ఆస్కార్ అవార్డు అందుకొని చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం హైదరాబాద్ కు తిరిగొచ్చింది. ఈ ఉదయం తెల్లవారుజామున దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, రమా రాజమౌళి, కార్తికేయ, కాలభైరవ తదితరులు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. వీరికి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టులో ఉన్న పలువురు రాజమౌళి, కీరవాణితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. కట్టు దిట్టమైన భద్రత నడుమ కీరవాణి, రాజమౌళి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. రాజమౌళి ‘జైహింద్’ అంటూ వెళ్లిపోయారు.
RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం సంతోషంగా ఉందని కీరవాణి తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వరించింది. తెలుగు సినిమాకు ఆస్కార్ రావడంపై పెద్ద ఎత్తున అభినందనలు వచ్చాయి. భారత ప్రధాని నుండి ప్రతి ఒక్కరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.