హుజూరాబాద్ ఉప ఎన్నిక అటు టీఆర్ఎస్ కు.. ఇటు కాంగ్రెస్ కు కూడా ఊహించని షాక్ లను ఇచ్చింది. టీఆర్ఎస్ మంచి పోటీ ఇవ్వగా.. కాంగ్రెస్ పార్టీని కనీసం ఓటర్లు పట్టించుకోలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి డిపాజిట్ కు కూడా నోచుకోలేదు. ఈ ఫలితంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. హుజూరాబాద్ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ఈ ఫలితం పట్ల ఎవరూ నిరాశ చెందవద్దని, అధైర్య పడాల్సిన పనిలేదని అన్నారు. వయసు రీత్యా తనకు ఇంకా 20 ఏళ్ల పాటు పార్టీని నడిపించే సత్తా ఉందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఓటమిపై పార్టీ నేతలతో చర్చిస్తానని.. వెంకట్ బల్మూరి ఈ ఓటమితో కుంగిపోవాల్సిన అవసరంలేదని, అతడికి పార్టీలో భవిష్యత్ ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు.
టీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిందని.. ఈ ఒక్క ఫలితంతో కలిగే నష్టం కానీ, పార్టీపై పడే ప్రభావం కానీ ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ బరిలో ఎంతో స్ఫూర్తిదాయక పోరాటం సాగించిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల యుద్ధాల్లో రెట్టించిన ఉత్సాహంతో పోరాడుదామని టీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ లో పార్టీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారంటూ హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, కమలాకర్ లకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తనను మంత్రి పదవి నుంచి కేసీఆర్ అప్రజాస్వామిక పద్ధతిలో తొలగించారనే విషయాన్ని ఈటల రాజేందర్ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని పొన్నం చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతించలేదని అన్నారు. ఈటల గెలుపు బీజేపీ విజయంగా బండి సంజయ్ చెప్పడం సరికాదని.. ఈటల గెలవాలని బండి సంజయ్ కోరుకోలేదని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ సొంతంగా ప్రచారం చేసుకున్నారని బీజేపీ అభ్యర్థినని ఎక్కడా చెప్పుకోలేదని అన్నారు. ఇది ముమ్మాటికీ ఈటల గెలుపు మాత్రమేనని బీజేపీ గెలుపు కాదని అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని చెప్పారు. తెలంగాణలో సంచలన ఫలితాన్ని మనం చూడబోతున్నామని ఫలితాల సమయంలో అన్నారు. ఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డిందని.. ఐదు నెలల్లోనే టీఆర్ఎస్ రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మద్యం ఏరులై పారిందని అన్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతం ప్రకారం ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి, చివరకు టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందనే తాము కాస్త వెనక్కి తగ్గామని చెప్పారు. ఈటలకు పరోక్షంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు.