National

అమితాబ్ పేరు మీద ఉన్న రోల్స్ రాయిస్.. బెంగళూరులో పట్టుబడడంతో..!

కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లను కొంటున్న కోటీశ్వరులు పన్నులను ఎగ్గొట్టడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఇటీవలి కాలంలో బెంగళూరు పోలీసులు ఈ లగ్జరీ కార్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా కొన్ని లగ్జరీ కార్లను బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ‘రోల్స్ రాయిస్’ కారు కూడా ఉంది. రోల్స్ రాయిస్ కారు దేశంలో అతి తక్కువ మంది దగ్గర మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే..! ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే బెంగళూరులో పట్టుబడ్డ రోల్స్ రాయిస్ కారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేరు మీద ఉంది..! అమితాబ్ ముంబైలో ఉండగా.. బెంగళూరులో పట్టుబడ్డ కారు ఆయనకు చెందినది ఎలా అవుతుందని పలువురు ఆశ్చర్యపోతున్నారు.

అమితాబ్ బచ్చన్ పేరిట ఉన్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును బెంగళూరులో కర్ణాటక రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రవాణా శాఖ అధికారుల దాడుల్లో మొత్తం ఏడు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకోగా, వాటిలో ఒకటి అమితాబ్ పేరిట ఉంది. తెలుపు రంగు రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును అమితాబ్ కు 2007లో ఏకలవ్య చిత్రం సందర్భంగా దర్శకుడు విధు వినోద్ చోప్రా బహూకరించారు. అమితాబ్ బచ్చన్ ఈ కారును ఉమ్రా డెవలపర్స్ సంస్థ యజమాని యూసుఫ్ షరీఫ్ అలియాస్ డి బాబు అనే వ్యక్తికి విక్రయించారు. అయితే ఆ కారు రిజిస్ట్రేషన్ ఇప్పటికీ అమితాబ్ పేరిటే ఉంది. కోట్ల విలువైన కారును మళ్లీ వేరే వ్యక్తుల పేర్ల మీద మార్చుకోవడం అంటే కాస్త ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఇలా అమితాబ్ పేరు మీద నుండి కారును బదిలీ చేయించుకోలేదని స్పష్టమవుతోంది. కారుకి సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ కూడా తయారుచేసుకోలేదని.. ఇన్సూరెన్స్ వంటివి కూడా లేకుండా ఈ కారు రోడ్డు మీద తిరుగుతూ ఉందని కన్నడ మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశారు. పన్నులు కట్టని, సరైన పత్రాలు లేని కారణంగానే తాము పలు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నామని కర్ణాటక రవాణా శాఖ వెల్లడించింది. ఈ ఏడు కార్లలో ఐదు పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ కాగా, రెండు మహారాష్ట్రలో రిజిస్టర్ అయినట్టు గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 3 =

Back to top button