ఆర్ఎస్ఎస్ కు మద్దతు తెలిపిన డాక్టర్ పై ఫత్వా.. యోగి సర్కార్ ఊరికే ఉంటుందా..?

0
849

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు మద్దతిచ్చినందుకు డాక్టర్ మహ్మద్ నిజాం భారతిపై ‘ఫత్వా’ జారీ చేసినందుకు హఫీజ్ ఇమ్రాన్ వార్సీని ఉత్తరప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఏప్రిల్ 2న గుడి పడ్వా సందర్భంగా ర్యాలీ (పద్సంచలన్ యాత్ర)లో పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులపై మహ్మద్ నిజాం భారతి పూల వర్షం కురిపించారు. మొరాదాబాద్‌లోని మైనాథర్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించగా, ఈ కార్యక్రమంలో డాక్టర్ మహ్మద్ నిజాం భారతి, అతని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ భారతి ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులపై పూల వర్షం కురిపించినందుకు స్థానిక ముస్లిం ప్రజలు చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో అతనిపై ఫత్వా జారీ చేయబడింది.

హఫీజ్ ఇమ్రాన్ వార్సీ జారీ చేసిన ఫత్వాలో డాక్టర్ మొహమ్మద్ నిజాం భారతిని మసీదుల్లోకి రానివ్వకూడదని, మొత్తం ముస్లిం సమాజం అతన్ని బహిష్కరించాలని ఉంది. డాక్టర్ మహ్మద్ నిజాం భారతిని ఎవరైనా చంపితే వారికి లక్ష రూపాయల రివార్డు ఇస్తామని కూడా ఫత్వా స్పష్టంగా పేర్కొంది.

“నేను ముస్లింనే కానీ నేను జాతీయవాదిని”: ఆర్‌ఎస్‌ఎస్‌కు తన మద్దతుపై డాక్టర్ నిజాం

తాను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అనుచరుడినని, తాను జాతీయవాదినని డాక్టర్ మహ్మద్ నిజాం భారతి అన్నారు. “నేను బీజేపీ ఫాలోవర్ను , ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీ నా ఇంటి ముందు నుండి వెళుతోంది. అందుకే నేనూ, నా కుటుంబం గౌరవ సూచకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులపై పూలవర్షం కురిపించాం. నేను ముస్లింనే కానీ నేను కూడా జాతీయవాదినే” అని ఆయన అన్నారు. “హఫీజ్ ఇమ్రాన్ తాలిబానీ ఆలోచనా విధానాన్ని కలిగి ఉన్నాడు. అతను మమ్మల్ని వెలివేయాలని ముస్లిం సమాజాన్ని బెదిరిస్తున్నాడు. ఆర్‌ఎస్‌ఎస్‌కు మద్దతిచ్చినందుకు నన్ను ఎలాగైనా చంపేయాలని కోరుకుంటున్నాడు” అని ఆయన అన్నారు.

మొరాదాబాద్‌కు చెందిన ఓ ముస్లిం వైద్యుడికి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్నాయంటూ బెదిరింపులకు పాల్పడినట్లు మొరాదాబాద్ పోలీసులు ధృవీకరించారు. డాక్టర్ మహ్మద్ నిజాం భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి హఫీజ్ ఇమ్రాన్ వార్సీని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి.