ప్రపంచ యుద్ధాల మధ్య భూగోళం..!
పుడమి పులకించింది రుధిరంలోనే..!!

0
1121

ప్రపంచ చరిత్రలో 20వ శతాబ్ద ప్రథమార్థం అనేక ప్రత్యేకతలకు నెలవు. నాలుగేళ్లు సాగిన మొదటి ప్రపంచ యుద్ధం, నానాజాతి సమితి ఆవిర్భావం – వైఫల్యం, రష్యాలో నిరంకుశత్వం, తీవ్ర ఆర్థిక మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం…దాని వెంటే ప్రచ్ఛన్న యుద్ధం…అమెరికా, రష్యాల పరస్పరలో పోటీలో నెగ్గిన శ్వేతసౌధం…ఇలా నెత్తురు పారిన కాలంలోనే సంపద పోగుపడింది.

పారిశ్రామికీకరణ జరుగుతున్న యూరప్ దేశాలు పోటీపడి మరీ ఫ్యాక్టరీల ద్వారా దట్టమైన పొగలను వదిలేవి. ఆకాశంలో ఎంత ఎక్కువ కారుమబ్బులతో పొగ కమ్ముకుంటే అంత సంపన్న రాష్ట్రం, దేశంగా పరిగణింపబడేవి. మొదటి ప్రపంచ యుద్ధంతో ఇరవయ్యో శతాబ్దం మొదలైంది. గ్రేట్ డిప్రెషన్ నుంచి ఇంకా తేరుకోనేలేదు.

ప్రపంచ దేశాలకు కంటికి కునుకు లేకుండా చేసి అరిపాదాల మీద నుంచునేటట్లు చేశారు రెండో ప్రపంచ యుద్ధానికి నాంది పలికిన అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినీ, కొనో ఫూమిమారోల త్రయం. అంతవరకు భూమి ఉపరితల ఉష్ణోగ్రత, వాతావరణం, కాలుష్యం లాంటి పదాలు సైన్స్ పుస్తకాలకి, నిఘంటువులకి మాత్రమే పరిమితమయ్యాయి. వాటి గురించి ఆలోచించే తీరిక నాటి ప్రపంచానికి లేదు.

మొదటి ప్రపంచ యుద్ధమనే సుడిగుండం యూరప్‌లోని చిన్న రాజ్యాలతో పాటు, ప్రపంచ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. 1929 – 30ల మధ్య కొరడా సాచిన ‘గ్రేట్ డిప్రెషన్’ ప్రపంచాన్ని కుదిపేసింది. శాంతి కోసం  ఏర్పడిన నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధాన్ని నిలువరించలేక పోయింది.

 ఐదేళ్లపాటు సాగిన రెండో ప్రపంచ సంగ్రామంలో ప్రపంచం భీతిల్లింది. యుద్ధం లక్షలాది మందిని బలగొంది.  ఆంచనా కట్టలేని ఆర్థిక నష్టం ప్రపంచం ముంగిట నిలుచుంది. కేవలం బ్రిటన్ ఒక్కటే రెండువేల కోట్లు ఖర్చు పెట్టింది. రష్యా తన సంపదలో నాలుగోవంతు నష్టపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్య సమితి-నానాజాతి సమితిలాగే వైఫల్యం వైపు పయనిస్తోంది.

ఆస్ట్రియా–హంగేరీ అధీనంలో ఉన్న సెర్బుల భూభాగాలు బోస్నియా, హెర్జిగోవినా. బోస్నియా రాజధాని సరాయేవోలో 1914, జూన్‌ 28న ఆస్ట్రియా–హంగేరీ యువరాజు ఫెర్డినాండ్, యువరాణి సోఫీ చోటెక్‌ల జంట హత్యలు జరిగాయి.  సెర్బ్ జాతీయవాది గవ్రిలో ప్రిన్సిప్‌ రాజదంపతులను కాల్చి చంపాడు. 

చూడబోతే ఇది రెండు దేశాల ద్వైపాక్షిక సమస్యలా కనిపిస్తుంది. ఈ ఘటనకే ప్రపంచ దేశాలు యుద్ధానికి కాలు దువ్వాలా? అంత నష్టాన్ని చవిచూడాలా? నిజానికి ఈ జంట హత్యలే మొదటి ప్రపంచ యుద్ధానికి  తక్షణ కారణం. 1890ల నాటికే మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. 

