More

  1985లో భారత విమానంపై ఉగ్రదాడి..! 37 ఏళ్ల తర్వాత మాలిక్ దారుణహత్య

  1985లో ఎయిరిండియా విమానంపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో విమానంలోని 329మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ కేసులో సిక్కు నేత రిపుదమన్ సింగ్ మాలిక్ పై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న రిపుదమన్ సింగ్ మాలిక్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.

  కానీ పోలీసులు వెంటనే ఘ‌ట‌న గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ విడుదల చేయలేదు. అయితే, చనిపోయిన వ్యక్తి గుర్తింపును.. మాలిక్ కుమారుడు జస్ప్రీత్ మాలిక్ తన తండ్రిని చంపినట్లు సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో నివేదించిన తర్వాత దానిని ధృవీకరించారు. ఎయిరిండియా బాంబు దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా మీడియా ఎల్లప్పుడూ తన తండ్రిని చూస్తుందని కొడుకు ఫేస్‌బుక్‌లో రాశాడు. మీడియా, RCMP కోర్టు నిర్ణయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదని చెప్పాడు. అయితే తన తండ్రి హత్యకు, ఎయిరిండియా అనాటి విషాదానికి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. గురువారం ఉదయం తాను కాల్పుల సౌండ్ విన్నానని, తన కారులో అపస్మారక స్థితిలో ఉన్న మాలిక్‌ని గుర్తించడానికి బయటికి పరిగెత్తానని సర్రేలో కార్ వాష్‌లో పనిచేసే ఒక సాక్షి చెప్పాడు. కాగా, ఈ ఘ‌ట‌న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో చోటుచేసుకోగా.. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆయనను కాల్చి చంపినట్టు అక్క‌డి మీడియా చెబుతోంది.

  ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో రిపుదమన్ సింగ్ మాలిక్ మెడలోకి బుల్లెట్లు దూసుకుపోయినట్లు స‌మాచారం. మొత్తం మూడుసార్లు కాల్పులు జరిపినట్టు స్థానికులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డిన రిపుదమన్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఆయనను టార్గెట్ చేసి చంపినట్టు తెలుస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మాలిక్ హత్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడు ఓ వివాదాస్పద వ్యక్తి అని, అతనికి పలువురితో వ్యక్తిగత కక్షలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే మాలిక్ కెనడాలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. వాంకోవర్ కేంద్రంగా పని చేసే ఖల్సా క్రెడిట్ యూనియన్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ యూనియన్ లో 16వేల మంది సభ్యులు ఉన్నారు. దీంతో పాటు సర్రే, వాంకోవర్ ప్రాంతంలో పలు స్కూళ్లను నిర్వహిస్తున్నారు.

  కాగా, 23 జూన్ 1985లో ఎయిర్ ఇండియా విమానం 329 మంది ప్రయాణికులతో కెనడాలోని టొరంటో నుంచి ముంబైకి బయలుదేరింది. అయితే, ఆ విమానంలో ఓ సూట్ కేస్ బాంబును పెట్టడంతో 32వేల అడుగుల ఎత్తులో అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం పేలి గాల్లోనే ముక్కలైంది. అందులో ప్రయాణిస్తువారు అందరూ మరణించారు. మృతుల్లో 268 మంది కెనడా వాసులు ఉండగా.. 24మంది భారతీయులు ఉన్నారు. ఈ కేసులో అప్పుడు రిపుదమన్ సింగ్ మాలిక్, ఇందర్‌జీత్ సింగ్ రేయాత్, అజైబ్ సింగ్ బగ్రిలు ప్రధాన నిందితులుగా ఉన్నారు. అయితే సరైన సాక్ష్యాలు లేనందున 2005లో మాలిక్ నిర్దోషిగా విడుదలయ్యాడు. మరోవైపు 1984లో స్వర్ణదేవాలయంలో ఉగ్రవాదులున్నారన్న ఆరోపణలతో భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపింది. ఈ ఘటనకు ప్రతీకారంగానే ఖలీస్థానీ అతివాదులు ఎయిరిండియా విమానాన్ని పేల్చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

  Trending Stories

  Related Stories