భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని రేసులో ఉండటం ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా చైనా అగడాలను ఎండగట్టే వాళ్లు కరువయ్యారు. అగ్రరాజ్యంగా ఎదగాలనే ఆశతో చైనా ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించడం.. చుట్టు పక్కన దేశాల భూబాగాలను ఆక్రమించడం వంటి చేష్టలకు పూనుకుంటోంది.
అలాంటి డ్రాగన్ దేశానికి బ్రిటన్ ప్రధాని అభ్యర్ధి రిషి సునాక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బ్రిటన్ ప్రధాని అభ్యర్థి, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైతే చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ భద్రతకు చైనా నెంబర్ వన్ ప్రమాదకారి అని అభివర్ణించారు. చైనా, రష్యా పట్ల రిషి సునాక్ బలహీనుడిగా ప్రత్యర్థి లిజ్ ట్రస్ ఆరోపణలు చేసిన క్రమంలో ఈ మేరకు మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ మాట్లాడారు. మరోవైపు.. యూకే-చైనా సంబంధాల అభివృద్ధికి రిషి సునాక్ సరైన వ్యక్తి అని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఇటీవల చెప్పడం గమనార్హం.
తాను ప్రధాని పదవి చేపడితే చైనాతో వ్యవహరించే తీరుపై సునాక్ వివరించారు. బ్రిటన్‌లోని 30 ఇన్‌స్టిట్యూట్లను మూసివేస్తామని, దాని ద్వారా సంస్కృతి, భాషా కార్యక్రమాల ద్వారా చైనా వ్యాప్తి చేస్తున్న సాఫ్ట్ పవర్ ప్రభావాన్ని అడ్డుకుంటామన్నారు. తమ యూనివర్సిటీల నుంచి చైనా కమ్యూనిస్ట్ పార్టీని తరిమికొడతామని స్పష్టం చేశారు. చైనా గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు బ్రిటన్ డొమెస్టిక్ స్పై ఏజెన్సీ ఎంఐ5ని ఉపయోగిస్తామన్నారు. చైనా సైబర్ దాడులను అరికట్టేందుకు నాటో తరహా అంతర్జాతీయ సహకారాన్ని నిర్మిస్తామన్నారు. చైనా స్వదేశంలో మన సాంకేతికతను దొంగిలించి, తమ విశ్వవిద్యాలయాలలోకి చొచ్చుకుపోతోందని ఆరోపించారు. రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా విదేశాలలో వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతుగా నిలుస్తోందని… తైవాన్‌తో సహా పొరుగువారిని బెదిరించే ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు.
అప్పులు ఆశ చూపి అభివృద్ధి చెందుతున్న దేశాలను తన అధీనంలోకి తెచ్చుకుంటున్న చైనా బెల్ట్ అండ్ రోడ్ పథకంపై తీవ్ర విమర్శలు చేశారు రిషి సునాక్. అలాగే.. జింజియాంగ్, హాంకాంగ్‌లలో తన సొంత ప్రజలను వేధించటం, అరెస్టులు చేస్తూ మానవ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. వారి కరెన్సీని తగ్గిస్తూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని తీవ్రంగా ఖండించారు రిషి. జరిగింది చాలు అంటూ రిషి సునాక్ వార్నింగ్ ఇచ్చారు. చాలా కాలంగా బ్రిటన్‌తో పాటు పశ్చిమ ప్రాంతంలోని రాజకీయ నాయకులు చైనాకు ఎర్ర తివాచీ పరిచిందని మండిపడ్డారు. చైనా కుటిల బద్ధిపై గుడ్డిగా వ్యవహరించారని… దానిని ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే మారుస్తానని రిషి సునాక్ స్పష్టం చేశారు.
మరోవైపు భారత సంతతి మాజీ మంత్రి రిషి సునాక్ ఇంగ్లండ్‌లోని గ్రాంథమ్ టౌన్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రిషితో పాటూ ఆయన భార్య అక్షతా మూర్తి, పిల్లలు కృష్ణ, అనౌష్క కూడా పాల్గొన్నారు. భర్త ప్రచార కార్యక్రమంలో అక్షతా మూర్తి పాల్గొనడం ఇదే తొలిసారి. కాగా.. బ్రిటన్ మాజీ ప్రధాని, ఉక్కుమహిళ మార్గరేట్ థాచర్ జన్మస్థలమైన గ్రాంథమ్‌లో రిషి.. తన మద్దతుదారులను ఉద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించారు. ఆ ర్యాలీకి సంబంధించిన చిత్రాలను ఆయన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కుటుంబమే తన సర్వస్వమని… శనివారం జరిగిన ర్యాలీలో నాతో పాటూ వారు పాల్గొని తనకు మద్దతుగా నిలిచారని ఇన్‌స్టా వేదికగా వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి. ఇన్ఫోసిస్‌లో అక్షతామూర్తికి వాటాలున్నాయి. అయితే.. బ్రిటన్‌లో ఆమెకు స్థానికత హోదా లేదన్న కారణంతో గతంలో పన్నులు చెల్లించలేదు. రిషి సునాక్ ప్రత్యర్థులు దీన్నో అవకాశంగా తీసుకుని ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు. బ్రిటన్ రాణి కన్నా అక్షతా మూర్తి ధనవంతురాలంటూ బ్రిటన్ మీడియా పలు సందర్భాల్లో కామెంట్ చేసింది.