1907 కల్లా యూరప్ ఖండం రెండు సైనిక శిబిరాలుగా విడిపోయింది. ‘త్రిరాజ్య కూటమి’-Triple Alliance- ‘త్రిరాజ్య మిత్ర కూటమి-Triple Entente. త్రిరాజ్య కూటమిలో జర్మనీ, ఆస్ట్రియా – హంగేరి, ఇటలీ దేశాలు; త్రిరాజ్య మిత్ర కూటమిలో ఫ్రాన్స్, రష్యా, ఇంగ్లండ్ ఉన్నాయి. నాలుగేళ్ల మొదటి ప్రపంచ యుద్ధంలో కోటిమంది మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలో 2.2 – 2.5 కోట్ల సైనికులు, 4 – 5.2 కోట్ల పౌరులు చనిపోయారు. రెండు యుద్ధాల్లో కోట్లాది ధనం వెచ్చించారు.

ఈ దేశాలు ప్రపంచ ఆధిపత్యం కోసం, తద్వారా వలస ప్రాంతాలు, మార్కెట్లపై ఆధిపత్యం కోసం పోటీపడ్డాయి.

మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలైంది. 1918లో జర్మనీ, దాని మిత్రదేశాల ఓటమితో; బ్రిటన్, ఫ్రాన్స్ ల గెలుపుతో ఈ యుద్ధం ముగిసింది. శాంతి కోసం జర్మనీపై విధించిన షరతులే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. రెండో ప్రపంచ యుద్ధంలో ఒకవైపున జర్మనీ, జపాన్, ఇటలీ ఉండగా మరోకవైపు బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా, అమెరికాలున్నాయి. జర్మనీ, దాని మిత్రదేశాల ఓటమితో యుద్ధం ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో కోటిమంది మరణించారు. బ్రిటన్ తరఫున పోరాడి చనిపోయిన వారిలో 75,000 మంది భారతీయ సైనికులు ఉన్నారు.

రెండు ప్రపంచ యుద్ధాల మధ్య 21 సంవత్సరాల వ్యవధి ఉంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు, దౌత్యపరమైన కూటములు, ఆయుధ సామగ్రి లాంటి వాటిలో ఎన్నో తేడాలున్నాయి. ప్రతి యుద్ధానికి తక్షణ కారణాలతో పాటు దీర్ఘకాలంగా ముసురుకున్న వైరుధ్యాలు కూడా కొన్ని ఉంటాయి. బ్రిట‌న్‌, ఫ్రాన్స్,ర‌ష్యా కూట‌మిలో సెర్బియా ఉండ‌టం వ‌ల్ల, ఆస్ట్రియా దండెత్తడంతో సెర్బియాకు మ‌ద్దతుగా ఆ దేశాలు వ‌చ్చాయి. ఆస్ట్రియా ప‌క్షాన ఉన్న జ‌ర్మనీ, ఇట‌లీ కూడా యుద్ధంలో చేర‌డంతో మొద‌టి ప్రపంచ యుద్ధం మొద‌లైంది.

మొదటి ప్రపంచ యుద్ధం, తరువాత జరిగిన వెర్సయిల్స్‌ శాంతి సంధి రెండో ప్రపంచ యుద్ధానికి బీజాలు సిద్ధం చేసింది. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆరంభించిన దేశాలే రెండో ప్రపంచ యుద్ధాన్ని కూడా ఆరంభించాయి. జర్మనీ 1939 సెప్టెంబర్‌లో పోలెండ్‌ కారిడార్‌ ఆక్రమించింది. దీంతో బ్రిటన్, ఫ్రాన్స్‌  దీనికి ఆగ్రహించి జర్మనీ మీద యుద్ధం ప్రకటించాయి.

