మునుగోడు వేదికగా తెలంగాణ రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే..! మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించాలని మూడు పార్టీలు చెమటోడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే మాకెటువంటి అభ్యంతరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తే ఆయనకే మునుగోడు టికెట్ ఇస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ తరఫున రాజగోపాల్ రెడ్డికి బీ ఫామ్ ఇవ్వడంతో పాటుగా సీనియర్ నేతలంతా కలిసి ఆయనను మునుగోడు ఉప ఎన్నికలో గెలిపించుకుంటామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా శనివారం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఆ పార్టీ కండువా కప్పుకున్నప్పుడే పండగ అని.. బీజేపీలో ఎల్కే అద్వానీ, వెంకయ్యనాయుడుల పరిస్థితి అందుకు నిదర్శనమని తెలిపారు. పార్టీ మారి బీజేపీలోకి వెళ్లిన చాలా మంది సీనియర్ నేతలకు సరైన ప్రాధాన్యమే దక్కలేదని ఆయన అన్నారు.