భారత ఫార్మా రంగాన్ని విదేశీ శక్తులు టార్గెట్ చేశాయా..? అమెరికా ఫార్మా లాబీ కన్ను భారత్ పై పడిందా..? అంటే.. వరుస పరిణామాలు అవుననే చెబుతున్నాయి. కొద్ది నెలల క్రితం గాంబియాలో భారత్ నుంచి ఎగుమతైన దగ్గు మందుతో చిన్న పిల్లలు మరణించారు. తర్వాత మరి కొన్ని రోజుల్లోనే ఇదే తరహా ఘటన ఉజ్బెకిస్తాన్ లో చోటుచేసుకుంది. తాజాగా అమెరికాలో భారత్ నుంచి ఎగుమతైన కంటి చుక్కల వల్ల మరణాలు సంభవిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. నెలల వ్యవధిలోనే బయటకు వస్తున్న ఇటువంటి ఘటనలు భారత ఫార్మా రంగాన్ని కుదిపేస్తున్నాయి. వీటివల్ల దేశీయ ఫార్మాపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఏర్పడుతోంది. అయితే క్రమంగా భారత్ ఫార్మా రంగంపై ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నట్లు..? అమెరికన్ ఫార్మా లాబీ తెరవెనుక కుట్రలు సాగిస్తోందా..? ఇది భారత ఫార్మా రంగంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది..? దీన్ని అడ్డుకోవడానికి భారత్ చేపట్టాల్సిన చర్యలేమిటి..? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తాజాగా అమెరికా ప్రభుత్వం.. భారత ఫార్మా కంపెనీ తయారుచేసిన కంటి చుక్కల మందులను నిషేధించింది. భారత్‌కు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ ప్రైవేటు లిమిటెడ్ తయారు చేసిన ఎజ్రీకేర్ కంటి చుక్కల మందు కారణంగా అమెరికాలో ఒకరు మృతి చెందారని,.. ఐదుగురు కంటి చూపు కోల్పోయారని వార్తలు వెలువడ్డాయి. ఈ మందుల వల్ల కొంతమందికి కంటి చూపు మందగించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో అమెరికా ప్రభుత్వం ఈ మందుపై ఆంక్షలు విధించింది. ఎజ్రీకేర్ కంపెనీ తయారు చేసిన కంటి చుక్కల మందును వాడకపోవడమే మంచిదని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఇందులో ఒకరు ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారని, మరో ఐదుగురికి కంటిచూపు పోయిందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ధృవీకరించింది. ‘న్యూయార్క్, వాషింగ్టన్‌తోపాటు మరో 10 రాష్ట్రాల్లో కంటి చుక్కలు వేసుకున్న తర్వాత బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ఫెక్షన్ కనిపించిందని ఈ సంస్థ తెలిపింది. దీంతో ఎజ్రీకేర్ కంపెనీ కూడా స్పందించింది. వెంటనే ఈ మందులను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.
కొద్ది నెలల క్రితం ఆఫ్రికాలో కూడా ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ ఆఫ్రికా గాంబియాలో దగ్గు సిరప్ కారణంగా దేశంలో 60కి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారు. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారుచేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌ల వల్లే పిల్లల్లో కిడ్నీ వ్యాధులు, చిన్నారుల మృతికి కారణమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో మరణాలకు కారణమైన నాలుగు ఔషధాలపై డబ్ల్యూహెచ్‌వో మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్ జారీచేసింది. వీటిలో పరిమితికి మించి డై ఇథిలిన్ గ్లెకోల్, ఇథిలిన్ గ్లెకోల్ ఉన్నట్టు గుర్తించారు. ఇవి పరిమితి దాటితే విషపూరితంగా మారుతాయని మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్‌లో పేర్కొంది. గాంబియా దుర్ఘటనపై సంబంధిత భారత రెగ్యులేటరీ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఉత్పత్తులు సురక్షితం కాదని, వాటి ఉపయోగం మరణాలకు దారితీసే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ ప్రొడక్టులను గుర్తించి, అమ్మకాల నుంచి తప్పించాలని సూచించింది. దీనిపై భారత డ్రగ్ కంట్రోల్ అధారిటీ స్వతంత్ర విచారణ చేపడతామని WHO కి తెలిపింది.
