More

    టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్ పాత్ర.. సిట్ విచారణకు రేవంత్ రెడ్డి..!

    టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిట్ ముందు హాజరయ్యారు. లీకేజీ విషయంలో చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని సిట్ నోటీసులివ్వగా, హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సిట్ ఆఫీసుకు ఆయన వచ్చారు. భయపెట్టడానికి తనకు నోటీసులు ఇచ్చారని, పాదయాత్రలో ఉన్నా సిట్ ముందుకొచ్చానని అన్నారు. తన వద్ద ఉన్న సమాచారం, అభిప్రాయాలను సిట్ చీఫ్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ కు ఇచ్చానని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ ను విచారించకుండా తనకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కేటీఆర్ మాట్లాడిన ప్రెస్ మీట్ అంశాలతో కూడిన రిపోర్టును సైతం సిట్ కు సమర్పించానని రేవంత్ రెడ్డి అన్నారు.

    పేపర్ లీక్ ఘటనకు మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తప్పుచేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీలను విచారించాలని కోరారు. ఆ ఘటనపై సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్ష చేశారని, ఆ తర్వాత మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరే దోషులని చెప్పారన్నారు. కేటీఆర్ అలా ఎలా చెప్తారు.. కేటీఆర్ కు ఆ ఇద్దరే దోషులని ఎలా తెలుసని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీక్ లో కేటీఆర్ పీఏ తిరుపతి ఇన్వాల్మెంట్ ఉందని.. తిరుపతి, రాజశేఖర్ ఇద్దరిదీ ఒకటే మండలమని, వీరి ద్వారానే పేపర్ లీక్ జరిగిందని అన్నారు. పేపర్ లీకేజీ బీజేపీ కుట్ర అని మంత్రి కేటీఆర్ చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి విచారించండని చెప్పానని, గతంలో కేటీఆర్ టీఎస్పీఎస్సీకి వెళ్లి అప్పటి ఛైర్మెన్ ఘంట చక్రపాణిని కలిసిన ఫొటోలు కూడా ఇచ్చానన్నారు. టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు మార్చాలని చెప్పిన విషయం, సిస్టమ్స్ మార్చిన విషయం చెప్పానని, ముందు కేటీఆర్ ను అరెస్ట్ చేసి విచారించాలని సిట్ తో చెప్పానన్నారు రేవంత్ రెడ్డి.

    Trending Stories

    Related Stories