More

    తెలంగాణ ప్ర‌భుత్వమే 2,600 కోట్ల రూపాయ‌లు ప‌న్నులు క‌ట్టాలట: రేవంత్ రెడ్డి

    తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడుగా ఎన్నికైన రేవంత్‌ రెడ్డి తన స్పీడును పెంచారు. జులై 7న బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. జులై 7న ఉదయం 10 గంటలకు పెద్దమ్మ గుడిలో పూజలు చేయ‌నున్న రేవంత్ రెడ్డి అనంత‌రం నాంపల్లిలోని మసీదులోనూ ప్రార్థ‌న‌లు చేసి గాంధీభవన్‌లో బాధ్యతలు చేపడతారట. ప్రస్తుతానికైతే అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగా విమర్శలు మొదలుపెట్టేశారు. దీంతో ఓ వైపు అందరినీ సముదాయించి మరో వైపు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. రేవంత్ రెడ్డి ఈ రోజు హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. రూ.800 కోట్ల‌తో వ‌ర‌ద నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నిల‌బెట్టుకోలేదని అన్నారు. అన్ని ర‌కాల ప‌న్నులు పెంచారని.. ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు వ‌సూలు చేస్తున్నారు తప్పితే జీహెచ్ఎంసీకి ప్ర‌భుత్వం చెల్లించాల్సిన ప‌న్నులు మాత్రం చెల్లించ‌డం లేద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం అభివృద్ధి ప‌నుల‌కు నిధులు ఇవ్వడం లేదని.. ఇక ప్ర‌భుత్వ బంగ్లాల ప‌న్నులు కూడా చెల్లించ‌డంలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టాల్సిన ప్రాప‌ర్టీ ట్యాక్స్ కూడా క‌ట్ట‌ట్లేదని విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీలో అతిపెద్ద ప‌న్ను ఎగ‌వేత‌దారుడు కేసీఆర్, రాష్ట్ర ప్ర‌భుత్వ‌మేనని అన్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు కూడా రూపాయి ప‌న్ను క‌ట్టలేదని.. ఆ భ‌వ‌న్‌కు నీళ్లు, విద్యుత్ ఆపేయాలని అన్నారు. తన దగ్గర ఉన్న స‌మాచారం మేర‌కు ప్ర‌భుత్వం 2,600 కోట్ల రూపాయ‌ల ప‌న్నులు క‌ట్టాలని.. ఆ పన్నులు రాబ‌ట్టితే జీహెచ్ఎంసీ అప్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దని అన్నారు. జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌న్నులు చెల్లించ‌డం లేదు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నాలాలు, చెరువులు క‌బ్జాకు గురి కాకుండా సీసీ కెమెరాలు పెట్టాలని డిమాండ్ చేశారు.

    Related Stories