ఇదే రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. కానీ వెనుక వందల కారణాలు ఉన్నాయి. వెర్సయిల్స్‌ సంధితో జర్మనీ తీవ్ర అసంతృప్తికి లోనయింది. ఆల్సెస్, లోరెన్‌ అనే ప్రాంతాలు ఫ్రాన్స్‌ దక్కించుకుని అక్కడి ఖనిజ సంపదను తవ్వుకు పోవడం ఆరంభించింది.  యుద్ధానికి నష్టపరిహారమన్నమాట. అలాగే అక్కడి అడవులు, ఇతర వనరులు కొన్ని దేశాలకు దఖలు పడ్డాయి.

రెండో ప్రపంచ యుద్ధానికి 1939 సెప్టెంబ‌ర్ 1న డాంజింగ్ రేవును జర్మనీకి అప్పగించ‌డానికి పోలండ్ నిరాక‌రించ‌డ‌మే త‌క్షణ కార‌ణం. పోలండ్‌లోకి ప్రవేశించి, శిక్షించ‌డానికి జ‌ర్మనీ యుద్ధట్యాంకులు, హిట్లర్ సేన‌లు దండెత్తాయి. పోలండ్‌కు బ్రిట‌న్‌తో సైనిక ఒప్పందం ఉండ‌టంతో పోలండ్ ప‌క్షాన అది యుద్ధంలో చేరింది. దీంతో రెండో ప్రపంచ యుద్ధం మొద‌లైంది.

బ్రిటన్, జర్మనీ, అమెరికాల్లో పారిశ్రామిక మూలధనం అభివృద్ధి చెందడం వల్ల, తమ ఉత్పత్తులకు ముడిసరకులు, మార్కెట్లు అవసరమయ్యాయి.  పెట్టుబడి మరింతగా పోగుబడటంతో వలస ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం కోసం ఎదురుచూశారు. 19వ శతాబ్దం ముగిసేనాటికి యూరప్ దేశాల మధ్య వలస ప్రాంతాల కోసం పోటీ మొదలైంది.

జపాన్, జర్మనీ, ఇటలీలు కొత్త పారిశ్రామిక శక్తులుగా అవతరించాయి.  ఏర్పడటంతో ఇవి వలస ప్రాంతాలను తిరిగి విభజించాలని కోరుకున్నాయి. బ్రిటన్ ఫ్రాన్స్ లాంటి దేశాలు అందుకు సిద్ధంగా లేవు. ఇదే తీవ్ర ఒత్తిడులకు, తరచూ యుద్ధాలకు కారణమయ్యేది. 1880 నుంచి 1914 నాటికి జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ సైనిక ఖర్చు 300 శాతానికి పైగా అంటే 132 మిలియన్ పౌండ్ల నుంచి 397 మిలియన్ పౌండ్లకు పెరిగింది.

9 లక్షల నుంచి లక్షకు సైనిక బలగాన్ని తగ్గించాలని, జలాంతర్గాములు ఉండకూడదని, పదివేల టన్నుల లోపు ఉండే ఆరు యుద్ధనౌకలకు మించని నావికాదళం ఉండాలని జర్మనీని నిర్దేశించారు. భవిష్యత్తులో యుద్ధాలను నివారించడానికి వర్సెయిల్స్ ఒప్పందం నానాజాతి సమితిని ఏర్పాటు చేసింది. నానాజాతి సమితిలో చేరడానికి రష్యా, జర్మనీలను ఆహ్వానించలేదు.

పసిఫిక్‌ రీజియన్‌లో  ఇండియా, చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఇందులో అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియాలు ప్రధానంగా పసిఫిక్‌ తీర దేశాలు. ఇండియా మాత్రమే హిందూ మహా సముద్ర  తీరదేశం. ఆస్ట్రేలియా పశ్చిమ తీరం మాత్రమే ఈ విభాగంలోకి వస్తుంది.

తన పేరు మీద ఒక మహాసముద్రాన్నే కలిగి వున్న దేశం భారత్ ఒక్కటే. ఈ సువిశాల…సుదీర్ఘ చరిత్రలో, వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించి….దిశానిర్దేశం చేసినందుకు భారత్ కు ఇతిహాసం పెట్టిన కిరీటమది. హిందూ మహాసముద్ర తీరదేశాల్లో భారతీయ బౌద్ధం తలుపు తట్టని దేశం లేదు. మన రామాయణం ప్రవేశించని భాష లేదు.

