15 ఏళ్లగా హిందువునంటూ మోసం.. అసలు విషయం తెలిసి అరెస్ట్ చేసిన పోలీసులు

0
844

హిందువుగా నటిస్తూ.. 15 సంవత్సరాలుగా భారత్‌లో నివసిస్తున్న 27 ఏళ్ల బంగ్లాదేశ్ ముస్లిం మహిళను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నగర శివార్లలో నివసిస్తున్న ఆ మహిళను రోనీ బేగంగా గుర్తించారు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ఇచ్చిన సమాచారం మేరకు మహిళను అరెస్టు చేశారు. ఆమె బంగ్లాదేశ్‌లోని నరైల్ జిల్లాకు చెందినది తేలింది. జనవరి 25న బెంగుళూరులోని టి దాసరహళ్లిలోని అద్దె ఇంటి నుండి ఆమెను అరెస్టు చేసినట్లు బైదరహల్లి పోలీసులు తెలిపారు.

రోనీ బేగం భారత్ లో తన పేరును పాయల్ ఘోష్ అని చెప్పుకుంటూ ఉంది. హిందూ మహిళగా నటిస్తూ 15 సంవత్సరాలుగా ఇక్కడే జీవించింది. ఆమెకు మంగళూరుకు చెందిన నితిన్ కుమార్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో వివాహం జరిగింది. రోనీ బేగంను అరెస్టు చేసిన తర్వాత, ఆమె భర్త పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు.

రోనీ బేగం 12 ఏళ్ల వయసులో బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడి ఇక్కడే ఉండిపోయింది. ఆమె ముంబైలో బార్ డ్యాన్సర్‌గా కూడా పనిచేసింది. బార్-డ్యాన్సర్‌గా పని చేస్తున్న సమయంలోనే తాను బెంగాలీ మహిళనని, ఆమె పేరు పాయల్ ఘోష్ అని తెలిపింది. రోనీ బేగం నితీష్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట పెళ్లి తర్వాత 2019లో బెంగళూరులోని అంజననగర్‌లో స్థిరపడ్డారు. సదరు మహిళ టైలర్‌గా పనిచేసేది. ముంబైలో ఉన్న సమయంలోనే ఈ జంట పాన్ కార్డును పొందగలిగారు. బెంగళూరులోని స్నేహితుడి సహాయంతో నితిన్ ఆధార్ కార్డును కూడా సంపాదించాడు.

ఇటీవల బంగ్లాదేశ్ లో ఆ మహిళ తండ్రి చనిపోవడంతో ఆమె అసలు ఎవరో అనే విషయం బయటకు రావడం మొదలైంది. తన తండ్రి అంత్యక్రియల కోసం బేగం బంగ్లాదేశ్ వెళ్లాల్సి వచ్చింది. ఆమె బెంగాల్‌కు వెళ్లి అక్కడి నుంచి ఢాకా వెళ్లాలని అనుకుంది. ఆమె ప్రయాణ సమయంలో, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనుమానం వచ్చి ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2020లో జరిగిన ఈ ఘటనలో, వారు విచారణ ప్రారంభించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు కానీ ఆమెను అరెస్టు చేయలేదు. తదుపరి విచారణలో ఆమె అక్రమ బంగ్లాదేశ్ వలసదారు అని తేలింది. విచారణ కొనసాగుతుండగా, రోనీ బేగం అప్పటికే బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయింది. FRRO ఆమె అక్రమ వలసదారు అని బెంగళూరు పోలీసు కమిషనర్‌కు సమాచారం అందించింది. ఆమెపై బైదరహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యాభర్తలు పనిచేసిన, నివసించే ప్రదేశాలలో విచారణ చేసిన తర్వాత ఆమెను ట్రాక్ చేయడానికి పోలీసులకు 3 నెలల సమయం పట్టింది. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు పొందేందుకు ఆమెకు సహకరించిన వ్యక్తుల కోసం విచారణ జరుపుతున్నట్లు డీసీపీ సంజీవ్ పాటిల్ తెలిపారు.