసలు అజెండానే వేరని అంటున్నారు. హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ, అలాగే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలను ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల నుంచి దూరం చేసేందుకు బౌద్ధాన్ని ఒక కవచంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, స్వేరోలు వాడుకుంటున్నారని , దీని వెనుక వారి అసలు మోటివ్ వేరేనే ఉందని అనే వారు కూడా ఉన్నారు.

హిందూ సమాజం నుంచి ఎస్సీ,ఎస్టీలను దూరం జరిపేందుకు ఎలాగైతే ప్రవీణ్ కుమార్… ఆయన స్వేరోలు చేస్తున్నారో…,  క్రైస్తవ మిషనరీలు కూడా అచ్చంగా అలాగే చేస్తున్నాయనే విషయాన్ని గుర్తు  పెట్టుకోవాలని మరికొందరు గుర్తు చేస్తున్నారు. హిందువుల్లోని కులాల మధ్య వివక్షతలు ఉన్నాయనే పేరుతో, మతం మార్పిడీ కార్యకలాపాలను క్రైస్తవ మిషనరీలు చేస్తున్నాయి. వారిని భారతీయ సంస్కృతి నుంచి దూరం చేస్తున్నాయి.

ప్రవీణ్ కుమార్ … స్వేరోలు చెప్పే బౌద్ధ ధర్మానికి, అంబేద్కర్ ప్రవచించిన బౌద్ధధర్మానికి ఎంతో తేడా ఉంది. స్వేరోల మాదిరిగా అంబేద్కర్ ఏ ఇతర మతాలను దూషించలేదు.1935 అక్టోబర్ 13న జరిగిన యెవలా సభలో అప్పటి సమాజంలో నెలకొన్న అస్పృశ్యత పై అంబేద్కర్ తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. తాను హిందువుగా జన్మించానని.., అయితే హిందుమతస్థునిగా మాత్రం చావబోనని తన ప్రజలకు మాట ఇస్తున్నానని ఆ సభలో ప్రకటించడం జరిగింది.

అయితే ఆ ప్రకటన చేసిన తర్వాత చాలా ఏళ్ళపాటు మతం మారే ఆలోచనకు సంబంధించి అంబేద్కర్ మళ్లీ ప్రస్తావన చేయలేదు. ఒక వేళా తాను మతం మారినా, భారత దేశానికి, హిందూ సంస్కృతికి సంప్రదాయాలకు అపకారం చేసే విదేశీ మతాలైనా ఇస్లామ్, క్రైస్తవంలోకి మాత్రం మారనని ఎంతో స్పష్టంగా చెప్పారు.! ఇదే విషయంపై కూడా గాంధీజీకి అంబేద్కర్ మాట ఇచ్చారు.

అంబేద్కర్… కమ్యూనిజం ఐడియాలజీని తీవ్రంగా వ్యతిరేకించారనేది నిప్పులాంటి నిజం.! తన జీవితపు చరమదశలో తన ప్రజానీకం కమ్యూనిస్టుల మాయాజాలంలో పడుకుండా రక్షించుకోనడానికి 1956 అక్టోబర్ 14న నాగపూర్ లో దాదాపు 5 లక్షల మందితో కలిసి అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. ఆనాటి తన ప్రసంగంలో మతం ప్రాముఖ్యం గురించి తన అనుయాయులకు వివరించి చెప్పారు అంబేద్కర్.! మానవాళి పురోగతికి మతం ఎంతో అవసరమన్నారు. కమ్యూనిస్టులు మతం మత్తుమందు అంటారని, తిను, త్రాగు, ఆనందించు అనే సూత్రాలకు తాను వ్యతిరేకినని చెప్పారు.

అంతేకాదు… మన మధ్యలో ఉండే  కొంతమంది అభ్యుదయవాదులమని చెప్పుకునే సోకాల్డ్ మేధావులు.. భారత్ లో బౌద్ధం కనుమరుగుకావడానికి హిందూ ధర్మం, మరి ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ రాజులేనని తప్పుడు ప్రచారం చేస్తుంటారు. కానీ ఇది నిజం కాదు! దీనిపై అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? మన దేశంలో బౌద్ధం కనుమరుగుకావడానికి అసలు కారణం విదేశీ ముస్లిం దండయాత్రలేనని తేల్చి చెప్పారు. విదేశీ ముష్కరులు… వేలాది విగ్రహాలను విరగొట్టి నాశనం చేశారని, బౌద్ధ విహారాలను అపవిత్రం చేశారని,. లక్షలాదిమంది భిక్షువులను చంపివేశారని,. ఈ పైశాచిక అకృత్యాల కారణంగా, బౌద్ధ భిక్షువులు ఇక తప్పని పరిస్థితుల్లో, పొరుగు దేశాలకు వెళ్లాల్సివచ్చిందని స్వయంగా అంబేద్కర్ ఆ రోజు జరిగిన బౌద్ధదీక్ష సభలో తెలిపారు.

జీవుల వేదనను తొలగించేందుకు హేతుబద్ధమైన మార్గమే బౌద్ధం అని…, మరి అటువంటప్పుడు డాస్ కేపిటల్ అవసరం ఎందుకు అంటూ  అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఎవరు మార్చిపోరాదు.  

కొంతమంది సంకుచిత కులతత్వవాదుల తప్పుడు ప్రమాణికాలతో ప్రఖర జాతీయవాదైన అంబేద్కర్ ను ఒక్క కులానికి నేతగా మార్చేశారు. 20వ శతాబ్దంలో జీవించిన మహానీయుల్లో భారత రత్న అంబేద్కర్ ప్రముఖడు. ఈ మట్టిలో జన్మించిన మాణిక్యం, బడుగు, బలహీన వర్గాలకేకాదు, అన్ని వర్గాల ప్రజలకు ఆశాజ్యోతి. ఆదర్శమూర్తి,! ఇంకా చెప్పాలంటే ఆయనోక స్ఫూర్తి కేంద్రం.! అలాంటి భీమ్ రావు రాంజీ అంబేద్కర్  ఫాలోవర్స్ మంటూ ప్రవీణ్ కుమార్…, స్వేరోస్ … అంబేద్కర్ పేరులోని రాముడినే లేకుండా చేయాలని చూస్తున్నారంటే…! దేరిజ్ యే సమితింగ్ ఫీషియేస్ గా అనిపించడం లేదు. ! కలిసికట్టుగా జీవించే సమాజంలో… ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూసే ఇలాంటి వారిపట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

two + 12 =