ప్రస్తుతం రెండు మహాసముద్రాలను కలిపి ఇండో– పసి ఫిక్‌గా పిలుచుకుంటున్న ప్రాంతంలో ఆధిపత్య పోరు ప్రధా నంగా అమెరికా–చైనాల మధ్య నెలకొంటున్నది. ఈ రెండు దేశాల మధ్యన మరో ప్రచ్ఛన్న యుద్ధం ప్రారం భమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంలో మన ముందున్న ప్రత్యామ్నాయాలు రెండు.

ఒకటి: చైనా వెనకాలో, అమెరికా వెనకాలో నంబర్‌ టూగా చేరిపోవడం. రెండు: మన గత వైభవానికి తగ్గట్టుగా హిందూ మహాసముద్ర తీర దేశాలను, ముఖ్యంగా సార్క్, ఏసియాన్‌ కూటముల సభ్య దేశాలను వాటి వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణ ప్రాతిపదిక మీద సమీకరించి నాయకత్వం వహించడం. రానున్న చరిత్రను ఇండో–పసిఫిక్‌ ప్రాంత వాణిజ్యం లిఖించబోతున్న పరిస్థితుల్లో  హిందూ మహాసముద్రంపై భారత్ ఒక గౌరవప్రదమైన పాత్ర పోషించడం తథ్యం.

భారతదేశంలో అత్యధిక జనాభా గల నగరం ఢిల్లీ. దేశ వాణిజ్య నగరంగా పేరొందిన నగరం ముంబై. ప్రపంచ పటంపై ఈ రెండు నగరాలకు కేంద్ర స్థానం నుంచి ఒక సరళరేఖను తూర్పుదిశగా గీస్తే అది మయన్మార్‌ మీదుగా…  చైనాలో షాంఘై, హాంకాంగ్‌ల మధ్య నుంచి తీరం దాటుతుంది. ఢిల్లీకి అభిముఖంగా ఉండే షాంఘై చైనాలో అతిపెద్ద నగరం. రెండు నగరాల జనాభా కూడా మూడుకోట్లకు చేరు కుంటున్నది.

ముంబైకి అభిముఖంగా ఉండే హాంకాంగ్‌ నగరం ప్రత్యేక హోదా అనుభవిస్తున్న వాణిజ్య సామ్రాజ్యం. అంటే జనా భాకు జనాభా, వాణిజ్యానికి వాణిజ్యం ఎదురెదురుగా నిలబ డ్డాయన్నమాట. మనం గీసిన ఈ సరళరేఖ భూగోళంపై వుండే కర్కాటక రేఖ -Tropic cancer కు కొద్ది దూరంలో సమాంతరంగా ఉంటుంది. ఈ రేఖ మీదుగానే సూర్యుడు దక్షిణాయనాన్ని ప్రారంభిస్తాడు.

మన సమాంతరరేఖ మధ్యభాగంలో ఉన్న మయన్మార్‌ నుంచే భారత్‌  –చైనాల ఆధిపత్యయాత్ర మొదలవుతుందేమో చూడాలి. ప్రస్తుతం మయన్మార్ లో నెలకొన్ని సైనిక పాలన విషయంలోనే ఇరు దేశాలమధ్య మరో వైరం మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

వేల ఏళ్ల చరిత్రలో రాజులు, నియంతలూ భూభాగాల కోసం యుద్ధాలు చేశారు. మహాభారతమైనా, రెండు ప్రపంచ యుద్ధాలైనా  దీనికి తార్కాణం. వర్తమానంలో ప్రపంచంలో అనేక  దేశాలు, రాష్ట్రాలు నదీ జలాల వాటా కోసం పోటీపడుతున్నాయి. కొట్టుకు చస్తున్నాయి.  కోర్టులను ఆశ్రయిస్తున్నాయి.

మూడో ప్రపంచ యుద్ధం ఒకవేళ సంభవించిస్తే అది సరిహద్దుల కోసమో… అణుబాంబులు, చమురు నిల్వల  కోసమో కాదు. నీటి కోసం, గాలికోసం, నీడకోసం, తిండి గింజల కోసం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే  మరో సంగ్రామం కోసం పుడమి సిద్ధం కావాల్సిందే!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eight + nineteen =