అప్రమత్తంగా ఉన్నాం.. సైనిక చర్చలు కొనసాగుతూనే ఉంటాయి: ఆర్‌కేఎస్ భ‌దౌరియా

0
676

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇరు దేశాలు పెద్ద ఎత్తున బలగాలను మోహరించాయి. చైనా తోక జాడిస్తే బదులివ్వడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇక ల‌డాఖ్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ప‌రిస్థితిపై ఇవాళ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఆర్‌కేఎస్ భ‌దౌరియా మాట్లాడారు. భార‌త‌, చైనా ద‌ళాల మ‌ధ్య మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. క‌మాండ‌ర్ స్థాయిలో చ‌ర్చ‌లు ఉంటాయ‌ని.. వాటి ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకుంటామ‌న్నారు. తూర్పు లడఖ్ పరిస్థితికి సంబంధించి చైనాతో మరో కమాండర్ స్థాయి చర్చలకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని భదౌరియా శనివారం ధ్రువీకరించారు. మోహరింపుల పరంగా ఏవైనా మార్పులు జరిగితే భారత దళాలు క్రమం తప్పకుండా గ్రౌండ్ రియాలిటీని పర్యవేక్షిస్తున్నాయని ఆయన అన్నారు. తూర్పు లడఖ్‌లో భారత్‌, చైనా మధ్య సరిహద్దు పరిస్థితుల గురించి కమాండర్‌ స్థాయి చర్చలకు ప్రతిపాదన ఉందని.. కీలక నిర్ణయాలు తీసుకోబడతాయని అన్నారు. చైనా సైనికాధికారుల‌తో చర్చ కొన‌సాగిస్తూనే ఉంటామ‌ని, ఘ‌ర్ష‌ణాత్మ‌క ప్రాంతాల నుంచి ద‌ళాలు ఉప‌సంహ‌రించే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని అన్నారు. ఉద్రిక్త‌త‌లు త‌గ్గించే ఏర్పాట్లు చేస్తామ‌ని భ‌దౌరియా వెల్ల‌డించారు. మా వైపు నుంచి తీసుకోవాల్సిన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌న్నారు. గ‌త ఏడాది కాలంలో భార‌త శ‌క్తి సామ‌ర్ధ్యాలు పెరిగిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

హైద‌రాబాద్‌లోని దుండిగ‌ల్ ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీలో కంబైన్డ్ గ్రాడ్యుయేష‌న్‌ పాసింగ్ ఔట్ పెరేడ్‌లో ఆయ‌న‌ ముఖ్య అతిథిగా పాల్గొని భ‌దౌరియా మాట్లాడారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లుగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. దేశం కోసం అవ‌స‌ర‌మైతే త్యాగం చేయడమే ఫ్లయింగ్‌ అధికారుల ధ్యేయమని అన్నారు. దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తోందని.. సరిహద్దుల్లో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామన్నారు. కరోనా రెండో ద‌శ వేళ‌ ఆక్సిజన్‌ సరఫరాలో వైమానికదళం కీలకపాత్ర పోషించిందని అన్నారు.

ఫ్లయింగ్‌ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీలో 20,500 గంట‌ల‌ ఫ్ల‌యింగ్ శిక్ష‌ణ‌ను ఈ బ్యాచ్ పూర్తి చేసింద‌న్నారు. వైమానిక ద‌ళంలో 161 మంది, నేవీలో ఆరుగురు, కోస్ట్ గార్డుగా ఐదుగురు క్యాడెట్లు శిక్ష‌ణ పూర్తి చేసుకున్నార‌ని వివ‌రించారు. బీటెక్ పూర్తి చేసిన 87 మంది ఫ్లయింగ్ అధికారులుగా ఉండ‌టం మంచి ప‌రిణామమ‌ని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భద్రతా సవాళ్ళను, భౌగోళిక అనిశ్చితిని ఎదుర్కోడానికి ఐఏఎఫ్ వేగంగా సాంకేతిక పరిజ్ఞానంతో పరివర్తన చెందుతోందని భదౌరియా చెప్పారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here