అయ్యప్ప పడిపూజకు వెళ్లొస్తుండగా సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం

0
702

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని నరసయ్య హోటల్ వద్ద అయ్యప్ప స్వాముల ట్రాక్టర్‎ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‎లో అయ్యప్ప స్వామిగుడిలో పూజ చేసుకుని తిరిగి రాంగ్ రూట్‎లో మునగాలకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ట్రాక్టర్‎ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఢీకొట్టిన అనంతరం లారీ 50 మీటర్ల దూరం ట్రాక్టర్‎ను లాక్కెళ్లింది. ప్రమాద సమయంలో మొత్తం ట్రాక్టర్‎లో 30 మంది స్వాములు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మారగోని కోటయ్య(60), చింతకాయల ఉదయ్ లోకేష్ (11), చింతకాయల ప్రమీల(32), తన్నీరు ప్రమీల(30), గండు జ్యోతి(36)గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఖమ్మం, సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.