దీంతో పాటు ఇదే ఏడాది జనవరిలో ఉజ్బెకిస్తాన్ లో కూడా భారత కాఫ్ సిరప్ లతో మరణాలు సంభవించాయి. 18 మంది చిన్నారులు ఈ కాఫ్ సిరప్ వల్లే మరణించారని ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ సిరప్ లను భారత ఫార్మా కంపెనీలే తయారు చేశాయని వెల్లడించిది. దీనిపై WHO విచారణ జరిపింది. ఇందులో కూడా డై ఇథిలిన్ గ్లెకోల్, ఇథిలిన్ గ్లెకోల్ లు ప్రమాద స్థాయిలో ఉన్నాయని వెల్లడించిది. నోయిడా లో ఉన్న మారియాన్ బయోటెక్ తయారు చేసిన ఈ మందుల వల్లే ఉజ్బెకిస్తాన్ లో పిల్లల మరణానికి కారణమయ్యాయని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.
అయితే వీటిలో నిజమెంత..? నిజంగానే భారత డ్రగ్స్ తయారీలో లోపాలున్నాయా..? అన్న విషయానికి వద్దాం. ఉజ్బెకిస్తాన్ లో చిన్న పిల్లల మరణాల వెనుక మరో కారణం కూడా ఉండొచ్చని ఆ దేశ ఆరోగ్యశాఖ ఒక నివేదికను వెల్లడించింది. తమ అంతర్గత విచారణలో అనారోగ్యానికి గురైన పిల్లలందరూ దగ్గు సిరప్ ను ఎక్కువ మోతాదులో తీసుకున్నారని తెలిపింది. రోజుకు 3 నుంచి 4 సార్లు వారం రోజులుగా తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజుకు నాలుగుసార్లు తీసుకోవడమంటే 2.5 మిల్లీ లీటర్ల నుంచి ఐదు మిల్లీ లీటర్ల మోతాదు వరకు అవుతుందనీ,.. ఇది చిన్న పిల్లలకు ఇవ్వాల్సిన డోసు కంటే భారీ మోతాదు అని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాటు ఉజ్బెకిస్తాన్ లో ఈ ఘటన జరిగినప్పుడు వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయనీ,.. ఉష్ణోగ్రతలు 1 డిగ్రీనుంచి 3 డిగ్రీలకు పడిపోయాయనీ,.. పిల్లల అనారోగ్యానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చని తెలిపింది. కారణాలు ఏవి ఉన్నా కూడా భారత డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ కూడా దీనిపై విచారణ జరుపుతోంది. వీటిలో ఫార్మాకంపెనీలది ఏదైనా తప్పు ఉందని తేలితే ఆ సంస్థలపై చర్యలు కూడా తప్పవు.
తాజాగా అమెరికాలో కంటి చుక్కల నుంచి పిల్లలు అనారోగ్యానికి గురవగానే అమెరికా ప్రభుత్వం వెనువెంటనే నిషేధం విధించింది. ఈ మందులో నిజంగానే లోపం ఉందా..? లేక ఉజ్బెకిస్తాన్ లో లాగా ఇతర కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందా అన్నది ఏమాత్రమూ ఆలోచించలేదు. ఉన్నపళంగా దీన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై డబ్ల్యూహెచ్ఓ కూడా త్వరిత గతిన విచారణ జరపకుండా జాప్యం చేస్తోంది. ఉజ్బెకిస్తాన్ లో పిల్లల మరణాలు సంభవించగానే,.. ఉన్నపళంగా ఇందులో డై ఇథిలిన్ గ్లెకోల్, ఇథిలిన్ గ్లెకోల్ లు ప్రమాద స్థాయిలో ఉన్నాయని తేల్చేసింది. కానీ, తర్వాత ఉజ్బెకిస్తాన్ చేసిన విచారణలో ఎక్కువ మోతాదులో మందులను ఉపయోగించినందుకు ఈ సమస్య తలెత్తిందని వెల్లడైంది.
