పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పదవీబాధ్యతలు చేపట్టారు. గత కొన్ని నెలలుగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో సిద్ధూ విభేదాలు తారాస్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే..! తాజాగా పంజాబ్ రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా సిద్ధూ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కలిసి కెప్టెన్ అమరీందర్ సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ హరీష్ రావత్ కూడా హాజరయ్యారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా సిద్ధూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌కు రాసిన లేఖలో కోరారని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ సంక్షోభం ముగిసిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
నవ్ జోత్ సింగ్ సిద్ధూ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తల మినీ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మోగా జిల్లాలోని లొహారా వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్యకర్తలు మరణించారు. పది మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించామని ఎస్ఎస్పీ హర్మన్ బీర్ సింగ్ గిల్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని అంటున్నారు. వారంతా ఎమ్మెల్యే కుల్బీర్ సింగ్ జీరా అనుచరులని తెలుస్తోంది. మోగాకు 15 కిలోమీటర్ల దూరంలోని జీరా నుంచి వారు బయల్దేరారని చెబుతున్నారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని మోగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.