టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వేద పండితుల ఆశీర్వచనం మధ్య ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఉత్తమ్ కుమార్ రెడ్డి నుండి స్వీకరించారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మణికం ఠాగూర్, ఏఐసిసి ఇంచార్జి కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్ తదితరులు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో రేవంత్ పూజలు చేసి, అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి నాంపల్లిలోని యూసుఫైన్ దర్గా చేరుకున్నారు. అక్కడ చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. ఆయన వెంట భారీగా నేతలు, కార్యకర్తలు వెళ్లారు. కోవిద్ ప్రొటొకాల్స్ ను కనీసం పట్టించుకోలేదు.
వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ ఆయన పదవి బాధ్యతలను చేపట్టారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో నేతలు, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన టీపీసీసీ పగ్గాలను అందుకున్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి తదితర సీనియర్ నేతలు రేవంత్ బాధ్యతల స్వీకారానికి హాజరయ్యారు. కొందరు రేవంత్ రెడ్డికి ఈ పదవి ఇవ్వడం తమకు ఇష్టం లేదని బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే..! అలాంటి కొందరు నాయకులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇక గాంధీభవన్ లో రేవంత్ కు అనుగుణంగా వాస్తు మార్పులను చేశారు. సీఎల్పీ నేత భట్టి చాంబర్, ఇంతకుముందు పీసీసీ చీఫ్ చాంబర్ కు పక్కనే ఉన్న మీటింగ్ హాల్ ను కలిపి రేవంత్ చాంబర్ గా మార్చారు.