ఇక డబ్ల్యుహెచ్ఓ ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. కరోనా మహమ్మారి సమయంలో కూడా డబ్లుహెచ్ఓ భారత్ పై వివక్షాపూరిత వైఖరిని అవలంభించిందనే వార్తలు గుప్పుమన్నాయి. భారత్ లో తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ లకు ప్రంపంచ వ్యాప్తంగా అనుమతులు ఇవ్వడానికి తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. అప్పటికే క్లినికల్ ట్రైల్స్ ను పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్లు డబ్ల్యుహెచ్ఓ దగ్గర మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైజర్, మోడర్నా లాంటి వాటికి వెనువెంటనే అనుమతులు లభించినా.. భారత వ్యాక్సిన్లకు మాత్రం అనుమతులు త్వరగా లభించలేదు. దీని వెనుక WHO పై అగ్రరాజ్యాల ఆధిపత్యం ఉందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. భారత వ్యాక్సిన్లు తక్కువ ధరకే తయారు అయ్యాయి. వీటికి గ్లోబల్ అప్రూవల్ లభిస్తే విదేశీ ఫార్మా కంపెనీలకు భారీ దెబ్బ తగులుతుంది. కోవిడ్ వ్యాక్సిన్ల పేరుతో ప్రపంచాన్ని దోచుకోవాలనుకునే ఫార్మా లాబీల ఆశలకు భారత్ వ్యాక్సిన్లు అడ్డొస్తాయి. దీని వల్లే భారత కంపెనీలకు WHO అనుమతులు ఆలస్యంగా వచ్చాయని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ జాప్యం అగ్రరాజ్యాలకు చెందని ఫార్మా కంపెనీలు భారీగా లాభపడ్డాయని వార్తలు వెలువడ్డాయి.
తాజాగా భారత ఫార్మా రంగాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా ఇటువంటి ఘటనలు ఎక్కువగా బయటపడుతున్నాయని ఆరోగ్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి ఘటనలు బయటపడగానే ఆయా కంపెనీలపై బ్యాన్ విధించబడుతుంది. దీనికి సంబంధించిన విచారణ పూర్తయ్యేలోపు కొన్ని నెలల సమయం పడుతుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. విచారణ జరిపే సమయంలో కంపెనీలకు లాభాల్లేక నష్టాలపాలయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఇటువంటి వరుస ఘటనలు వెలుగులోకి వస్తే,.. విదేశాల్లో భారత మందులపై నమ్మకం కూడా సన్నగిల్లే ప్రమాదముంది. ప్రజల్లో ఒక్కసారి నమ్మకం కోల్పోతే తిరిగి సంపాదించడం దాదాపు అసాధ్యమవుతుంది. ఇందుకోసం కూడా వరుస ఘటనలను ఆయా దేశాలు వెలుగులోకి తీసుకొస్తున్నాయని పలువురు భావిస్తున్నారు.
అయితే ఈ ఘటనల వెనుక అమెరికన్ ఫార్మా కంపెనీల కుట్ర కూడా దాగి ఉందని చాలామంది భావిస్తున్నారు. భారత దేశానికి మోదీ ప్రధాని అయిన తర్వాత పారిశ్రామిక రంగం అభివృద్ది చెందటంతో పాటు ఫార్మా కూడా అభివృద్ది చెందింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్ఐ స్కీంలతో కొత్త కొత్త ఫార్మా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. మోదీ పాలించిన ఎనిమిదిన్నరేళ్ళలో ఫార్మా ఎగుమతులు ఏకంగా 103 శాతం పెరిగినట్లు భారత ప్రభుత్వం తెలిపింది. దీంతో పాటు ఫార్మాకు కీలకమైన ఏపీఐలో 70 నుంచి 80 శాతం చైనా నుంచే భారత్ దిగుమతి చేసుకునేది. ఈ అంతరాన్ని తగ్గించడానికి భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్ ఈ క్రమంలో విజయం సాధిస్తే.. అది అమెరికన్ ఫార్మా లాబీకి భారీ దెబ్బ తగిలినట్లే అవుతుంది. అందుకే ఈ విధంగా భారత ఫార్మాపై అనుమానాలొచ్చేలా చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నిటినీ ఇండియన్ డ్రగ్ కంట్రోల్ అడ్డుకునే విధంగా ఇటువంటి వాటిని పటిష్టంగా ఎదుర్కోవాల్సిన అవసరముంది. లేకపోతే భారత ఫార్మా రంగం భారీగా దెబ్బతినే అవకాశముంది.